Bhai Dooj: రేపే భాయ్ దూజ్- మీ సోదరుడికి తిలకం పెట్టేటప్పుడు ఈ మంత్రం పఠించండి
Bhai Dooj: నవంబర్ 3న భాయ్ దూజ్ పండుగను జరుపుకోనున్నారు. ఈరోజు సోదరి తన సోదరుడికి భోజనం పెడుతుంది. తన నుదుట తిలకం వేసి అన్న ఆశీర్వాదాలు తీసుకుంటుంది. రేపు తిలకం వేసేందుకు శుభ సమయం, పూజా విధానం గురించి ఇక్కడ తెలుసుకోండి.
దీపావళి పండుగ సంబరాలు భాయ్ దూజ్ వేడుకతో ముగుస్తాయి. నవంబర్ 3వ తేదీ భాయ్ దూజ్ జరుపుకుంటారు. సోదర సోదరీమణుల మధ్య ఉన్న ప్రేమకు చిహ్నంగా ఈ పండుగ జరుపుకుంటారు.
భారతదేశంలో రక్షా బంధన్, భాయ్ దూజ్ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, పవిత్ర సంబంధాన్ని సూచించే రెండు ముఖ్యమైన పండుగలు. రెండు పండుగలలో, సోదరులు, సోదరీమణులు సాంప్రదాయ పద్ధతిలో ఒకరిపై ఒకరు తమ అభిమానాన్ని చాటుకుంటారు. భాయ్ దూజ్ పూజా విధానం, శుభ సమయం, తిలకం వేసేటప్పుడు పఠించాల్సిన మంత్రం గురించి తెలుసుకోండి.
తిలకం ఈ సమయంలో పెట్టండి
కార్తీకమాసం శుక్ల పక్షం ద్వితీయ తిథి 2 నవంబర్ రాత్రి 8.21 గంటలకు ప్రారంభంఅవుతుంది. ఇది మరుసటి రోజు నవంబర్ 3 రాత్రి 10.5 గంటల వరకు ఉంటుంది. భాయ్ దూజ్ రోజు సోదరుడి నుదుట తిలకం వేసేందుకు శుభ సమయం ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు శుభప్రదంగా ఉందని పండితులు చెబుతున్నారు. నవంబర్ 3వ తేదీ సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల మధ్య తిలకం వేయకూడదని పండితులు వెల్లడించారు. ఎందుకంటే ఇది రాహుకాలం. ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదు.
పూజా విధి
ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిలో దీపం వెలిగించాలి. విష్ణువు, వినాయకుడిని పూజించాలి. ఈరోజు సోదారుడిని ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి. దీన్ని భగినీ హస్త భోజనం అంటారు. తిలకం వేసి హారతి ఇవ్వాలి. భాయ్ దూజ్ రోజున సోదరి తన కుడిచేతి ఉంగరం వేలితో సోదరుడికి తిలకం పెట్టాలి. ఇలా చేసేటప్పుడు సోదరుడు తన ముఖాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలి. చేతికి రక్షా దారం కట్టి మిఠాయిలు తినిపించాలి. అనంతరం సోదరిని సంతోషంగా ఉండమని దీవిస్తూ వారికి బహుమతులు ఇవ్వడం ఆచారంగా వస్తోంది.
భాయ్ దూజ్ ప్రాముఖ్యత
ఈరోజు యమున తన సోదరుడిని ఇంటికి ఆహ్వానించి గౌరవించి ఆహారాన్ని వండిపెట్టింది. అందువల్ల ఈరోజు యమునా నదిలో స్నానం చేసి యముడిని ఆరాధించే వ్యక్తి మరణం తర్వాత యమలోకానికి వెళ్లాల్సిన అవసరం లేదు. సూర్యుడి కుమార్తె యమునను సకల బాధలు తొలగించేదిగా భావిస్తారు. అందుకే ఈరోజు యముడిని, యమునా దేవిని ఆరాధించడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.
ఈ మంత్రాన్ని జపించండి
గంగా పూజ్యేమునా కో యమీ పూజ్యోమరాజ్ కో సుభద్ర పూజా కృష్ణ కో గంగా యమునా నీర్ బహో మేరే భాయ్ కీ ఆయు బఠో