జ్యేష్ఠ శుక్ల దశమి నాడు గంగా దేవి దివి నుండి భువికి దిగిన రోజే కాదు, ఆమె విష్ణుపాదాల నుంచి పుట్టినరోజు కూడా. గంగాదేవి మొదట్లో సృష్టికర్త బ్రహ్మ కమండలంలో ఉండేది. విష్ణువు వామనావతారమెత్తినప్పుడు బలిచక్రవర్తి స్వామికి మూడడుగులు దానమిస్తున్నప్పుడు, ఆయన పాదాలు కడగడానికి వామనుడి ఎడమ కాలిగోటి రంధ్రం నుండి గంగాదేవి జన్మించింది. అప్పుడు ఆ గంగను బ్రహ్మ మొదటగా ఉపయోగించాడు. అదే బ్రహ్మ కడిగిన పాదం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పూర్వకాలంలో హిమవంతుడనే రాజు, ఆయన భార్య మనోరమ ఉండేవాళ్లు. వాళ్ళ పెద్ద కుమార్తె గంగ, రెండవ కుమార్తె ఉమ. స్వేదగా ప్రవహించకలిగే గుణమున్న గంగను స్వర్గలోకానికి పంపిస్తే, ఆ జలాలను ఉపయోగించుకొని మేము తరిస్తామని దేవతలు హిమవంతుని ప్రార్థించగా సరే అన్నాడు. అలా ఆ దేవనది గంగ స్వర్గలోకంలో ప్రవహించింది. ఆయన రెండవ కుమార్తె ఉమ తన తపస్సుచే శివుడిని మెప్పించి అర్ధాంగి అయి, హైమావతిగా తన పేరు సార్ధకం చేసుకుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సగర చక్రవర్తి, సత్యహరిశ్చంద్రుని వంశజుడైన దిలీప మహారాజు కుమారుడు భగీరథుడు తన పూర్వీకులకు పితృలోక ప్రాప్తికై గంగను భూమిపై అవతరించడానికి శివుని గూర్చి తపస్సు చేసిన ఫలితంగా, గంగ ప్రవాహవేగాన్ని తగ్గించడానికై తన జటాజూటాన్ని సడలించాడు. తద్వారా గంగ సురలోకం నుంచి వచ్చి శివుని శిరస్సుపై విహరించసాగింది.
మరల భగీరథుని తపఃఫలంగా శివుని జటాజూటం నుంచి భువికి వచ్చే మార్గంలో సప్తవాహినిగా చీలింది. హ్లాదిని, పావని, నళిని అనే మూడుపాయలు తూర్పు దిశగాను, సింధువు అనే రెండు పాయలు, సుచక్షువుతో మూడు పాయలుగా చేరి పశ్చిమంవైపున, చివరకు ఏదో పాయి మిక్కిలి ప్రవాహంగా భగీరథుని వెంట నడచింది. అద్భుతమైన సోయగాలతో ప్రవహిస్తున్న గంగ మార్గ మధ్యంలో జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తగా, ఆయన ఆగ్రహంతో గంగను పానం చేశాడు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మరల భగీరథుని కోరిక మేరకు ఆయన చెవుల ద్వారా విడిచిపెట్టబడి, జాహ్నవి అనే పేరుతో ప్రవహిస్తూ, పాతాళ లోకంలో కపిల మహర్షి శాపం వల్ల బూడిదగా మారిన సగర పుత్రులపై ప్రవహించి, వారికి శాప విమోచనం కలిగించి, పితృలోక ప్రాప్తిని కలిగించింది. ఇలా మూడు లోకాలలో ప్రవహించి త్రిపథగామిని అయింది. భగీరథుడు హరిద్వారం నుండి గంగను ముందుకు నడిపించి, కాశీ క్షేత్రంలో మణికర్ణికతో విడిచిపెట్టుట వలన ఈ క్షేత్రం ముక్తిదాయినిగా, ద్విగుణీకృత శక్తివంతమైంది.
