మొట్టమొదట మనం ఏ పూజ చేసినా వినాయకుడిని ఆరాధిస్తాము. ఏదైనా వ్రతం చేసుకున్నా, పూజ చేసుకున్నా వినాయకుని ఖచ్చితంగా ఆరాధిస్తాము. పెళ్లి వంటి శుభకార్యాలలో కూడా మొట్టమొదట గణపతిని పూజిస్తాము. వినాయకుడు విఘ్నాలను తొలగించి, పనిలో విజయాన్ని దక్కేలా చూస్తాడు. కోరికలను తీర్చగల గణపతి ఆలయం గురించి మీకు తెలుసా? మన కోరికలను ఈ వినాయకుడి చెవిలో చెబితే అవి నెరవేరిపోతాయని మీకు తెలుసా?
విఘ్నాలకు అధిపతి, అగ్ర పూజలు అందుకునే వినాయకుడిని నిత్యం దేవతల సైతం ఆరాధిస్తారు. ఆయన శక్తి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వినాయకుడు అన్ని చోట్ల కొలువై ఉంటాడు, భక్తులకు అండగా నిలుస్తాడు. ఇక మరి ఈ వినాయక ఆలయం గురించి కచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఇది చాలా ప్రత్యేకమైన ఆలయం. పైగా ఇక్కడ వినాయకుడు ప్రతీ ఏటా పెరుగుతూ ఉంటాడట.
ప్రత్యేకమైన వినాయకుని ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో ఉంది. శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయానికి చాలా మంది భక్తులు దూర ప్రాంతాల నుంచీ కూడా వస్తుంటారు.
ఈ వినాయకుని ఆలయం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. పురాతనమైన ఈ ఆలయంలో వినాయకుడిని ఆరాధిస్తే శుభాలు కలుగుతాయని విశ్వాసం. ఈ ఆలయాన్ని క్రీ.శ 840లో చాళుక్యులు నిర్మించారు. ఈ ఆలయ స్తంభాలపై చాళుక్యుల కాలం నాటి శాసనాలు కూడా లిఖించబడి ఉన్నాయి.
అప్పట్లో ఈ ఆలయం భూమిలో ఉండేది. 19వ శతాబ్దంలో ఒక భక్తుడికి వినాయకుడు కలలో కనిపించి ఈ ఆలయం గురించి చెప్పడంతో వెలికి తీయడం జరిగిందట. భూమిలో నుండి బయటపడ్డ తర్వాత ఆ వినాయకుడి విగ్రహం పెరిగినట్లు ప్రచారం కూడా ఉంది.
ఇక్కడ వినాయకుడి చెవిలో మన కోరికలు చెప్పి ముడుపు కడితే కోరికలు తీరిపోతాయని నమ్ముతారు. అదే విధంగా ఇక్కడ ఉన్న నందీశ్వరుడు, బూలింగేశ్వరుడిని దర్శించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి. ఇక్కడే రాజరాజేశ్వరి ఆలయం కూడా ఉంది. ప్రతి ఏటా వినాయక నవరాత్రులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవాలను కూడా జరుపుతారు. అదే విధంగా గణపతి హోమం చేయించుకుంటే స్వామివారి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.