Varalakshmi vratam: మీ కోరికలు తీరాలంటే వరలక్ష్మీ వ్రతం రోజు ఈ మంత్రాలను పఠించండి
Varalakshmi vratam: వరలక్ష్మీ వ్రతం రోజు కొన్ని మంత్రాలు 108 సార్లు పఠించడం వల్ల మీ కోరికలు నెరవేరతాయి. అమ్మవారి అనుగ్రహం పొందు సకల సౌభాగ్యాలు, సంపదతో కొదువ లేకుండా జీవిస్తారు. వరలక్ష్మీ వ్రతం రోజు పఠించాల్సిన మంత్రాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
Varalakshmi vratam: వరలక్ష్మీ వ్రతం అత్యంత విశిష్టమైనది. సంపద పెరగాలని, ఆర్థిక పురోభివృద్ధి కలగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఆరోజు తప్పనిసరిగా పూజిస్తారు. ఏడాదికి ఒకసారి వచ్చే విశిష్టమైన రోజుగా భావిస్తారు.
కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరిస్తారు. తమ సౌభాగ్యం కలకాలం ఉండాలని, అన్యోన్యంగా జీవితం సాగించాలని కోరుకుంటూ అమ్మవారికి పూజ చేస్తారు. అయితే ఈ పూజలో కొన్ని మంత్రాలు పఠించడం వల్ల మీ కోరిక నెరవేరుతుంది.
కోరికలు తీరేందుకు
వరలక్ష్మీ వ్రతం చేసే వాళ్ళు తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం పొందేందుకు మంత్రాలు జపిస్తారు. లక్ష్మీదేవి కటాక్షం పొందటం కోసం “ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే సకల కోరికలు తీరతాయి. మీ కోరిక ధర్మబద్ధంగా ఉన్నప్పుడే నెరవేరతాయి.
“ఓం నమో వరలక్ష్మీ మమ దరిద్రం నాశయ నాశయ తక్షణం మమ సంకల్ప సిద్ధి కురు కురు స్వాహా” అనే మంత్రాన్ని కూడా జపించవచ్చు. మీ కోరిక గురించి పదకొండు సార్లు తలుచుకుని ఈ మంత్రం పఠించడం వల్ల అది నెరవేరుతుంది. మీ దరిద్రం తొలగిపోతుంది. అలాగే పూజలో ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి.
ధన సమస్యలు అధిగమించేందుకు
“ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మీ మమ గృహే ధనం పురయ పురయ నమః” అనే మంత్రాన్ని కూడా 108 సార్లు పఠించాలి. ఈ మంత్రం పఠించడం వల్ల ధన సమస్యలు తొలగిపోతాయి.
అన్యోన్య దాంపత్యం కోసం ఇలా చేయండి
లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఆదర్శ దంపతులు. వారికి మాదిరిగా అన్యోన్యంగా ఉండాలని పెద్దలు చెబుతారు. భార్యాభర్త కూర్చుని కనకాధార స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక పురోగతి పొందుతారు. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. అందుకే శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఆ దంపతులు అన్యోన్యంగా ఉంటారని నమ్ముతారు. అందుకే అమ్మవారికి పూజ చేస్తారు.
ఉపవాసం ఉండి పూజ చేసిన వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. ఎవరి స్తోమతకు తగినట్టుగా ఆల్లు అమ్మవారిని ప్రతిష్టించుకుని పూజ చేస్తారు. తమకు తోచిన విధంగా బట్టలు, బంగారం, ప్రసాదాలు పెట్టి పూజ చేసుకుంటారు. సౌభాగ్యం, సంపద, ఆయురారోగ్యం, జ్ఞానం ఇవ్వమని కోరుకుంటారు.
బంగారం ఎందుకు కొంటారు?
మహిళలకు బంగారం అంటే మహా ప్రీతి. పండుగ, వేడుక ఏదైనా సరే తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేస్తారు. సాధారణంగా అక్షయ తృతీయ, ధన త్రయోదశి రోజుల్లో బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఆరోజు బంగారం కొంటే ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టే భావిస్తారు.
చాలా మంది శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం రోజున కూడా బంగారం కొంటారు. అసలు ఈరోజు తప్పనిసరిగా బంగారం కొనాలా? ఇలా ఎందుకు చేస్తారు? అనే దాని గురించి తెలుసుకుందాం.
శ్రీమహా విష్ణువు జన్మించిన నక్షత్రం శ్రవణా నక్షత్రం అందువల్లే ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. అందుకే ఈ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేసిన రోజు. అటువంటి పవిత్రమైన రోజున మహిళలు తమ శక్తి మేరకు బంగారం కొనుగోలు చేస్తారు. ఈరోజు బంగారం ఇంటికి తీసుకువస్తే లక్ష్మీదేవి వచ్చినట్టుగా భావిస్తారు. బంగారం లక్ష్మీదేవి స్వరూపంగా నమ్ముతారు. ఈ మాసంలో అమ్మవారి అనుగ్రహం కోసం బంగారం కొని పూజలో ఉంచుతారు. ఇలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. కొందరు లక్ష్మీదేవిగా భావించే ఒక కాసును కొంటారు. కొనలేని వాళ్ళు తమ దగ్గర ఉన్న పాత కాసును పాలు, పంచామృతాలతో శుభ్రం చేసి పూజలో పెట్టుకుంటారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.