ఇక్కడ స్నానం ఆచరిస్తే విష్ణు పదం తప్పక ప్రాప్తిస్తుంది. అందువల్ల ఇది వైకుంఠ ద్వారమున వస్తుంది. గంగానది భూమిమీద ప్రవహించేటప్పుడు అనేక మూలికల వృక్షాల అరణ్యాలలోంచి ప్రవహించటం వలన గంగనీరు స్వచ్ఛత పొందుతుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
జ్యేష్ఠ శుక్ల దశమి హస్త నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు దశపాపహర దశమిగా పేర్కొంటారు. పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది, ప్రళయకాలంలో కూడా నశించనిది అవిముక్తక్షేత్రం. కాశీ పుణ్యక్షేత్రం, పుణ్యతీర్ధం కూడా. ఇక్కడ విశ్వేశ్వరస్వామితో సమప్రాధాన్యం కలిగింది గంగానది. కాశీలో దశపాపాలు పోగొట్టుకోవాలంటే అశ్వమేధ ఘట్టంలో పదిరోజులు నియమనిష్ఠలతో దశపాపహర వ్రతం ఆచరించాలి. ఈ పుణ్య దినాన గంగానదిలో స్నానం చేస్తే శ్రేష్టం.
"ఓం నమశ్శివాయై నారాయణ్యై దశపాపహరాయై గంగాయై నమో నమః" అంటూ స్నానం చేస్తూ.. "ఏతజ్జన్మ జన్మాంతర సముద్భూత దశవిధ పాపక్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం దశపాపహర మహాపర్వ నిమిత్తం స్నానమహం కరిష్యే" అని చెప్పుకోవాలి అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
"హరిపదపాద్యతరంగిణి గంగే ! హిమవిధుముక్తాధవళతరంగే
దూరీకృత నును దుష్కృతి భారం గురుకృపయా భవసాగర సారం"
అని శంకరాచార్య గంగాస్తోత్రం చదువుతూ మునకలు వేయాలి. గంగాదేవి ప్రతిమలోకి గాని, కలశంలోకి గాని గంగా నూతన ఆవాహన చేయాలి. ఆ నదీమాతకి తెల్లనివస్త్రాలు సమర్పించాలి. దొన్నెలో నూనె వేసి దీపం వెలిగించి, ఎర్రని, పచ్చని పూలు అలంకరించి, పసుపు, కుంకుమలతో నీటిలో వదలాలి. గంగామాతకు పేలపిండి పదార్థాలు అంటే ప్రీతి.
అందువల్ల వాటిని ప్రవాహంలో వదలాలి. పదిరకాల పూలతో గంగను పూజించాలి. పదిరకాల పండ్లను నైవేద్యం పెట్టాలి. అన్నీ పదితో ముడిపడుట చేత పదిమంది బ్రాహ్మణులకు యవలు, నువ్వులు, దక్షిణ, తాంబూలాలతో గోదానం చేయాలి. ఆవుబొమ్మ లేక ఆవు దూడతో కలిగిన వెండి ప్రతిమను దానం చేయడం సంప్రదాయం.
ఒక గోవును పూజించి మూడు ప్రదక్షిణలు చేసి, పచ్చగడ్డి, తోటకూర తినిపించాలి. గంగనీరు తాగించాలి. పదిమంది బ్రాహ్మణులకు పదేసి రకాల పిండివంటలు, పడేసి భక్ష్యాలు దానం ఇవ్వాలి. మరుసటి రోజు నిర్జల ఏకాదశి కాబట్టి ఉపవాసం ఉండి, ద్వాదశినాడు శ్రీవిష్ణు సహస్రనామాలతో మహావిష్ణువును పూజించి, గంగా లహరి పఠించి, పారణ చేయాలి. కాశీ, హరిద్వార్, నాసిక్, మధుర, ప్రయాగ మొదలైన క్షేత్రాల్లో గల గంగా నదీతీరాల్లో ఈ పర్వాన్ని విశేషంగా ఆచరిస్తారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ 9494981000