Ganesh Chaturthi 2023 : గణేష తత్వం ఏమిటి? విఘ్నేశ్వరుని గణాధ్యక్షుడు అని ఎందుకు అంటారు?
Vinayaka Chaviti 2023 : విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. గణేష తత్వం అంటే ఏంటి? విఘ్నేశ్వరుని గణాధ్యక్షుడు అని ఎందుకు అంటారు? అని వెల్లడించారు.
గణ అనగా పుర్యష్టకము (ఎనిమిది వస్తువులతో కూడుకున్న పురము, నగరము). పుర్యష్టకము అనగా ఎనిమిది. 1) పంచకర్మేంద్రియాలు, 2)పంచ జ్ఞానేంద్రియాలు, 3) పంచభూతాలు, 4) పంచ ప్రాణాలు, 5) కామ 6) కర్మ 7) అవిద్య, 8) మనస్సు. వీటిలో కూడిన సూక్ష్మ దేహం. దీని అధీశ్వరత్వమే గణేశతత్వం. ఎరుపురంగు గణపతికి అత్యంత ప్రీతిపాత్రం. స్వామి మూలాధార క్షేత స్థితుడు. మూలాధారము పృథ్వీతత్వం, రక్తవర్ణం రెండింటితో గణేశునికి సన్నిహిత సంబంధం ఉంది. గణపతిస్వామి వక్రతుండం ఓంకారానికి ప్రతీక. అతని లంబోదరం బ్రహ్మాందానికి సంకేతం అని అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు
విఘ్నే! నరుని చేతిలోని పాశ అంకుశాలు రాగద్వేషాలు నియంత్రించే సాధనాలు, స్వామికి ప్రియమైన భక్ష్యం మోదకం. మోదకం అంటే ఆనందాన్నిచ్చేది. ఈయన కృపావిశేషం వల్ల ఆనందఫలం లభిస్తుంది. గణపతి లంబోదరానికి బిగించిన సర్పము కుండలినీ శక్తికి సంకేతం. గణపతి వాహనం ఎలుక. కానీ స్వామివారికి సింహము, నెమలి, సర్పము కూడా వాహనాలే అని ముద్గలపురాణం తెలియచేస్తున్నది. మత్సరాసురడనే రాక్షసుని సంహార నిమిత్తం వక్రతుండావతారం వికటావతార మెత్తినప్పుడు నెమలి, గణపతి వాహనమైంది. నెమలి కామానికి, గర్వానికి, అహంకారానికి ప్రతీక.
ప్రచారంలో ఉన్న వాహనం ఎలుక. దీనిని ఆఖువు అని, మూషికం అని పిలుస్తారు. ఎలుక క్రోధ లోభమోహమద దురభిమానాలకు ప్రతీక, అంతేకాదు ఎలుక తమోగుణ రజోగుణాల విధ్వంసకారక శక్తి సంకేతం. మూషికుడనే రాక్షసుడు విఘ్నేశ్వరునితో యుద్ధరంగమున శరణజొచ్చగా మూషికాన్ని వాహనంగా చేసుకున్నట్లు పురాణ కథలవల్ల తెలుస్తున్నది. గణపతిని ధాన్యాది దేవతగను పూజిస్తారు. ఎలుక పంటలను నాశనం చేసేది. వినాయకుని వాహనం ఎలుక అయినప్పుడు అది అతని అధీనంలో వుంటుంది. కనుక రైతన్నలు మూషికవాహనమని ఆరాధించడం విశేషం. ఎలుకను అధీనంలో ఉంచుకొని ధాన్యసంపత్తిని రక్షించు అని ప్రార్ధించడం గమనార్హం.
గణేశుడు పరబ్రహ్మ ప్రతీకయే. గ జ్ఞానార్ధ వాచకం ణ నిర్మాణ వాచకం. ఈ గ, ణ రెండింటికి ఈశుడైన పరబ్రహ్మే గణేశుడు. జ్ఞానార్ధ వాచకో గశ్చ ణశ్చ నిర్వాణవాచకః తయోదీశం పరబ్రహ్మం గణేశం...
