తెలంగాణాలో బోనాలు, జానపద నృత్యాలు, మహంకాళికి పూజలు.. బోనం అంటే ఏంటి, బోనాల చరిత్ర తెలుసుకోండి!-bonalu in telangana and janapada nrutyalu mahamkali puja check bonam meaning and its history also ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  తెలంగాణాలో బోనాలు, జానపద నృత్యాలు, మహంకాళికి పూజలు.. బోనం అంటే ఏంటి, బోనాల చరిత్ర తెలుసుకోండి!

తెలంగాణాలో బోనాలు, జానపద నృత్యాలు, మహంకాళికి పూజలు.. బోనం అంటే ఏంటి, బోనాల చరిత్ర తెలుసుకోండి!

Peddinti Sravya HT Telugu

తెలంగాణ అంతటా బోనాలు మొదలయ్యాయి. 2025లో జూన్ 29న, ఆదివారం నుంచి జరుపుతున్నారు. ఆషాఢ మాసంలో బోనాలను అమ్మవారికి సమర్పిస్తారు. తెలంగాణలో అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు.

తెలంగాణాలో బోనాలు (pinterest)

బోనాలు గురించి తెలియని వారు ఉండరు. తెలంగాణలో అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. బోనాలు పండుగ మొదలైపోయింది. దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం.

మొత్తం తెలంగాణ అంతటా బోనాలు మొదలయ్యాయి. 2025లో జూన్ 29న, ఆదివారం నుంచి జరుపుతున్నారు. ఆషాఢ మాసంలో బోనాలను అమ్మవారికి సమర్పిస్తారు. అసలు బోనాలు పండుగ అంటే ఏంటి? దీని చరిత్ర, ముఖ్యమైన తేదీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మహాకాళి దేవి

తెలంగాణ సంస్కృతిని ప్రదర్శిస్తూ, మహాకాళి అమ్మవారిని పూజిస్తారు. ఇలా ఈ బోనాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ పండుగ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. జూన్ 29 మొదలైన బోనాలు జూలై 20 వరకు కొనసాగుతాయి.

అసలు బోనం అంటే ఏంటి?

బోనం అంటే తెలుగులో భోజనం అని అర్థం. ఇది దేవతలకు ఇచ్చే నైవేద్యాలలో ఒకటి అని చెప్పవచ్చు. మట్టి, ఇత్తడి కుండలో పాలు, బెల్లం వేసి అన్నాన్ని వండుతారు. దీనిని వేప, పసుపు, సింధూరంతో అలంకరించి, దీపాన్ని వెలిగించి బోనం పై పెడతారు. దానిని అమ్మవారికి సమర్పిస్తారు.

బోనాల చరిత్ర తెలుసా?

జంట నగరాల్లో 1813లో ఒక వ్యాధి వచ్చింది. ఆ సమయంలో చాలా మంది చనిపోయారు, వేలాది మంది ప్రాణాలు పోవడంతో మహాకాళి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆ తర్వాత ఆ వ్యాధి తగ్గింది. దీంతో అమ్మవారి విగ్రహాన్ని సికింద్రాబాదులో ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఇక్కడ బోనాలను సమర్పించడం ఆనవాయితీగా మారింది.

బోనాల సమయంలో మహిళలు, ఆడపడుచులు అందంగా తయారై, సంప్రదాయ గీతాలకు తగ్గట్టుగా నృత్యం చేస్తారు. బోనాలను తయారు చేసి, అమ్మవారికి సమర్పిస్తారు. బోనాలు తీసుకెళ్లే వారి పాదాలపై నీళ్లు జల్లి శాంతి పరుస్తారు.

లష్కర్ బోనం అంటే ఏంటి?

అప్పట్లో సికింద్రాబాద్ బ్రిటిష్ సైనిక స్థావరంగా ఉండేది. దీనిని లష్కర్ అని అంటారు. ఇప్పటికీ ఈ కారణంగా అక్కడ వారు లష్కర్ బోనాలు అని అంటుంటారు. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆదివారం గోల్కొండ కోటలో బోనాలు మొదలై, లాల్ దర్వాజ సింహ వాహిని బోనాలతో ఈ ఉత్సవం ముగుస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.