చాలా మంది మహిళలు వివిధ రకాల నోములు చేసుకుంటారు. పెళ్లి కాని వారు కూడా రకరకాల నోములు చేసుకుంటూ ఉంటారు. తెలుగు వాళ్లు జరుపుకునే ముఖ్య పండుగలలో అట్లతద్ది ఒకటి. ప్రతి ఏటా ఆశ్వయుజ బహుళ తృతీయ నాడు అట్లతద్దిని జరుపుతారు. ఈ ఏడాది అట్లతద్ది ఎప్పుడు వచ్చింది, అట్లతద్దిని ఎందుకు జరుపుకోవాలి? ఆ రోజు పాటించాల్సినవి కూడా తెలుసుకుందాం.
ఆడపడుచులందరూ అట్లతద్ది రోజున "అట్లతద్దో ఆరట్లో ముద్దపప్పో మూడట్లోయ్" అంటూ పాట పాడుతూ, సరదాగా తెల్లవారుజామున ఆటలాడుతారు. సాయంత్రం అట్లు పంచి ఉపవాసాన్ని ముగిస్తారు. పెళ్లయిన స్త్రీలు పదేళ్లపాటు తప్పకుండా అట్లతద్ది నోము చేసుకుంటారు. ఆ తర్వాత ఉద్యాపన కూడా చేస్తారు. స్త్రీలు సౌభాగ్యం కోసం చేసే అట్లతద్ది వ్రతం త్రిలోకసంచారి నారదుడు ప్రోద్బలంతో పార్వతీదేవి శివుని తన భర్తగా పొందడానికి ఈ వ్రతం చేసిందట.
పెళ్లి అయిన స్త్రీలు భర్త ఆరోగ్యంగా ఉండాలని, వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని ఈ నోమును జరుపుతారు. అదే విధంగా పెళ్లి కాని ఆడపిల్లలు కూడా ఈ నోమును చేసుకోవచ్చు. వారు ఈ నోము చేసుకోవడం వలన మంచి భర్త వస్తాడని, జీవితంలో కన్న కలలు నెరవేరాలని చేసుకుంటారు. అయితే ఈ వ్రతంలో చంద్రారాధన ప్రధానమైనది.
అట్లతద్ది నాడు చంద్రుడిని ఆరాధించడం వలన కుటుంబంలో సుఖ శాంతులు లభిస్తాయి. అట్లను వేసి గౌరీదేవికి నైవేద్యంగా పెడతారు. కుజుడికి అట్లంటే చాలా ఇష్టం. ఆయనకు నైవేద్యంగా పెట్టడం వలన సంసారంలో ఆటంకాలు తొలగిపోతాయని నమ్ముతారు. అదే విధంగా కుజుడుని ఆ రోజు ఆరాధించి అట్లు నైవేద్యంగా పెడితే రుతు చక్రం సక్రమంగా వచ్చి రుతు సంబంధమైన సమస్యలు రాకుండా కాపాడతాడని కూడా నమ్మకం.
అట్లతద్ది రోజు పది రకాల పండ్లు తినడం, పది సార్లు తాంబూలం వేసుకోవడం, పది సార్లు ఉయ్యాల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం వంటివి పాటించాలి. వీటిని ఇంత ప్రాధాన్యత వుంది కనుకే ఈ పండుగను ఉయ్యాల పండుగ, గోరింటాకు పండుగ అని కూడా అంటారు.