Chaitra navaratrulu: చైత్ర నవరాత్రులు ఎప్పటి నుంచి? తొమ్మిది రోజులు పాటించాల్సిన నియమాలు ఏంటి?
Chaitra navaratrulu: ఈ ఏడాది చైత్ర నవరాత్రులు ఉగాది రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 17 వరకు చైత్ర నవరాత్రులు జరుపుకోనున్నారు. ఈ తొమ్మిది రోజులు దుర్గామాతను పూజిస్తారు.
Chaitra navaratrulu: హిందూమతంలో నవరాత్రులలో దుర్గామాతను పూజించడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. మత విశ్వాసాల ప్రకారం ఏటా చైత్ర నవరాత్రులు, శార్దియ నవరాత్రులు, రెండు గుప్త నవరాత్రులతో సహా నాలుగు నవరాత్రులు జరుపుకుంటారు. ఇందులో చైత్ర నవరాత్రుల్లో దుర్గామాతను తొమ్మిది రూపాలలో పూజిస్తారు. ఇలా చేయడం వల్ల దుర్గాదేవి ఆశీస్సులు లభించి బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. జీవితం సుఖసంతోషాలతో ఉంటుంది.
మరి కొద్ది రోజుల్లో చైత్రమాసం ప్రారంభం కాబోతోంది. చైత్ర మాసం తొలి రోజు తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ జరుపుకుంటారు. మొదటి రోజు కలశ స్థాపన చేసి శైలపుత్రిని పూజిస్తారు. దుర్గాదేవికి ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాలు, ఎరుపు రంగు పువ్వులు సమర్పించి పూజించడం వల్ల అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారు.
చైత్ర నవరాత్రులు ఎప్పటి నుంచి?
హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 8 రాత్రి 11:50 గంటలకు తిథి ప్రారంభమై మరుసటి రోజు ఏప్రిల్ 9 రాత్రి 8:30 గంటలకు ముగుస్తుంది అందువల్ల ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ 9 నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 17న శ్రీరామనవమితో ముగుస్తాయి.
ఈ ఏడాది చైత్ర నవరాత్రులు అమృత సిద్ధి యోగం, సర్వార్ధ సిద్ధియోగంతో సహా అనేక శుభ యోగాలతో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో దుర్గామాతను పూజించడం వల్ల ఎన్నో రెట్లు శుభ ఫలితాలు కలుగుతాయి.
దుర్గామాత తొమ్మిది రూపాలు
చైత్ర నవరాత్రులలో తొమ్మిది రోజులు దుర్గామాను తొమ్మిది రూపాలలో అలంకరించి పూజిస్తారు.
నవరాత్రుల్లో మొదటి రోజు సంతోషం, శ్రేయస్సు చిహ్నమైన శైలపుత్రి మాతను పూజిస్తారు.
రెండో రోజు దుర్గాదేవి బ్రహ్మచారిణి అవతారంలో పూజలు అందుకుంటుంది.
మూడో రోజు చంద్రఘంటా దేవిగా పూజిస్తారు.
నాలుగో రోజు కూష్మాండా దేవిని పూజిస్తారు.
ఐదో రోజు పవిత్రత, ఆధ్యాత్మిక కలిగిన రోజుగా భావిస్తారు. ఆరోజున స్కందమాతగా పూజిస్తారు.
నవరాత్రుల్లో ఆరో రోజున దుర్గాదేవి కాత్యాయనీ దేవిగా పూజలు అందుకుంటుంది.
ఏడవ రోజు కాళీమాతగా ఆరాధిస్తారు.
ఎనిమిదో రోజు మహాగౌరీ దేవిగా పూజిస్తారు.
ఇక నవరాత్రుల్లో చివరి రోజు అయిన తొమ్మిదవ రోజు సిద్ధి ధాత్రి అమ్మవారిగా పూజిస్తారు.
నవరాత్రుల సమయంలో చేయకూడని పనులు
నవరాత్రుల సమయంలో అమ్మవారిని ఎంతో నియమ, నిష్ఠలతో పూజిస్తారు. దానధర్మాలు చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. నవరాత్రులు దుర్గాదేవిని ధూప, దీప, నైవేద్యాలతో పూజించాలి.
మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వకూడదు. ఎవరితోనూ వాదనలకు దిగకూడదు. దీనివల్ల మనసులో అశాంతి నెలకొంటుంది. ఇంట్లో ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. పగటిపూట పొరపాటున కూడా నిద్రపోకూడదు. అలా చేస్తే దురదృష్టాన్ని తీసుకొస్తుంది.
గోర్లు, వెంట్రుకలు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. ఇవి కూడా ఇంటికి దరిద్రం తీసుకొస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎవరినీ దూషించడం చేయకూడదు. హాని కలిగించకూడదు. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈ సమయంలో పొరపాటున కూడా మాంసాహారం ముట్టకూడదు. మనసులో నిత్యం దుర్గాదేవిని స్మరించుకుంటూ ఉండాలి.