కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం చేస్తే లక్ష్మీ కటాక్షం మీపైనే
కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం పెట్టడం వల్లే కాదు... ఉసిరికాయలు దానం చేయడం వల్ల కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇలా ఉసిరికాయలు దానం చేసిన వారికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది.
కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే పదిహేనవ రోజు పున్నమి. ఇదే రోజు కార్తీక పౌర్ణమి పండుగను నిర్వహించుకుంటారు. ఈరోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శివాలయాలు ఈ పౌర్ణమి రోజున జన సందోహంతో నిండిపోతాయి. ఈ పున్నమి దినాన శివునికి రుద్రాభిషేకం చేయిస్తే సకల సంపదలు కలుగుతాయని ఎంతోమంది నమ్మకం. ఈ పండుగను ‘దేవ దీపావళి’ ‘త్రిపురి పూర్ణిమ’ అని కూడా పిలుస్తారు.
మహాభారతం ప్రకారం కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే ఈ కార్తీక పౌర్ణమి అంటారు. తమను హింసిస్తున్న తారకాసురుడు మరణించాడన్న ఆనందంతో ప్రజలు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారని... అందుకే దీన్ని దేవ దీపావళి అంటారని చెబుతారు.
త్రిపురాసురుడిని అంతమొందించాక రాక్షసుల పాలన ముగిసిందన్న ఆనందంలో మహాశివుడు తాండవం చేశారని కూడా అంటారు. ఈ రోజున దీపం వెలిగిస్తే అన్ని పాపాలు హరించుకుపోతాయని చెబుతారు. ఎంతోమంది ఈ విశిష్ట పర్వదినం రోజు సత్యనారాయణ వ్రతం నిర్వహించుకుంటూ ఉంటారు.
కార్తీక మాసంలో ఉసిరి దీపం పెడితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని చెబుతారు. ఉసిరి కాయలో దీపం పెట్టడం అంటే లక్ష్మీదేవిని, పరమేశ్వరుడి నిలయంలో పెట్టినట్టు అర్థం. కార్తీక పౌర్ణమి రోజు శివుడి సమక్షంలోనే ముక్కోటి దేవతలు ఉంటారని, ఆ శివాలయంలోనే ఉసిరి దీపాన్ని పెడితే దరిద్రాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు.
ఇక పౌర్ణమి రోజు ఉసిరి దీపం పెట్టడం వల్లే కాదు... ఉసిరికాయలు దానం చేయడం వల్ల కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇలా ఉసిరికాయలు దానం చేసిన వారికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. కార్తీకమాసంలో ఉసిరికాయ దానం చేయడమే కాదు... ఏది దానం చేసినా ఆ పుణ్యం వెంటే ఉంటుందని చెబుతారు. కార్తీక పౌర్ణమి రోజు ఉసిరిని దానం చేసి, దీపారాధన చేసి, కార్తీక పురాణాన్ని చదివితే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నది లేదా ఏదైనా సరస్సులో స్నానం చేయాలి. ఇప్పుడు సిటీలలో నివసించే వారికి నదులు, సరస్సులు ఉండవు కాబట్టి ఇంట్లోనే సూర్యోదయానికి ముందే స్నానం చేసి దీపం పెట్టుకోవాలి. ఈ రోజు దీపదానం చేస్తే జీవితంలో ఆనందం, ఐశ్వర్యం రెండూ కలుగుతాయి.
దేవుడు ఆశీస్సులు మీ వెంటే ఉంటాయి. ఈ విషయాన్ని విష్ణు దేవుడే బ్రహ్మకు స్వయంగా చెప్పినట్టు పురాణాలు చెబుతున్నాయి. అయితే దీపాన్ని ఎప్పుడూ ఒక్కటే దానం చేయకూడదు, దానికి జోడి దీపాన్ని కూడా పెట్టి కాస్త పసుపు, కుంకుమను వేసి అప్పుడు దానం చేయాలి. దీపదానంతో బియ్యం, పప్పులు వంటివి కూడా కలిపి దానం చేస్తే మరింత పుణ్యం.