Vinayaka chavithi 2023: వినాయక చవితి ఎప్పుడు? వినాయక చవితి ప్రాధాన్యత ఏమిటి?-ganesh chavithi celebrations date and importance ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vinayaka Chavithi 2023: వినాయక చవితి ఎప్పుడు? వినాయక చవితి ప్రాధాన్యత ఏమిటి?

Vinayaka chavithi 2023: వినాయక చవితి ఎప్పుడు? వినాయక చవితి ప్రాధాన్యత ఏమిటి?

HT Telugu Desk HT Telugu
Sep 12, 2023 01:59 PM IST

Vinayaka chavithi 2023: ఈ సంవత్సరం వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి? వినాయక చవితి ప్రాధాన్యత గురించి బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు చెప్పిన విశేషాలన్నీ తెలుసుకోండి.

వినాయక చవితి 2023
వినాయక చవితి 2023 (pexels)

భారతీయ సంప్రదాయంలో ప్రతీ పూజ, వ్రతములో విఘ్నేశ్వరుని ఆరాధన చాలా ప్రత్యేకమైంది. దక్షిణాయనంలో ప్రతీ మాసానికి ఒక ప్రాధాన్యత ఉంది. విశేషంగా భాద్రపద మాసం వినాయకుని ఆరాధనకు, ఆశ్వయుజ మాసం పార్వతీదేవి (దుర్దాదేవి) ఆరాధనకు, కార్తీకమాసం శివారాధనకు, మార్గశిరం సుబ్రహ్మణ్యుని ఆరాధనకు చాలా ప్రత్యేకమైనవి. భాద్రపదమాసంలో వచ్చే పండుగలలో వినాయక చవితి చాలా ప్రత్యేకమైనది. ప్రప్రథమముగా ఏ పని ప్రారంభించాలన్నా గణపతి పూజతో ప్రారంభిస్తాం. పిన్నల నుండి పెద్దల వరకూ ఎంతో భక్తిశ్రద్ధలతో ఎంతో వేడుకగా చేసుకునేది ఈ చవితి పండుగ.

వినాయకుని విశిష్టత:

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది దేవతా గణాలందరికీ విఘ్నేశ్వరుడు ప్రభువు. అంటే హిందువుల యొక్క సకల దేవతా గణాలకు ఆయనే ప్రభువన్న మాట. బ్రహ్మ మొదట ఈ సృష్టి కార్యాన్ని ప్రారంభించేముందు గణపతిని పూజించినట్లు ‌‌‌ఋగ్వేదం చెబుతోంది. బ్రహ్మవైవర్తన ‌పురాణమందు ‘గణ’ శబ్దానికి “గ” అంటే విజ్ఞానమని ‘ణ’ అంటే మోక్షమని అర్థం చెప్పబడింది. ఈ సృష్టి అంతా గణాలతో కూడుకుని ఉంది. అటువంటి గణాలు అన్నీ కలిస్తేనే ఈ ప్రపంచం. అట్టి ప్రపంచాన్ని అహంకారానికి గుర్తు అయిన మూషికాన్ని అధిరోహించి పాలించే ప్రభువు ఈ మహాగణపతి. ఇట్టి గణపతిని ఆరు రూపాలుగా పూజలు జరుపుతూంటారు. 1. మహాగణపతి, 2. హరిద్ర గణపతి, 3. స్వర్ణ గణపతి, 4. ఉచ్చిష్ట గణపతి, 5. సంతాన గణపతి, 6. నవనీత గణపతి అని అలాగే ప్రపంచం అంతటా వారి వారి ప్రాంతీయతను బట్టి వివిధ నామాలతో ఆరాధిస్తూ ఉంటారు. ఈ జ్యేష్టరాజునకు సిద్ధి, బుద్ధి అను ఇద్దరు కుమార్తెలను విశ్వరూప ప్రజాపతి వివాహం చెయ్యగా వారికి క్షేముడు,లాభుడు అనే కుమారులు కలిగినారు. అందువల్ల ఆయన ఆరాధనవల్ల క్షేమం, లాభం కలుగుతుందని ప్రతీతి.

వినాయకుని జన్మ వృత్తాంతం:

పూర్వం గజముఖుడైన అసురుడు పరమేశ్వరుని మెప్పించి కోరరాని వరముకోరి, తను అజేయుడుగా, ఎవరూ వధించరాని విధంగా ఉండుటకై పరమశివుని తన ఉదరమందు నివసించాలని వరము పొందుతాడు.అది విన్న పార్వతీదేవి కలతచెంది శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా! నందీశ్వరున్ని గంగిరెద్దుగా, తాను గంగిరెద్దువానిగా వేషము ధరించి గంగిరెద్దును ఆడించి గజాసురుని మెప్పించి ఉదర కుహరమందున్న పరమశివుని కోరతాడు. అప్పుడు విష్ణు మాయను గ్రహించి తనకు చేటుకాలము దాపురించినదని తలచి, శివుని ఉద్దేశించి, ప్రభూ! శ్రీహరి ప్రభావముచే నా జీవితము ముగియనున్నది. నా అనంతరం నా శిరస్సు త్రిలోకములు పూజించునట్లు నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు వరము ఇవ్వమని తన శరీరమును నందీశ్వరునకు వశముచేసి శివునకు ఉదర కుపారము నుండి విముక్తి కలిగించాడు.