జ్యోతిశాస్త సంకేతం : గ అంటే బుద్ధి ణ అంటే జ్ఞానం గణాధిపతి అయిన వినాయకుడు బుద్ధిని ప్రసాదిస్తే సిద్ధి తనకు తానుగా ప్రాప్తించగలదు. భాద్రపద శుక్ల చవితి వినాయకుడు పుట్టినరోజు. ఆయన నక్షత్రం హస్తా నక్షత్రం. ఈ కన్యారాశి కాలభవచక్రంలో ఆరవభావం ఇది. ఈ షష్టమభావం శతృ, బుణ, రోగాలను తెలియచేస్తుంది. మానవుని ఆధ్యాత్మిక ప్రగతికి, లౌకిక గతికి ఏర్పడే విఘ్నాలను తెలియచేస్తుందీ భావం. అందుకే ఆ రాశిలో చంద్రుడుండగా పుట్టి ఈ మూడు రకాలయిన విఘ్నాలను మీకు నేను తొలగిస్తాను అని ఆయన అక్కడ పీటం వేసుకున్నాడు. కన్యారాశి నుండి చంద్రుడు సమసప్తక దృష్టితో అని వీక్షించే రాశి మీనరాశి. ఇది కాలరాశి చక్రంలో పన్నెండవ రాశి. కాలభావచక్రంలో పన్నెండవ భావం ఈ భావం ఏం తెలుపుతుంది? వ్యయాన్ని బంధనాన్ని అజ్ఞాత శత్రువుల్ని అవి మానవుని ప్రగతికి విఘ్నాలు కలిగించేవే కదా! అయినప్పటికీ కన్యారాశిలో కూర్చుని ఈ విఘ్నాల పైన కూడా దృష్టివేసి వుంచాడీ స్వామి.
కన్యారాశికి అధిపతి బుధుడు, ఈయన విద్యాప్రదాత. బుద్ధికారకుడు అలాగే విఘ్నేశ్వరుడు కూడా విద్యాబుద్దులకు దేవుడు, హస్తా నక్షత్రంలో జన్మించిన ఈ దేవుడు హస్తిముఖుడు కావడం విశేషం. ఈవిధంగా విఘ్నాలు అనే చీకటిని తొలగించి విద్య అనే వెలుగునూ ఆహారాన్ని అందించి సాధన అనే పడవలో వెళ్ళే కన్యకు చిహ్నంగా కలిగిన కన్యారాశిలో జన్మించడం జ్యోతిశ్శాస్త్ర సంకేతం. మన పురాణ గాథలు, దేవతలు, జ్యోతిశ్చాస్తానికి సృష్టి విజ్ఞానానికి సర్వ స్వరూపాలే.
హస్తా నక్షత్ర సంజాతం విఘ్నేః న్వరం గజాననం పార్వతీ హృదయాంభోధి సోమం సదాస్మరామ్యహమ్. వివిధ ప్రాంతాలలో ; వివిధ దేశాలలో వివిధ రూపాలతో పూజింపబడుతున్నాడు విఘ్నేశ్వ రుడు. మధురైలో వ్యాఘ్రపాదగణేశునిగా దర్శనమిస్తాడు. మైసూరులో హాలిబీడు, హోయసలేశ్వరాలయంలో విష్ణువర్ధనుడు స్థాపించిన బంగారు ఛాయగల గణపతి సాక్షాత్మరిస్తాడు. సిద్ధిగణపతి, శక్తి గణపతి, బొజ్జ గణపతి ముద్గలపురాణం పేర్కొన 32 గణపతులుగా పూజనీయుడు. వాటిలో 16 ముఖ్యమైన మూర్తులున్నారు.
1. బాల గణపతి, 2. తరుణ గణపతి, 3. భక్తి గణపతి, 4. వీర విఘ్నేశ్వర, 5. శక్తి గణపతి, 6. ఉచ్చిష్ట గణపతి, 7. పింగళ, గణపతి, 8. విఘ్న గణపతి, 9. క్షిప్ర గణపతి, 10. హేరంబ గణపతి, 11. లక్ష్మీనాయకం, 12. మహాగణపతి, 13. భువనేశగణపతి, 15.నృత్య గణపతి, 16. ఊర్జ్వ్యగణపతి.. ఇలా ఎన్నో రకాలుగా స్వామి పూజలందుకుంటున్నారని అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.