సూర్యుని సంతానము - బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
సూర్యుని సంతానము గురించి చాలా మందికి తెలీని విషయాలను బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. మరి ఇప్పుడు సూర్యుని సంతానానికి సంబందించిన వివరాలు తెలుసుకోండి.

కశ్యపునికి అదితికి వివస్వంతుడు (సూర్యుడు) జన్మించెను. త్వష్ట ప్రజాపతి కూతురు సంజ్ఞ సూర్యుని భార్య. కశ్యపుడు వాత్సల్యముతో వీడు అండమందు మృతుడు కాలేదు కద! అని పలికినందున సూర్యునికి మార్తాండుడను పేరు కలిగెను. ఆయనకు సంజ్ఞయందు శ్రాద్ధదేవుడను మనువు, యముడు, యమున కలిగిరి, సంజ్ఞ సూర్యుని తేజస్సును సహింపక తన ఛాయను తన రూపు కలదానిగా కల్పించెను. ఆమె సంజ్ఞకు మ్రొక్కి నిలుచుండెను.
సంజ్ఞ ఆమెతో నేను పుట్టింటికి ఏగెదను. నీవు నా పిల్లలను సంరక్షించుచు నాయింట మండుము. ఈ విషయమును నా భర్తకు ఎన్నడును చెప్పకుము అని ఆజ్ఞా పించెను. ఆమె నాకు శాపమిచ్చువరకు, జుట్టుపట్టి లాగు వరకు ఈ విషయమును తెలుపను అని వాగ్దానము చేసెను. సంజ్ఞ త్వష్ట ప్రజాపతి వద్దకేగెను. అతడు ఆమెను నీవు నీ పతివద్దకు పొమ్మని చెప్పెను. ఆమె బడబా (ఆడు గుర్రము) రూపమును దాల్చి ఉత్తర కురుభూములందు సంచరించుచుండెను అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సూర్యుడు ఛాయను సంజ్ఞగానే భావించి ఆమెయందు కుమారుని కనెను. అతడు సంజ్ఞ మొదటి కొడుకైన శ్రాద్ధదేవుడను మనువును పోలియుండుటచే సావర్ణిమనువు అని పిలువబడెను. కొంతకాలము తరువాత ఛాయకు శనైశ్చరుడు జన్మించెను. అప్పటినుండి ఛాయ తన సవతి బిడ్డలైన శ్రాద్ధదేవుని, సూర్యుని ఆదరింపక తన పిల్లలను ప్రేమగా చూచుచుండెను. ఈ పక్షపాత గుణమును శ్రాద్ధదేవుడు సహించి ఊరకుండెను. కాని యముడు ఓర్వలేక కోపముతో ఛాయను తన్నుటకు పాదమునెత్తెను అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఆమె కోపించి నీ పాదము పడిపోవును గాక అని శపించెను. యముడు తండ్రి వద్దకు వెళ్ళి ఆ వృత్తాంతమును తెలిపి తల్లి ఇచ్చిన శాపమును మరలింపు మని వేడెను. సూర్యుడు నీ తల్లి మాట మిధ్య కాకుండా క్రిములు నీ పాద మాంసమును తినివేయును. పిమ్మట అవి భూమికి పోవును. అందువలన నీ తల్లి శాపము ఫలించును. పిమ్మట నీకు శాప పరిహారమగును అని యముని అనుగ్రహించెను.
తరువాత ఆయన ఛాయతో తల్లి తన బిడ్డలను ఒక్క రీతిగా చూడవలెను. నీవు కొందరియెడల అధిక ప్రేమను, కొందరి యెడల నిరాదరణమును చూపుటకు కారణమేమని ప్రశ్నించెను. ఆమె నిజము చెప్పకుండుటచే యోగ దృష్టితో జరిగిన విషయమును గ్రహించి ఛాయను శపింపబూని ఆమె జుట్టును పట్టుకొనెను. అంత భయముతో ఆమె జరిగిన వృత్తాంతమును తెలిపెను. సూర్యుడు కోపముతో త్వష్టప్రజాపతి వద్దకు వెళ్ళెను. త్వష్టప్రజాపతి సూర్యుని శాంతపరచి నీ తేజస్సు సంజ్ఞకు భరింపరానిదయ్యెను. నీ తేజస్సును తగ్గించెదను. పిమ్మట నీవు ఉత్తర కురుభూములందు బడబా రూపములో సంచరించుచున్న ఆమె వద్దకు ఏగుమని చెప్పెను.
సూర్యుడు అందుకు సమ్మతించెను. త్వష్ట సూర్యుని చిత్రికపట్టి ఆయన తేజస్సును తగ్గించెను. అప్పుడు రాలిన రజముతో విష్ణుచక్రమును నిర్మించెను. సూర్యుడు ఉత్తర కురుభూములకు వెళ్ళి పాతివ్రత్య నియమముతో జీవులకు అదృశ్య అయిఉన్న సంజ్ఞను తన యోగశక్తితో చూచెను.
అశ్వరూపమున ఆమెను ముఖమున గవయబోయెను. ఆమె పెడమొగము పెట్టుటచే శుక్ర మామె నాసికా పుటములందు పడి నాసత్యులు అను ఇరువురు దేవతలు జన్మించిరి. వారిని అశ్వినీ దేవతలని కూడా అందురు. వారికే దస్రులను పేరు కూడా కలదు. వారు జంట దేవతలు.
యముడు తన అపరాధమును తలచి దుఃఖించి ధర్మాత్ముడై ధర్మరాజను ప్రసిద్ధిని పొందెను. పితృదేవతలపై ఆధిపత్యమును, లోకపాలక పదవిని పొందెను. సావర్ణిమనువు మేరుగిరిపై తపస్సున కేగెను. శనిగ్రహత్వమును పొందెను. యమున లోకపావనమైన నదిగా మారెను అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.