ఆ శుభవర్తమానము తెలిసిన పార్వతి అభ్యంగన స్నానమాచరించి భర్తను స్వాగతించాలని తలచి నలుగుపిండితో ఒక బాలుని బొమ్మను చేసి దానికి ప్రాణప్రతిష్ట చేసి స్నానవాకిట ముందు కాపలాగా ఉంచుతుంది. అప్పుడు సంతోషముతో పార్వతి చెంత చేరాలని వస్తున్న పరమేశ్వరున్ని చూసిన ఆ బాలుడు అభ్యంతర మందిరము నందు నిలువరించగా ఆ బాలునికి శిరచ్చేదము చేసినాడు. అది చూసిన మహేశ్వరి దుఃఖమును తీర్చుటకై తన వద్ద నున్న ఆ గజశిరమును ఆ బాలునకు అతికించి ప్రాణ ప్రతిష్టచేసి ఆ గజాననునికి, తనరెండవ కొడుకైన కుమారస్వామికి మధ్య భూ ప్రదక్షిణ పోటీ పెట్టి త్రిలోక పూజితుడుగా గణాధిపత్యము ఆ బాలునికి కలిగించినాడు.

చంద్రునికి శాపం:

ముల్లోకములందు పూజలందుకుంటూ కైలాసము చేరుకునే వింత స్వరూపుడైన వినాయకున్ని చూసి చంద్రుడు విరగబడి నవ్వుతాడు. అప్పుడు వినాయకుడు కోపించి ఓరి చవితి చంద్రుడా! ఈరోజు నుండి నిన్ను చూసిన వారందరూ నీలాపనిందలు పాలవుదురు గాక ! అని శపించెను. అప్పుడు చంద్రుడు తన తప్పిదాన్ని మన్నించమని పరిపరివిధాల ప్రార్ధించగా భాద్రపద శుద్ద చవితినాడు నా జన్మ వృత్తాంతము నా జన్మదినమున విని నన్ను పూజించి సేవించి నాకథాక్షతలు శిరస్సున ధరించిన వారికి నీలాపనిందలు కలుగవని శాపవిమోచన అనుగ్రహించాడు.

తొలుత ఈ వినాయక చవితి వ్రత మాహాత్యమును పరమశివుడు కుమారస్వామికి తెలియచేయగా ఆ వ్రత కథను నైమిశారణ్యమందు నూత మహర్షి శౌనకాది మునులకు చెప్పు సమయాన వనవాసము చేస్తున్న ధర్మరాజు కూడా విని ఈ వ్రతమాచరించి తిరిగి రాజ్య సంపదను పొందెను. దమయంతి ఈ వ్రతం ఆచరించి నలమహారాజును పొందెను. శ్రీకృష్ణుడంతటివాడు పాతపాత్రయందు చవితి చంద్రుని చూచి నీలాపనిందలపాలై! ఈ వ్రతమాచంరించి అటు శమంతకమణితో పాటుగా జాంబవతి, సత్యభామ అను ఇద్దరు కాంతామణులను పొందగలిగాడు. మానవుడు ఈ వ్రతమును చేయుట వల్ల సమస్త సిరిసంపదలు పుత్రపౌత్రాభివృద్ధి పొంది సమస్త కోరికలు తీరి సుఖ సౌభాగ్యములు పొందుతారని సూత మునిశ్రేష్టుడు వివరించారు. ఇంతటి మాహాత్మ్యము గల ఈ సిద్ది వినాయక వ్రతము మనమంతా భక్తి ప్రపత్తులతో ఆచరించి పునీతులమౌదాము.

వినాయక చవితి ఎప్పుడు?

పురాణాల ప్రకారం భాద్రపద మాస శుక్ల పక్ష చవితిరోజు విఘ్నేశ్వరుని జననం జరిగినట్లుగా చెప్పబడింది. శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్‌ సిద్ధాంతం పంచాంగ గణితం ఆధారంగా 18 సెప్టెంబర్‌ 2023 భాద్రపద మాస శుక్ల పక్ష చవితి వినాయక చవితిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మధ్యాహ్న సమయానికి చవితి తిథి ఉండటంచేత 11 నుండి 2 గంటల సమయంలో విఘ్నేశ్వర ఆరాధన చేసుకోవడం మంచిదని సూచించారు.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్‌ : 9494981000

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