గృహ ప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి జాబితా ఇదే
కార్తీక మాసంలో గృహప్రవేశం చేసుకుంటే వాస్తు దేవత ఆశీర్వాదాలు లభిస్తాయని పండితులు సూచిస్తారు. అందుకే ఈ మాసంలో ఎక్కువగా గృహప్రవేశాలు జరుగుతాయి. మీరు కూడా ఈ మాసంలో గృహ ప్రవేశ వేడుక చేసుకుంటున్నారా? అయితే ఈ శుభ కార్యానికి కావలసిన పూజా సామాగ్రి పూర్తి జాబితా ఇదే.
కార్తీక, మార్గశిర మాసాలలో ఎక్కువగా గృహప్రవేశాలు, శుభ కార్యాలు, పూజ కార్యక్రమాలు, వ్రతాలు చేసుకుంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో గృహ ప్రవేశం చేసుకునేలా చాలా మంది ప్లాన్ చేసుకుంటారు. శుభ కార్యం ఏదైనా సరే ముందు పూజతోనే ప్రారంభిస్తారు.
ఈ మాసంలో గృహ ప్రవేశం చేయడం వల్ల దైవాశీస్సులు మెండుగా లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ శుభకార్యం నిర్వహించడం కోసం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సరైన విధి విధానాలు ఆచరించాలి. ఇంటి అలంకరణ దగ్గర నుంచి పూజ పూర్తి చేసే వరకు అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది గృహ ప్రవేశం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఆచరించుకుంటారు.
ఇవి చేసుకునేందుకు శుభ ముహూర్తం చూసుకోవడంతో పాటు పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. పూజలో ఏది కొదువ లేకుండా సరిగా తెచ్చుపెట్టుకోవాలి. గృహ ప్రవేశ పూజ మధ్యలో ఏ వస్తువు లేకపోయిన పీటల మీద కూర్చున్న దంపతులు వాటి కోసం బయటకు వెళ్ళడం శుభ సూచికం కాదు. అందుకే ఈ రెండింటికీ కావాల్సిన పూర్తి పూజా సామాగ్రి జాబితా అందజేస్తున్నాం.
గృహప్రవేశ పూజా సామాగ్రి
పసుపు, కుంకుమ, అష్ట గంధం, అగర్ వత్తులు, హారతి కర్పూరం, బళ్ళారి వక్కలు, ఖర్జూరాలు, పసుపు కొమ్ములు, కొబ్బరి కుడుములు, వత్తులు, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, తేనె, చక్కెర, దారపు బంతి, అగ్గి పెట్టెలు, బియ్యం, రూపాయి బిళ్ళలు, తెల్ల లుంగీ, జాకెట్ ముక్కలు, రాగి చెంబు, ఇత్తడి గ్లాసులు, ఉట్టి, నవధాన్యాలు, పాలు పొంగించే గిన్నె, బెల్లం, గోధుమ రవ్వ, వరి పేలాలు, జీడిపప్పు, కిస్ మిస్, సొర పలుకులు, హవనం పొడి, పూర్ణాహుతి సెట్, సమిధలు, దర్భ కట్టలు, బియ్యం పిండి, భాషింగాలు, చీర, ధోతి, జీలకర్ర, మంగళసూత్రాలు, మెట్టెలు, గాజులు, తలంబ్రాలు, ఒడి బియ్యం, గోధుమ పిండి, ఇత్తడి గిన్నెలు, సున్నం డబ్బా, ఇటుకలు, ఇసుక, కర్ర, డబ్బాలు ఉండే విధంగా చూసుకోవాలి.
ఇవి మాత్రమే కాకుండా కొబ్బరి కాయలు, బూడిద గుమ్మడికాయ, పండు గుమ్మడికాయ, మామిడి కొమ్ములు, నిమ్మ కాయలు, కొబ్బరి బొండాలు, తమలపాకులు, ఆవు పాలు, ఆవు పెరుగు, పువ్వులు, పూల మాలలు, అరటి పండ్లు, ఐదు రకాల పండ్లు, అరటి మొక్కలు, గరిక కట్టలు, గోమూత్రం, గోమయం కొద్దిగా ముందుగానే తెచ్చి పెట్టుకోవాలి. ఇవన్నీ తాజాగా తెచ్చుకుంటేనే మంచిది.
సత్యనారాయణ వ్రతం పూజా సామాగ్రి
కొత్తగా ఇంట్లోకి ప్రవేశించిన దంపతులు తప్పనిసరిగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించుకుంటారు. స్వామి ఆశీస్సులతో ఇంట్లో సంపద, శ్రేయస్సు నెలకొనాలని పూజ చేసుకుంటారు. ఈ వ్రతం ఆచరించుకునేందుకు కావాల్సిన పూజా సామాగ్రి జాబితా ఇదే.
పసుపు, కుంకుమ, అగర్ వత్తులు, కర్పూరం, తమలపాకులు, పీటీ చెక్కలు, రూపాయి నాణేలు, ఎండు ఖర్జూరం, పసుపు కొమ్మలు, బియ్యం, టవల్, జాకెట్ ముక్కలు, కలశం కోసం ఇత్తడి చెంబు, మూయయమిది కొమ్మలు, గంధం, కొబ్బరి కాయలు, అరటి పండ్లు, ఎనిమిది రకాల పండ్లు, కొబ్బరి బొండాలు, సత్యనారాయణ స్వామి ఫోటో లేదా బంగారం, వెండితో చేసిన విగ్రహం, బెల్లం, తులసి పత్రి, పువ్వులు, పూల దండలు, నీళ్ళు, అక్షింతలు, పీఠలు, పంచపాత్ర, ఉద్ధరిణి,హారతి కుందు దీపారాధనకు నెయ్యి, కుందులు, వత్తులు, పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె, యాలకులు, దాల్చిన చెక్క, పచ్చ కర్పూరం, లవంగాలు దగ్గర పెట్టుకోవాలి.
గమనిక: ప్రాంతాలు, పండితుల సూచన మేరకు పూజా సామాగ్రి జాబితాలో కొద్దిగా మార్పులు ఉండవచ్చు. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.