Love and Romance: లవ్, రొమాంటిక్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలంటే ఫెంగ్ షూయి చెప్పిన ఈ ఒక్క పని చేయాల్సిందే!
Love and Romance: ప్రతి ఒక్కరి జీవితంలో లవ్, రొమాన్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. భాగస్వామి పట్ల ప్రేమ, గౌరవం, అంకిత భావం ఉంటేనే బంధాలు శాశ్వతంగా, సంతోషంగా నిలుస్తాయి. ఫెంగ్ షూయి ప్రకారం జీవితంలో లవ్, రొమాంటిక్ లైఫ్ సంతోషంగా, శాశ్వతంగా ఉండాలంటే చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది.
ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ, రొమాన్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. బిజిబిజీ లైఫ్ లొ గజిబిజిగా గడుపుతున్న వారికి తమ జీవిత భాగస్వామితో ప్రేమపూర్వకమైన, నాణ్యతతో కూడిన సమయం గడపటం చాలా అవసరం. ఇంట్లో శాంతి వాతావరణం, సంతోషం నెలకొంటేనే బయట అన్ని విషయాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అందుకే ఫెంగ్ షూయిలో కూడా ప్రేమ, శృంగారం, రొమాన్స్ వంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వైవాహిక జీవితంలోని సమస్యలను అధిగమించడానికి, ప్రేమ జీవితంలో ఆనందాన్ని పొందడానికి ఫెంగ్ షుయీలో అనేక ప్రత్యేక పరిష్కారాలను పొందుపరిచారు.
లవ్, రొమాంటిక్ లైఫ్ బాగుండాలంటే ఏం చేయాలి?
లవ్, రొమాంటిక్ లైఫ్ ను ఎంజాయ్ చేయాలంటే ఫెంగ్ షుయీ ప్రకారం ఒక ప్రత్యేకమైన జాతికి చెందిన బాతు బొమ్మలను ఇంట్లో ఉంచుకోవాలి. వీటినే మాండరిన్ బాతు అంటారు. రెండు మాండరిన్ బాతులు కలిగిన బొమ్మకానీ, చిత్రం కానీ ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం ప్రేమ, వైవాహిక జీవితాలకు శుభప్రదంగా భావిస్తారు.
మాండరిన్ బాతు ప్రత్యేకత:
మాండరిన్ బాతుకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఇవి ఎప్పుడూ జంటగా మాత్రమే ఉంటాయి. జంటలో బాతులో ఒకటి చనిపోతే మరొకటి కూడా తన భాగస్వామి నుంచి విడిపోయిన బాధతో చనిపోతుందని చెబుతారు. అంతటి ప్రేమ, అంకితభావం కలిగిన మాండరిన్ జాతి బాతులను ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం వల్ల ఇంట్లోని వ్యక్తుల మధ్య ప్రేమ కూడా అంతే స్వచ్ఛంగా, అంకిత భావంతో ఉంటుందని విశ్వాసం.
మాండరిన్ బాతును ఇంట్లో ఉంచడం వల్ల ఏం జరుగుతుంది?
ఫెంగ్ షూయి ప్రకారం మాండరిన్ బాతులు ప్రేమకు చిహ్నం. ఇవి వివాహిత జంటల మధ్య ప్రేమను చెక్కుచెదరకుండా ఉంచుతాయని, వైవాహిక జీవితంలోని సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు. వీటి కారణంగా భార్యాభర్తల మధ్య పెరుగుతున్న దూరం తగ్గుతుంది. ప్రేమ, ఆప్యాయత, అంకితభావానికి చిహ్నమైన ఈ మాండరిన్ బాతును ఇంట్లో ఉంచేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం అవసరమని ఫెంగ్ షూయీలో పేర్కొన్నారు.
మాండరిన్ బాతును ఇంట్లో ఎక్కడ, ఎలా ఉంచాలి?
వైవాహిక జీవితం కోసం..
ఫెంగ్ షుయ్ నియమాల ప్రకారం, ఇంట్లో మాండరిన్ బాతు చిత్రం లేదా బొమ్మను నైరుతి దిశలో ఉంచాలి. పడకగదిలోని నైరుతి మూలలో ఉంచితే మరిన్ని మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇది భార్యాభర్తల మధ్య ప్రేమ, రొమాన్స్ ను పెంచుతుందని, సంబంధాల్లో సాన్నిహిత్యాన్ని, అంకితభావాన్ని కొనసాగిస్తుందని నమ్ముతారు.
ప్రేమికుల కోసం..
పెళ్లి కాని వారు కూడా ఇంట్లో తమ పడకగదిలో మాండరిన్ బాతు బొమ్మను లేదా ఫొటోను ఉంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వీరు ప్రేమించే వ్యక్తితో తమ బంధం బలంగా ఉంటుంది. వివాహానికి ఎలాంటి ఆటంకాలు రావు.
మాండరిన్ బాతు విషయంలో చేయకూడని పొరపాట్లు..
ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. మాండరిన్ బాతు చిత్రం గానీ బొమ్మ గానీ జంట పక్షులను కలిగి ఉండాలి. ఒకే బాతు ఉన్న చిత్రాన్ని లేదా బొమ్మను ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం వల్ల ప్రేమ, వైవాహిక జీవితంలో మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
అలాగే ప్రేమికులు, వివాహితులు తమ పడకగదిలో మూడు బాతులున్న చిత్రాలు, గానీ బొమ్మలు కానీ అస్సలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల మీకూ, మీ భాగస్వామికీ మధ్య మూడో వ్యక్తి వచ్చే అవకాశాలున్నాయి. మూడో వ్యక్తి జోక్యం మీ బంధాన్ని ప్రమాదంలో పడేస్తుందని గుర్తుంచుకోవాలి.
ఫెంగ్ షూయి ప్రకారం ప్రేమించిన వారికి లేదా భర్త లేదా భార్య తమ భాగస్వామికి మాండరిన్ బాతు చిత్రాన్ని లేదా బొమ్మను బహుమతిగా ఇవ్వచ్చు. ఇది వైవాహిక జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది. సంబంధాలలో మాధుర్యాన్ని పెంచుతుందని నమ్ముతారు.