Camphor Aarti: హారతి కోసం కర్పూరమే ఎందుకు ఉపయోగిస్తారు.. దాని వల్ల లాభాలేంటి మీకు తెలుసా?
వందల సంవత్సరాలుగా ఆచరిస్తున్న హిందూ సంప్రదాయాలలో కర్పూర హారతి విశిష్ట ప్రాధాన్యత ఉంటుంది. కర్పూరంతో దేవుడికి హారతి ఇవ్వడంలో, అదే హారతిని మనం అందుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి. కర్పూర హారతి వల్ల కలిగే లాభమేంటి.
భారతదేశంలోని ఏ ఆలయానికి వెళ్లినా అక్కడి గాలంతా కర్పూరం వాసనతో నిండి ఉంటుంది. ఎంతో పవిత్రంగా వెలిగించే కర్పూర హారతే ఇందుకు కారణం. హిందూ సంప్రదాయం ప్రకారం.. గుడిలో గానీ ఇంట్లో గానీ దేవుడి ముందు కర్పూరంతో దీపం వెలిగించడం గొప్ప ఆచారం. కొన్ని శతాబ్దాలుగా పాటిస్తున్న ఈ సంప్రదాయం వెనకున్న ఆంతర్యం ఏంటి..? హారతికి కర్పూరాన్ని మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు, ఇది ఎలా తయారవుతుంది లాంటి చాలా విషయాలు మీ కోసం..
కర్పూరం ఎక్కడి నుంచి వస్తుంది?
కర్పూరం ఎక్కడి నుంచి వస్తుందో సులువుగా అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం ఇంట్లో వాడే మసాలా దినుసుల్లో ఒకటైన దాల్చిన చెక్క నుంచి. అవును.. ఆశ్చర్యంగా అనిపించినప్పటికి ఇది వాస్తవం. మనం వాడే దాల్చిన చెక్క కేవలం బెరడు మాత్రమే. దాల్చిన చెక్క మొక్క నుంచి కర్పూరం వస్తుందట.
హారతి కోసం కర్పూరాన్నే ఎందుకు ఉపయోగిస్తారు..?
కేవలం హారతి సమయంలోనే కాదు కర్పూరాన్ని హిందూ సంప్రదాయాల్లో చాలా సందర్భాల్లో వినియోగిస్తుంటారు. దాని నుంచి వచ్చే వాసన, అందులో ఉండే స్వచ్ఛతనే కర్పూరానికి ఆ గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అయితే భక్తి శ్రద్ధలతో దేవుడికి ఇచ్చే హారతి కోసం కర్పూరాన్నే
ఎందుకు ఉపయోగిస్తారో ఇందుకు కారణాలేంటో తెలుసుకుందాం..
స్వచ్ఛత, నిస్వార్థం: అంకితభావంతో హారతిచ్చే సమయంలో దేవుని ఎదుట నిల్చొని హారతిని కళ్లకు అద్దుకుంటారు. ఇక్కడ కర్పూరమంటే మనిషిలోని అహం. అందుకే పూర్తిగా కాలేవరకూ ఎదురుచూస్తారు. స్వార్థంతో నిండిన తమలోని అహాన్ని హారతి రూపంలో దేవుని ఎదుట పూర్తిగా విడిచిపెట్టినట్లుగా భావిస్తారు.
ఆత్మజ్యోతికి మార్గదర్శి: వేదాలు, పురాణాల ప్రకారం, అగ్ని అనేది మనిషిలోని దుర్గుణాలను ప్రక్షాళన చేసేదిగా చెబుతుంటారు. హారతి అందుకునే సమయంలో తమను దేవుడికి అర్పించుకుని అవలక్షణాలను శుద్ధి చేసుకుంటారు. భగవంతుని సమక్షంలో అంతర్లీనంగా ఇమిడి ఉన్న ఆత్మజ్యోతిని వెలిగించుకున్న భక్తులు తమకు మార్గనిర్దేశకత్వం చేయమని వేడుకుంటారు.
రక్షణ, సానుకూల ఆలోచనలు: కర్పూరం నుంచి వెలువడే సువాసన నెగెటివ్ ఎనర్జీలను తరిమికొట్టి జీవితంలో శాంతిని నెలకొల్పుతుంది. కేవలం ఆరాధన కోసం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక సంరక్షణకు కూడా హారతి సమర్పిస్తారు.
శతాబ్దాల నాటి సంప్రదాయం: కర్పూర హారతి ఇవ్వడమనేది ఇటీవల నెలకొన్న సంస్కృతి కాదు. కొన్ని శతాబ్దాల క్రితమే అంటే వేద కాలంలోనే ఈ పద్దతి మొదలైంది. దేవుడిని చేరుకునేందుకు సహజ సిద్ధమైన వాహకాలైన నీరు, నిప్పు, గాలిని ఎంచుకుని పూజలు చేస్తుండటంతో ఈ సంప్రదాయాన్ని మొదలుపెట్టి ఉండొచ్చని పురాణాలు చెబుతున్నాయి.
హారతిచ్చే విధానం:
సాధారణంగా హారతిని పూజ పూర్తయిన తర్వాత సమర్పిస్తుంటారు. ఒక లోహపు గిన్నె లేదా పాత్రలో కర్పూరం ఉంచుతారు. దాని వెలిగించి వృత్తాకారంలో ఎడమ నుంచి కుడికి తిప్పుతుంటారు. ఈ ప్రక్రియ జనన, జీవన, మరణాలను ప్రతిబింబిస్తుంది. భక్తులు ఆ హారతిని తాకి ఆ చేతులతో కళ్లకు లేదా నుదుటికి అద్దుకుంటారు. ఆ విధంగా దేవుడి నుంచి ఆశీర్వచనాలు అందినట్లుగా భావిస్తారు.
కర్పూరాన్ని ఆరాధించేందుకు హారతిలో వినియోగించే వస్తువుగానే కాకుండా యాంటీసెప్టిక్ మెటేరియల్ గా కూడా వాడుతుంటారు. హారతి మంటతో వెలువడే వాయువులు అక్కడి గాలిని శుద్ధి చేస్తుంది. అంతేకాకుండా ఫిజికల్‌గా, స్పిరిచ్యువల్‌గా కూడా వాతావరణాన్ని మార్చేస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.