విశిష్ట అద్వైత సిద్ధాంత క‌ర్త శ్రీ‌రామానుజాచార్యుల జీవిత చ‌రిత్ర‌-biography of the eminent advaita siddhanta karta sri ramanujacharya ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  విశిష్ట అద్వైత సిద్ధాంత క‌ర్త శ్రీ‌రామానుజాచార్యుల జీవిత చ‌రిత్ర‌

విశిష్ట అద్వైత సిద్ధాంత క‌ర్త శ్రీ‌రామానుజాచార్యుల జీవిత చ‌రిత్ర‌

HT Telugu Desk HT Telugu
Published Jun 23, 2024 11:00 AM IST

విశిష్ట అద్వైత సిద్ధాంత కర్త శ్రీరామానుజాచార్యుల జీవిత చరిత్ర గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.

శ్రీ‌రామానుజాచార్యుల జీవిత చ‌రిత్ర‌
శ్రీ‌రామానుజాచార్యుల జీవిత చ‌రిత్ర‌ (pinterest)

వెయ్యి సంవ‌త్స‌రాల క్రిత‌మే ఆధ్యాత్మిక‌, మాన‌వ విలువ‌లు, సామాజిక స‌మాన‌త్వం, శ్రీ వేంక‌టేశ్వ‌రుని ప్రాభ‌వం, విశిష్టాద్వైతం విశిష్ట‌త‌ను విశేషంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లి ధార్మిక ప్ర‌చారం నిర్వహించిన గొప్ప వ్య‌క్తి శ్రీ రామానుజాచార్యుల వార‌ని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త‌, పంచాంగ క‌ర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శ్రీరామానుజాచార్యులు 1016లో తమిళనాడులోని శ్రీపెరంబదూరులో జన్మించారు. అద్వైత సిద్ధాంతానికి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్న గురువును ఖండిస్తూ చిన్నవయస్సులోనే ఆయన చేసిన వాదనలు రామానుజ చరిత్రలో ప్రసిద్ధి పొందాయ‌ని ఆధ్యాత్మిక వేత్త‌ చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

యమునాచార్యుల తరువాత శ్రీరంగ పీఠాధిపతిగా నియమితులయ్యారు. తిరువాయ్ మొళి వంటి ద్రవిడ దివ్యప్రబంధాలను సంస్కృతంలోకి అనువదించి వైష్ణవమత ప్రచారం విరివిగా చేశారు. తిరుమంత్రార్ధ రహస్యాన్ని విన్నవారంతా పునీతులై జన్మరాహిత్యం పొందుతారని గురువు చెప్పగా... అందరికీ మోక్షం కలగాలనే సదుద్దేశ్యంతో ఒకనాడు గుడిగోపురం ఎక్కి అందరూ వినేలా తిరుమంత్రార్థాన్ని వివరించిన గొప్ప ఆధ్యాత్మిక వేత్త రామానుజాచార్యుల‌ని చిలకమర్తి తెలిపారు.

ఏకత్వంలో త్రయీతత్త్వ భిన్నత్వాన్ని మేళ‌వించి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని రూపొందించారు. ప్రస్థాన త్రయానికి శ్రీభాష్యం రచించారు. కూరత్తాళ్వార్ వంటి శిష్యబృందాన్ని వెంటబెట్టుకుని దేశం నలుమూలలా పర్యటించారు. పాంచరాత్రాగమ శాస్త్రవిధులను అనుసరించి అర్చనా విధానాన్ని, రాజభోగాది సంప్రదాయాల్ని పటిష్ఠం చేశారు. ప్రజల్లో వైష్ణవ భక్తి బీజాలు ఎప్పుడూ సడలిపోకుండా కట్టుదిట్టం చేశారు.

భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. అందరూ మోక్షానికి అర్హులే అంటూ సర్వమానవ సమానత్వ భావాన్ని, సౌభ్రాతృత్వాన్ని బోధించిన తొలిగురువు రామానుజులేన‌ని చిలకమర్తి వ్యాఖ్యానించారు. మేల్కోటే క్షేత్రంలో నిమ్నజాతులవారికి 'తిరుకులత్తార్' అనే పేరుంచి నేరుగా ఆలయ ప్రవేశం కల్పించారు. సమతామూర్తిగా తన అవతార పరమార్థాన్ని చాటుకున్నారు. కన్నబిడ్డ ఆరోగ్యం కోసం తల్లి పత్తెం చేసినట్లుగా దీన జనుల ఉద్ధరణం కోసం తామే భగవంతుని ఆశ్రయించి, ఈ లోకులంతా ఆశ్రయించినట్లుగా భావించమని శ్రీరంగనాథుని ప్రార్థించారు. నూట ఇరవై సంవత్సరాలపాటు అవనీసంచారం చేసి ఆయ‌న‌ 1137లో పరమపదించార‌ని చిల‌క‌మ‌ర్తి ప్ర‌భాక‌ర చ‌క్ర‌వ‌ర్తి శ‌ర్మ తెలిపారు.

పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner