ఆడపిల్లలు పట్టీలు పెట్టుకుని ఇంట్లో తిరుగుతూ ఉంటే, లక్ష్మీదేవి మన ఇంట్లో ఉందని భావిస్తారు. అదే విధంగా, పెళ్లి అయిన స్త్రీలు కచ్చితంగా పట్టీలు ధరిస్తారు. అందమే కాదు, దీని వెనుక ఆధ్యాత్మిక భావన కూడా ఉంది.
చాలా మంది స్త్రీలు పాదాలకు పట్టీలు ధరిస్తారు. అదే విధంగా నల్ల దారాన్ని కూడా కట్టుకుంటారు. జ్యోతిష్యం ప్రకారం పట్టీలు, నల్ల దారం రెండూ ధరించవచ్చా? దీని వలన ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందా? వంటి విషయాలను ఈరోజు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కాళ్లకు పట్టీలు పెట్టుకోవడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
శాస్త్రాల ప్రకారం, వెండితో చేసిన పట్టీలను పెట్టుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దీంతో, పాదాలకు పట్టీలు పెట్టుకుంటే శరీరంలో వేడి సమతుల్యంగా ఉంటుంది. పాదాలలో నొప్పి, అలసట, వాపు వంటి సమస్యలను తగ్గిస్తుంది. ప్రతికూల శక్తిని కూడా గ్రహిస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కాలికి నల్ల దారం కట్టుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా దిష్టి తగలకుండా ఉంటుంది, చెడు దృష్టి నుంచి రక్షిస్తుంది. ఈ రంగు శని, రాహు, కేతు వంటి గ్రహాలను సూచిస్తుంది. పాదాలకు నల్ల దారం కడితే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గ్రహ దోషాలు తగ్గిస్తుంది. మనసు నుంచి భయం, ఆందోళన, ఉద్రిక్తతలను కూడా దూరం చేస్తుంది.
పట్టీలు, నల్ల దారం రెండూ మహిళలు ధరించవచ్చు. కానీ మేష రాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి మహిళలు రెండూ ధరించడం మంచిది కాదు. ఇలా చేయడం వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి మహిళలు తెల్ల దారం కట్టుకుంటే మంచిది. తెల్ల దారం కట్టుకోవడం వలన అదృష్టం కూడా కలిసి వస్తుంది, సంతోషంగా ఉండొచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.