భారతీయ సంప్రదాయం ప్రకారం కొన్ని జంతువులు ధనం, శక్తి వంటి వాటిని తీసుకొస్తాయి. వాస్తు ప్రకారం ఈ జంతువులు ఇంట్లో ఉండడం వలన అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది, డబ్బుకి లోటు ఉండదు, ప్రశాంతత ఉంటుంది. అదే విధంగా ఇంట్లో కానీ, పని ప్రదేశంలో కానీ ఈ జంతువులు ఉంటే పురోగతిని చూస్తారు.
ఏనుగు, చేప, గుర్రం, తాబేలు ఇలా చాలా రకాల జంతువులు మనకి సానుకూల ఫలితాలను తీసుకొస్తాయి. మరి ఏ జంతువులు ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుంది, సానుకూల శక్తి వ్యాపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏనుగుని చాలా శుభ జంతువుగా భావిస్తారు. వాస్తు ప్రకారం ఏనుగు ఫోటో లేదా విగ్రహం వంటివి ఇంట్లో ఉన్నట్లయితే శక్తి కలుగుతుంది, అదృష్టం కూడా కలిసి వస్తుంది. ప్రతికూల శక్తి ఆ ఇంటి నుంచి తొలగిపోతుంది. విపరీతమైన అదృష్టం కలగాలంటే వెండి లేదా కాంస్య ఏనుగుని ఇంట్లో పెట్టండి. వాస్తు ప్రకారం ఇంట్లో ఏనుగుని పెట్టేటప్పుడు ముఖద్వారం వైపు ఉండేటట్లు చూసుకోండి. అలా ఉంటే సక్సెస్ కూడా కలిసి వస్తుంది.
హిందూ సాంప్రదాయం ప్రకారం, ఫెంగ్‌షూయ్ ప్రకారం తాబేలు మంచి ఫలితాలను అందిస్తుంది. ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది, ఆర్థికపరంగా బావుంటుంది. క్రిస్టల్ లేదా మెటల్ తాబేలుని ఇంట్లో పెట్టొచ్చు. ఉత్తరం లేదా వాయువ్యం వైపు తాబేలుని పెడితే ఐశ్వర్యం పెరుగుతుంది, ఆర్థికపరంగా బావుంటుంది. ఇంకా మంచి ఫలితాలు కలగాలంటే తాబేలుని నీటిలో పెట్టండి.
పక్షులు స్వతంత్రం, ప్రశాంతత, కమ్యూనికేషన్ వంటి వాటికి సంకేతం. ఇంట్లో పక్షులు ఉంటే ప్రశాంతత కలుగుతుంది. బాల్కనీ లేదా లివింగ్ రూమ్‌లో పక్షుల ఫోటోలను లేదా పక్షులను పెట్టొచ్చు. అయితే పక్షులను పెట్టేటప్పుడు పంజరంలో మాత్రం పెట్టకండి.
చేపలను ఇంట్లో ఉంచితే ప్రతికూల శక్తి తొలగి, సానుకూల శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా అరోవానా, గోల్డ్‌ఫిష్ వంటివి ఆర్థికపరంగా సమస్యలను తొలగించి, డబ్బు ఎల్లప్పుడూ ప్రవహించేలా చేస్తాయి. కొత్త అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. ఇంట్లో ఎక్వేరియంని పెట్టేటప్పుడు ఈశాన్యం వైపు పెడితే మంచిది. ఇలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి.
ఇంట్లో గుర్రాన్ని పెట్టడం వలన ఎంతో మంచి జరుగుతుంది. మీ పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి, ఆర్థికపరంగా బావుంటుంది, ఎదుగుదల ఉంటుంది. ముఖ్యంగా ఏడు గుర్రాల ఫోటోని ఇంట్లో ఉంచితే చాలా మంచి జరుగుతుంది. దక్షిణ గోడకు ఏడు గుర్రాల ఫోటోని పెట్టడం మంచిది. లివింగ్ రూమ్ లేదా ఆఫీస్‌లో పెడితే కెరీర్‌లో కలిసి వస్తుంది.
పులి లేదా సింహం ఫోటోలు, పెయింటింగ్లు వంటివి పెడితే అనేక విధాలుగా లాభాలు పొందవచ్చు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. దక్షిణం లేదా ఆగ్నేయం వైపు ఈ పెయింటింగ్స్‌ని పెడితే సక్సెస్‌ని అందుకోవచ్చు.