Dev Uthani Ekadashi: రేపే దేవుత్తాని ఏకాదశి- శుభ సమయం, పూజా విధానం, పాటించాల్సిన నియమాలు ఇవే-dev uthani ekadashi tomorrow shubha samayam worship lakshmi narayan with this simple method ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dev Uthani Ekadashi: రేపే దేవుత్తాని ఏకాదశి- శుభ సమయం, పూజా విధానం, పాటించాల్సిన నియమాలు ఇవే

Dev Uthani Ekadashi: రేపే దేవుత్తాని ఏకాదశి- శుభ సమయం, పూజా విధానం, పాటించాల్సిన నియమాలు ఇవే

Gunti Soundarya HT Telugu
Nov 11, 2024 06:17 PM IST

Dev Uthani Ekadashi: నవంబర్ 12 దేవుత్తాని ఏకాదశి జరుపుకోనున్నారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు ఆరాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది. విష్ణువును ఆరాధించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సంతోషం లభిస్తాయని నమ్ముతారు. ఈ ఏకాదశి విశిష్టత, పూజా విధానం, పాటించాల్సిన నియమాలు తెలుసుకుందాం.

దేవుత్తాన ఏకాదశి శుభ సమయం
దేవుత్తాన ఏకాదశి శుభ సమయం (pixahive)

కార్తీక మాసం శివుడు, విష్ణువు ఆరాధనకు చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో శుక్ల పక్షంలోని ఏకాదశి కూడా గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజును దేవుత్తాని ఏకాదశి అంటారు. దీన్ని ప్రబోధ ఏకాదశి, బృందావన ఏకాదశి అని కూడా పిలుస్తారు.

ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువు నాలుగు నెలల తర్వాత నిద్ర నుండి లేస్తాడు. ఈ రోజు వివాహాలతో సహా అన్ని శుభ వేడుకలకు నాంది పలుకుతుంది. దృక్ పంచాంగ్ ప్రకారం ఈ సంవత్సరం నవంబర్ 12, 2024న దేవుత్తాన ఏకాదశి జరుపుకుంటారు. ఈ సందర్భంగా విష్ణుమూర్తి, లక్ష్మి, తులసి మాతలను పూజిస్తారు. ముఖ్యంగా తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తారు. తులసి వివాహం కూడా ఇదే రోజు జరిపిస్తారు.

ఈ రోజున తులసి దేవి, శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి వివాహం జరిపిస్తారు. దేవుత్తాని ఏకాదశి నాడు మీరు కూడా విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి చాలా సులభమైన పద్ధతిలో పూజ చేయవచ్చు. దేవుత్తాని ఏకాదశి తిథి, పూజావిధి, పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం.

దేవుత్తాని ఏకాదశి ఎప్పుడు?

దృక్ పంచాంగ్ ప్రకారం దేవుత్తాని ఏకాదశి నవంబర్ 11, 2024న సాయంత్రం 06:46 గంటలకు ప్రారంభమై నవంబర్ 12న మరుసటి రోజు సాయంత్రం 04:04 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం దేవుత్తాని ఏకాదశి నవంబర్‌ 12 జరుపుకుంటారు.

దేవుత్తాని ఏకాదశి పూజ విధి

దేవుత్తాని ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిలో ఒక చిన్న పీట మీద ఎరుపు లేదా పసుపు వస్త్రం వేసి విష్ణుమూర్తి విగ్రహాన్ని ఉంచండి.

ఇప్పుడు విష్ణువు ముందు దీపం వెలిగించి పండ్లు, పువ్వులు, ధూపం, నైవేద్యాలు సమర్పించండి. పూజలో పంచామృతంలో తులసి ఆకు వేసి విష్ణుమూర్తికి సమర్పించాలి. సాయంత్రం విష్ణువును ఆచారం ప్రకారం పూజించండి. నెయ్యి దీపం వెలిగించండి. విష్ణువు, లక్ష్మీదేవికి ఖీర్ సమర్పించండి. విష్ణు సహస్ర నామం, బీజ్ మంత్రాలను జపించండి. దేవుత్తాని ఏకాదశి కథను వినండం లేదా చదవడం చేయాలి.

తొలి ఏకాదశితో చాతుర్మాసం ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. నాలుగు నెలల పాటు నిద్రలో ఉన్న శ్రీ మహా విష్ణువు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు మేల్కోంటాడు. దీన్నే దేవుత్తాని ఏకాదశి అంటారు. ఈరోజు ఉపవాసం ఉండి, విష్ణు పూజ చేస్తే అఖండ సంపద లభిస్తుంది. సర్వ పాపాలు తొలగిపోతాయి. ఏకాదశి ఉపవాసం ఆచరిస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు ఉపవాసం ఉన్న వారికి జీవితంలో దేనికి లోటు ఉండదు. ధనధాన్య వృద్ధి కలుగుతుంది. సంపద పెరుగుతుంది.

నిరాకరణ: ఈ కథనంలోని సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వాటిని స్వీకరించే ముందు సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

Whats_app_banner