Deepavali 2024: అయిదు రోజుల దీపావళి, ఈరోజు ధంతేరాస్‌తో పండుగ మొదలు, ఏ రోజు ఏ పండుగంటే
Deepavali 2024: వెలుగుల పండుగ దీపావళి. ఈ పండుగను ఐదు రోజుల పాటు నిర్వహించుకుంటారు. దీపావళి పండుగ ధనత్రయోదశితో మొదలవుతుంది. అయిదు రోజుల పాటూ అయిదు పండుగలను నిర్వహించుకుంటారు. ఆ పండగలేవో తెలుసుకోండి.

దీపాల పండుగ అయిన దీపావళి కోసం కోట్ల మంది వేచి ఉంటారు. భారతదేశంలో నిర్వహించుకునే అతిపెద్ద పండుగలలో దీపావళి ఒకటి. ఇంటిని అందమైన దీపాలు, ఎలక్ట్రిక్ లైట్లతో అలంకరిస్తారు. తమ ప్రియమైనవారికి కొత్త దుస్తులను బహుమతిగా ఇస్తారు. అనేక ఆచారాలను పాటిస్తారు. స్వీట్లను ఇచ్చిపుచ్చుకుంటారు. కొన్ని చోట్ల దీపావళి పండుగ రోజు కాళీ దేవిని, లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. దీపావళిని అయిదు రోజుల పాటూ పండుగలా నిర్వహించుకుంటారు. ధంతేరాస్, ఛోటి దీపావళి, లక్ష్మీ పూజ, గోవర్ధన్ పూజ, భాయ్ దూజ్ ఇలా వరుసగా పండుగలు నిర్వహించుకుంటారు. దీపావళి పండుగలో ప్రధానంగా ఐదు రోజులపాటూ నిర్వహిస్తారు. ఆ పండుగలు ఎప్పుడో, ఏమిటో తెలుసుకోండి.
ఈ ఏడాది అక్టోబర్ 29న ధంతేరస్ నిర్వహించుకుంటున్నాం. త్రయోదశి తిథి అక్టోబర్ 29 ఉదయం 10:31 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 29 మధ్యాహ్నం 1:15 గంటలకు ముగుస్తుందని ద్రిక్ పంచాంగం తెలిపింది. బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలను కొనుగోలు చేయడానికి ధనత్రయోదశి సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా పరిగణిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు.
అక్టోబర్ 29 న యమ దీపం కూడా పెడతారు. అక్టోబర్ 29 సాయంత్రం 6:37 గంటలకు ప్రారంభమై రాత్రి 7:56 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో ప్రజలు అకాల మరణ భయం నుండి బయటపడటానికి యమదేవుడిని ప్రార్థిస్తారు.
ఛోటీ దీపావళి:
ఛోటీ దీపావళిని నరక చతుర్దశిగా కూడా జరుపుకుంటారు. నరకాసురుడిపై శ్రీకృష్ణుడు సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజు జరుపుకుంటారు. ఉదయాన్నే నిద్రలేచి పుణ్యస్నానాలు ఆచరించడం వల్ల శరీరాన్ని, మనస్సును పాపాల నుంచి ప్రక్షాళన చేయవచ్చని నమ్ముతారు. ఈ పండుగ అక్టోబర్ 30న చోటి దీపావళి నిర్వహించుకోనున్నారు.
లక్ష్మీ పూజ:
అక్టోబర్ 31న లక్ష్మీపూజ నిర్వహించనున్నారు. అమావాస్య తిథి అక్టోబర్ 31 మధ్యాహ్నం 3:52 గంటలకు ప్రారంభమై నవంబర్ 1 సాయంత్రం 6:16 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున, అదృష్టం, శ్రేయస్సు మరియు ఆనందం కోసం లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఈ రోజే దీపావళిని దేశమంతా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు.
గోవర్ధన్ పూజ:
ఈ ఏడాది నవంబర్ 2న గోవర్ధన్ పూజ వస్తుంది. ఇంద్రునిపై శ్రీకృష్ణుడు సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజు నిర్వహించుకుంటారు. సాధారణంగా గోవర్ధన పూజ దీపావళి మరుసటి రోజు వస్తుంది. ధార్మిక గ్రంథాల ప్రకారం కార్తీక మాసంలో ప్రతిపాద తిథిలో గోవర్ధన పూజ చేయాలి.
భాయ్ దూజ్:
భాయ్ దూజ్ సోదర సోదరీమణుల మధ్య బేషరతు బంధాన్ని, ప్రేమను తెలియజేసే పండుగ. దీపావళి చివరి రోజున జరుపుకునే భాయ్ దూజ్ పండుగను నిర్వహించుకుంటారు. సోదరుల ఆయురారోగ్యాల కోసం, మంచి ఆరోగ్యం కోసం అక్కా చెల్లెళ్లు ప్రార్థించే పండుగ ఇది. అందుకు ప్రతిఫలంగా అన్నా లేదా తమ్ముడు సోదరికి బహుమతులు ఇచ్చి ప్రేమను కురిపిస్తాడు.