Puja Samagri: పూజా సామాగ్రిని ఎక్కడ పడేయాలి? చెత్త డబ్బాలో, నదిలో కాకుండా వీటిని ఎక్కడ పారేస్తే మంచిది?
Puja Samagri:పూజలు, వ్రతాలు చేసుకున్న తర్వాత పూజకు సంబంధించిన వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదని పెద్దలు చెబుతుంటారు. చెత్తడబ్బాలో ఇతర వ్యర్థాలతో కలిపి పూజసామాగ్రిని వేయడం అశుభమని నమ్ముతారు. మరి పూజానంతరం ఆ సామాగ్రిని ఎక్కడ వేయాలి.. ఏం చేయాలి?
పండుగలు వచ్చినా, ప్రత్యేక రోజులు వచ్చినా భక్తి శ్రద్ధలతో దేవుడిని ప్రార్థించడం భారతీయులకు అలవాటు. పూజలు, వ్రతాలు చేయడం నోములు నోచుకోవడం వల్ల శుభఫలితాలు అందిస్తుందని భక్తుల నమ్మిక. హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు, వ్రతాలు చేసుకున్న తర్వాత వ్యర్థ సామాగ్రిని ఎక్కడ పడితే అక్కడ వేయడం అశుభంగా భావిస్తారు. ఇంట్లోని ఇతర వ్యర్థ పదార్థాలతో వీటిని కలిపి ఉంచడం పాపకార్యంగా కూడా చెబుతారు. కొందరు వీటిని ప్రత్యేకంగా తీసుకెళ్లి నీటి ప్రవాహం ఉన్న చోట అంటే నది లేదా చెరువులో పారేస్తుంటారు. ఇది కూడా అశుభమని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వీరేంద్ర సాహ్ని పూజా సామాగ్రి నిర్వీర్యం గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం.
పూజకు ముందు పూజాసామాగ్రికి ఎంత గౌరవ మర్యాదలు ఇస్తామో పూజానంతరం కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుందని సాహ్ని వివరించారు. పూజాసామాగ్రికి సంబంధించిన వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా పారేయడం వల్ల పాప ఫలితాలు కలిగే అవకాశముంది. పూజ అనంతరం కూడా ఆచార వ్యవహారలకు సంబంధించిన లక్షణాలు, శక్తి పూజా వ్యర్థాల్లో ఎప్పుడూ ఉంటాయి. కనుక వీటిని ఇతర వ్యర్థపదార్థాలతో కలిపి అస్సలు ఉంచకూడదు. వ్యర్థాలైనప్పటికీ వీటిని అత్యంత గౌరవ మర్యాదలతోనే నిర్వీర్యం చేయాలి.
పూజా సామాగ్రిని నదిలో వేయచ్చా?
చాలా మంది పూజా వ్యర్థాలను చెత్త డబ్బాలో ఇంట్లో ఇతర చెత్తతో కలిపి పారేస్తుంటారు. నిజానికి ఇది చాలా పెద్ద పాపమని ఆయన చెబుతున్నారు. చెత్త డబ్బాలో వేరు వేరు స్వభావాలు, వేరు వేరు శక్తులు కలిగిన పదార్థాలుంటాయి. వీటన్నింటినీ కలిపితే విపరీత ప్రతికూల శక్తులు పెరిగే అవకాశాలున్నాయి. కనుక పూజా వ్యర్థాలను చెత్త డబ్బాలో ఎప్పుడూ పారేయకూడదు. ఇతర చెత్తతో కలిపి వీటిని పొరపాటున కూడా ఉంచకూడదు.
మరికొందరు పూజా సామాగ్రిని నదిలో లేదా చెరువులో పారేస్తుంటారు. ఇది ప్రకృతి విరుద్ధమైన పని అవుతుంది. పువ్వులు, ఆకులు పెద్దగా నష్టం కలిగించనప్పటికీ ప్లాస్టిక్ వస్తువులు, రేపర్లు, వస్త్రాలు హానికరమైన కాలుష్యానికి కారకాలు అవుతాయి. శాస్త్రాలు దీన్ని ఎప్పటికీ సమర్థించవు.
పూజా వ్యర్థాలను ఏం చేయాలి?
సాంప్రదాయం ప్రకారం.. విగ్రహాలు, ఫొటోలు సహా ఇతర పూజా వ్యర్థాలు అన్నింటినీ భూమిలో(మట్టి) పాతి పెట్టాలి. లేదా రీసైక్లింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల వాటిలోని సానుకూల శక్తులు నశించకుండా ఉంటాయి. ఇంటి పరిసరాల్లో వీటిని పాతి పెట్టడం వల్ల అవి మిమ్మల్ని ఎప్పుడూ సంరక్షిస్తుంటాయి. పాతి పెట్టిన చోట భూమి మీద ఏదైనా మొక్కను నాటడం వల్ల ఆధ్యాత్మిక సంబంధం కొనసాగుతూ ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.