Bhogi Pallu Function : పిల్లలకు మొదటిసారి భోగిపళ్లు పోస్తున్నారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోండి..
Bhogi Pallu Function 2023 : భోగి రోజు చాలా మంది పిల్లలకు భోగిపళ్లు పోస్తారు. భోగిరోజు పాటించే సంప్రదాయాల్లో ఇది కూడా ఒకటి. అయితే నర దిష్టి పోగొట్టాలనే ఉద్దేశంతో దీనిని పాటిస్తున్నారు. అయితే భోగిపళ్లు పోసేప్పుడు ఏమి చేయాలి? ఎలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Bhogi Pallu Function 2023 : సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో.. దాని ముందు రోజు వచ్చే భోగి కూడా అంతే ప్రాధన్యతనిస్తారు. ఆ రోజు పిల్లలకు పేరింటం చేసి.. భోగిపళ్లు కూడా పోస్తారు. సాయంత్రం చుట్టూ ఉన్న పెద్దవారిని పిలిచి.. పిల్లలకు రేగుపళ్లతో దిష్టి తీయిస్తారు. నర దిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు. అయితే ముఖ్యంగా పసిపిల్లలకు దిష్టి తగలడం సహజం. అందుకే వారికి అప్పటివరకూ ఉన్న దిష్టి మొత్తాన్ని తీసేయడానికి భోగిపళ్లను పోస్తారు.
భోగిరోజు సాయంత్రం పిల్లలతో గొబ్బెమ్మలు పెట్టించి.. అనంతరం ఈ భోగి పళ్లు చేసే కార్యక్రమం మొదలుపెడతారు. నిజం చెప్పాలంటే ఈ భోగిపళ్లు పోసే విషయంలో వయసుతో ఎలాంటి పనిలేదు. ఎవరికైనా పోయొచ్చు. అయితే 12 ఏళ్లలోపు పిల్లలకే ఎక్కువగా భోగిపళ్లు పోస్తారు. రేగు పళ్లు, బంతిపూలు, చిల్లర నాణేలు, చెరుకు గడల ముక్కలు కలిపి.. పిల్లల తలపై నుంచి పడేట్టు పోస్తారు. మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి.. వారి తల మీదుగా కిందకి పడేలా పోస్తారు. అయితే అలా పోసిన పళ్లను తినకూడదు. దానిని ఎవరూ లేని చోట పారేయాలి. లేదంటే ఎవరికైనా దానం చేయాలి అంటారు.
అసలు పిల్లలకు రేగి పళ్లనే ఎందుకు పోస్తారు? అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. రేగిపండును అర్కఫలం అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లుతాడు. అందుకే పిల్లకు భోగిపళ్లు పోస్తారని చెప్తారు. అంతే కాదు దీని గురించి మన పురాణాలలో కూడా ప్రస్తావన ఉంది.
అంతేకాకుండా.. రేగుపళ్లతో పాటు బంతి పూల రెక్కలను కూడా దిష్టితీసేందుకు ఉపయోగిస్తారు. దీనివల్ల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ మాయమైపోతాయి అంటారు. ఎందుకంటే బంతిపూలకు క్రిములను చంపే ప్రాథమిక లక్షణం ఉంది. పైగా ఇది చర్మానికి తగిలితే.. చాలా మంచిది అంటారు. చర్మ సంబంధమైన వ్యాధులనుంచి ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉంది అంటారు. అందుకే ఈ సంప్రదాయాన్ని కచ్చితంగా అమలు చేస్తారు.
సంబంధిత కథనం