అట్లతద్ది కథ: అచ్చమైన తెలుగింట పండుగ అట్లతద్ది, ఈరోజు చదువుకోవాల్సిన కథ ఇదే!-atlataddi 2025 date time and story to read on this aupiscious day ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  అట్లతద్ది కథ: అచ్చమైన తెలుగింట పండుగ అట్లతద్ది, ఈరోజు చదువుకోవాల్సిన కథ ఇదే!

అట్లతద్ది కథ: అచ్చమైన తెలుగింట పండుగ అట్లతద్ది, ఈరోజు చదువుకోవాల్సిన కథ ఇదే!

Peddinti Sravya HT Telugu

ఈ సంవత్సరం అట్లతద్ది అక్టోబర్ 9 గురువారం నాడు వచ్చింది. అట్లతద్దిని "ఉయ్యాల పండుగ" అని కూడా అంటారు. అట్లతద్ది నాడు కుజదోషం తొలగిపోవడానికి కూడా చాలా మంది పరిహారాలను పాటిస్తూ ఉంటారు. స్త్రీలు విశేషంగా జరుపుకునే పండుగలలో అట్లతద్ది ఒకటి. ఇది అచ్చమైన తెలుగింటి పండుగ.

అట్లతద్ది నాడు చదవాల్సిన కథ (pinterest)

ప్రతీ ఏటా అట్లతద్దిని ఆశ్వయుజ మాసం కృష్ణ పక్ష తదియ నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం అట్లతద్ది అక్టోబర్ 9 గురువారం నాడు వచ్చింది. అట్లతద్దిని "ఉయ్యాల పండుగ" అని కూడా అంటారు. అట్లతద్ది నాడు కుజదోషం తొలగిపోవడానికి కూడా చాలా మంది పరిహారాలను పాటిస్తూ ఉంటారు. స్త్రీలు విశేషంగా జరుపుకునే పండుగలలో అట్లతద్ది ఒకటి. ఇది అచ్చమైన తెలుగింటి పండుగ.

అట్లతద్ది 2025

అట్లతద్ది నాడు గోరింటాకు పెట్టుకోవడం, ఉయ్యాలలు ఊగడం వంటి సంప్రదాయాలు కూడా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల వారు అట్లతద్దిని జరుపుకుంటారు. ఉత్తరాది వారు కర్వా చౌత్ పండుగను జరుపుకుంటారు. పెళ్లి కాని యువతులు అట్లతద్ది నాడు మంచి జీవిత భాగస్వామి రావాలని కోరుకుంటారు.

పెళ్లైన వారు భర్త దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ నోము జరుపుతారు. అట్లు పంచి పెట్టడం, అట్లను నైవేద్యంగా పెట్టి తినడం, తెల్లవారుజామున చద్దన్నం తినడంతో పాటు వ్రత కథను కూడా చదవాలి.

అట్లతద్ది నాడు చదవాల్సిన కథ:

ఓ ఊరిలో రాజుగారికి సుకుమారి అనే కూతురు ఉంది. ఆమెకు నలుగురు స్నేహితురాళ్లు ఉన్నారు. వారు బ్రాహ్మణ, వెలమ, కోమట, కాపు అమ్మాయిలు. అట్లతద్ది నోమును నోచుకుంటే ఆరోగ్యవంతుడైన, అందగాడు భర్త వస్తాడని రాజకుమారి పెద్దలు చెప్పడం విన్నది. ఆమె తన స్నేహితురాళ్లకు చెప్పి అట్లతద్ది నోము నోచుకుంది. నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేసింది. రాజకుమారి మూడు జాములు తర్వాత కళ్ళు తిరిగి పడిపోయింది. అది చూసిన ఆమె అన్నలు కంగారుపడ్డారు.

ముసలి పెళ్లి కొడుకే..

చంద్రుడు వచ్చే వరకు చెల్లి ఉపవాసంతో ఉండలేదని, చెల్లెలిపై ప్రేమతో అరిక కుప్పకూ నిప్పు పెట్టి ఆ మంటను అద్దంలో చూపించారు. చంద్రుడు వచ్చాడని నమ్మిన రాజకుమారి భ్రమలో ఫలహారం తింది. ఆమె స్నేహితురాళ్లు చంద్రుడిని చూసిన తర్వాత ఉపవాసాన్ని విరమించారు. కొద్ది కాలానికి రాజకుమారికి పెళ్లి చేయడానికి అన్నలు సంబంధాలు చూస్తున్నారు. ఎంత వెతికినా ముసలి పెళ్లి కొడుకే వస్తున్నాడు. కానీ ఆమె స్నేహితురాళ్లకు పడుచు భర్తలు వచ్చారు. చివరికి ఒక ముసలివానికి చెల్లెలి పెళ్లి నిశ్చయించారు.

ఆ విషయం తెలుసుకున్న రాజకుమారి “అట్లతద్ది నోము చేసుకున్న అందరికీ పడుచు భర్త వచ్చాడు, నాకు మాత్రం ముసలి భర్త వచ్చాడు” అని బాధ పడింది. ఓ రాత్రి ఊరిలో వేప చెట్టు కింద రాజకుమారి తపస్సు చేసింది. అప్పుడు అటుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూసి అడవిలో ఒంటరిగా తపస్సు ఎందుకు చేస్తున్నావని అడిగారు. అప్పుడు రాజకుమారి — “మీరు ఏమైనా ఆర్చేవారా తీర్చేవారా?” అని అడిగింది. జరిగిన విషయాన్ని ఆమె వివరించింది.

ఆమె అన్నలు చేసిన పనిని చెప్పింది. పార్వతీ పరమేశ్వరులు “నోము ఉల్లంఘన కారణంగా ఇలా జరిగింది. మళ్లీ యధావిధిగా అట్లతద్ది నోము నోచుకుంటే పడుచు భర్త లభిస్తాడు” అని చెప్పారు. అదంతా అన్నలకు చెప్పి, సక్రమంగా అట్లతద్ది నోము జరిపింది. దాంతో ఆమెకు చక్కని భర్త లభించి సుఖంగా జీవించింది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.