Karthika Masam 2022 : కార్తీకమాసంలో ఈ ఐదు పనులు చేస్తే.. పుణ్యఫలం పొందుతారు..
Karthika Masam 2022 Rituals : కార్తీక మాసములో ప్రతీ రోజు పుణ్య దినంగా పరిగణిస్తారు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. ఉదయాన్నే తలస్నానాలు.. పూజలు చేస్తారు. నాన్ వెజ్ తినడం మానేస్తారు. అయితే కార్తీక మాస వైశిష్ట్యము ఏంటి? ఏమి చేస్తే.. మరింత పుణ్య ఫలం దక్కుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Karthika Masam 2022 Rituals : కార్తీక మాసము చంద్రుడు పౌర్ణమి రోజు కృత్తిక నక్షత్రము నందు దగ్గరగా వచ్చిన సమయమునే కార్తీక మాసము అంటారు. కృత్తిక నక్షత్రానికి అధిపతి అగ్ని దేవతలు. కార్తీక మాసములో సూర్యుడు తులారాశియందు ఉంటాడు. కార్తీకే తపో మాసః కార్తీక మాసముతో సమానమైనటువంటి మాసము మరొకటి లేదని శాస్త్ర వచనము చెప్తుందని.. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
కార్తీక మాసములో ప్రతీ రోజు పుణ్య దినంగానే పరిగణిస్తారు. కార్తీకమాసంలో ఏ వ్యక్తి అయినా ముఖ్యముగా ఐదు విషయాలను పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీక స్నానము
కార్తీక మాసములో ప్రాతః కాలమునందు స్నానమాచరించడం. ఈ స్నానమును సంకల్ప సహితముగా నదులయందు లేదా సముద్రములయందు స్నానం ఆచరిస్తే మంచిది.
కార్తీకదీపము
కార్తీక మాసములో ఆలయాలయందు గాని.. గోశాలయందు.. తులసీ కోట వద్ద.. పూజామందిరములో, స్వగృహంలో.. దేవాలయము వంటి చోట్ల దీపారాధన చేయడం వలన కార్తీక మాస పుణ్యఫలం ప్రాప్తిస్తుంది.
దేవతారాధన
కార్తీక మాసంలో విశేషమైన శివారాధన.. అలాగే దశమి, ఏకాదశి ద్వాదశి, పౌర్ణమి రోజున విష్ణు మూర్తి ఆరాధన.. కార్తీక శనివారాలు దుర్గాదేవి ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది.
కార్తీక యాత్ర వనభోజనం
కార్తీకమాసంలో చేసేటువంటి పుణ్యక్షేత్ర దర్శనం, వనభోజనములు విశేషమైన ఫలితాలు ఇస్తాయి.
కార్తీక మాస వ్రతములు
కార్తీక మాసంలో కేదారేశ్వర గౌరీ వ్రతము, లక్షపత్రి పూజ, క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, సత్యనారాయణ స్వామి వ్రతం వంటి వ్రతాలను ఆచరిస్తే మంచిది. అలాగే కార్తీక మాసంలో దానములు చేయటం వలన కూడా విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది.
సంబంధిత కథనం