Jaya Ekadashi: రేపే భీష్మ ఏకాదశి.. ఈరోజు ఏం చేస్తే మంచిది?, ఎందుకు విష్ణు సహస్రనామాలను చదవాలి?
Jaya Ekadashi: ప్రతీ సంవత్సరం మాఘ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు భీష్మ ఏకాదశి జరుపుకుంటాము. భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలని చదివితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి, అంతర్వేది ఏకాదశి అని కూడా అంటారు.

మనకి ఉన్న 12 నెలల్లో మాఘమాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో చేసే స్నానానికి కానీ పూజలకు కానీ ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతీ సంవత్సరం మాఘ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు భీష్మ ఏకాదశి జరుపుకుంటాము.
భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలని చదివితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి, అంతర్వేది ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు ఏం చేసినా కూడా విజయాన్ని పొందవచ్చు.
భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి నాడు ఏం చేస్తే మంచిది?
ఈరోజు పసుపు రంగుకి చాలా విశిష్టత ఉంది. లక్ష్మీ నరసింహ స్వామికి ఈరోజు పసుపు రంగుతో ఉండే పండ్లు, తియ్యటి పదార్థాలని నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది. గోవులకు పూజ చేస్తే కూడా భీష్మ ఏకాదశి నాడు విశేష ఫలితాన్ని పొందవచ్చు.
పసుపు రంగు దుస్తులు ధరించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినా, విన్నా మోక్షం కలుగుతుంది. ఈరోజు భీష్ముడికి తర్పణాలు కూడా వదులుతారు. అలా చేయడం వలన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది.
భీష్మ ఏకాదశి నాడు వీటిని పాటించండి
- భీష్మ ఏకాదశి నాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. గడపకు పసుపు, కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టాలి.
- తల స్నానం చేసి పసుపు రంగు దుస్తులు లేదంటే సుచిగా ఉన్న దుస్తులను ధరించి విష్ణువును ఆరాధించాలి. ఉపవాసం ఉండాలి. రాత్రి జాగరణ చేస్తే కూడా మంచిది.
- భీష్ముడు తండ్రికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నారు. ఈరోజు భీష్ముడికి తర్పణాలు వదిలితే సంతానం కలుగుతుంది.
ఈరోజు ఎందుకు విష్ణు సహస్రనామాలను చదవాలి?
భీష్ముడు ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఇప్పటికీ చాలా మంది చదువుతూ ఉంటారు. విష్ణు సహస్రనామాలను చదవడం వలన దుఃఖాల నుంచి బయటపడవచ్చు.
కురుక్షేత్ర యుద్ధం సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించారు. ఆ పరమపవిత్రమైన రోజుని భీష్మ ఏకాదశిగా మనం జరుపుకుంటాము.
విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయాన్ని అందుకున్నారని అంటారు. కనుక పురాణాల ప్రకారం విష్ణు సహస్రనామ పారాయణం చాలా విశిష్టమైనది. భీష్మ ఏకాదశి నాడు కనుక ఈ విష్ణు సహస్రనామాలను పఠిస్తే శుభాలు కలుగుతాయి. స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుందని నమ్ముతారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం