అరుణాచల మహత్యం బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారిచే-arunachalam temple know the significance and history ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  అరుణాచల మహత్యం బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారిచే

అరుణాచల మహత్యం బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారిచే

HT Telugu Desk HT Telugu
Dec 12, 2023 03:55 PM IST

అరుణాచల మహత్యం గురించి బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు వివరించారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

అరుణాచల క్షేత్రం
అరుణాచల క్షేత్రం (Govt of Tamilnadu)

తమిళనాడులోని తిరువణ్ఞామలై జిల్లాలోని పచ్చని కొండ పక్కన ఉంటుందీ అరుణాచలేశ్వరాలయం. కార్తీక దీపాత్సవానికి పెట్టింది పేరు. చిదంబరాన్ని దర్శించినా, కాశీలో మరణించినా, తిరువారూరులో జన్మించినా కలిగే మోక్షప్రాప్తి అరుణాచలం అన్న పేరును ఉచ్చరించినా చాలు ముక్తి లభిస్తుంది. అందుకే జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకునేవాళ్ళు తప్పక దర్శిస్తుంటారు అని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

తిరువణ్ఞామలై పర్వత పాదాల చెంతన 25 ఎకరాల్లో నలుదిశలా ఠీవిగా ఉన్న గోపురాలతో అద్భుతంగా కనిపిస్తుందీ శైవక్షేత్రం. బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన సంవాదాన్ని పరిష్కరించేందుకు శివుడు జ్వాలా స్తంభ రూపాన్ని దాల్చి ఆది అంతాలను కనుక్కోమని చెప్పాడనీ, అది తెలుసుకోలేని వాళ్ళిద్దరూ తమ ఓటమిని ఒప్పుకుని ప్రార్థించగా రూపాన్ని కుదించుకుని తిరువణ్ఞామలై కొండ కింద శివలింగంగా అవతరించాడనీ పౌరాణిక కథనం.

మరో పురాణ కథ ప్రకారం పార్వతీదేవి ఓసారి సరదాగా శివుడి కళ్ళు మూయడంతో లోకం అంధకారమైందనీ, అప్పుడు లోకమాత తన తప్పు తెలుసుకుని, తిరువణ్ఞామలై కొండ దగ్గర తపస్సు చేయగా, శివుడు జ్వాలలా ప్రత్యక్షమై లోకానికి వెలుగునిచ్చాడనీ తరువాత గౌరీదేవికి తన దేహంలో స్థానమిచ్చి అర్థనారీశ్వరుడుగా మారి ఈ పర్వత పాదాలచెంత వెలిశాడనీ చెబుతారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

అరుణాచల ఆలయ నిర్మాణం

సంప్రదాయ ద్రావిడ శైలిలో ఉన్న ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, విజయనగర చరక్రవర్తులు, తంజావూరు నాయకులు ఇలా ఎందరో రాజులు వెయ్యి సంవత్సరాలపాటు ఎన్నో మార్పుచేర్పులతో కట్టించినట్లు తెలుస్తోంది. మొదటగా చోళులు 9 నుంచి 18వ శతాబ్దం వరకూ దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

ఎవరు ఎప్పుడు కట్టించినా ముప్పై అడుగుల భారీ కుడ్యాలూ రెండు పుష్మరిణులూ అనేక మందిరాలూ లెక్కలేనన్ని విగ్రహాలూ చూడచక్కని శిల్పాలతో ఉన్న ఈ ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది.

ప్రధాన రాజగోపురం 217 అడుగుల ఎత్తులో 5 అంతస్తులతో దేశంలోని రెండో అతిపెద్ద గోపురంగా ఖ్యాతి చెందింది. సింహం శరీరం, ఏనుగు తలతో ఉన్న యాళీ రూపంలో చెక్కిన స్తంభ శిల్పాకళ కళ్ళను కట్టిపడేస్తుంది.

ఆలయ ప్రాంగణంలో చిన్నా పెద్దా కలసి మొత్తం తొమ్మిది గోపురాలూ ఐదు ప్రాకారాలూ ఉన్నాయి. ఐదో ప్రాంగణంలోని వేయి స్తంభాల మండపాన్ని కృష్ణదేవరాయలు నిర్మించారు.

మూడో అవరణలో పదహారు స్తంభాల దీపదర్శన మండపం లేదా శాంతి మందిరం ఉంటుంది. ఇక్కడున్న వృక్షాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. సంతానలేమితో బాధపడేవాళ్లు కొమ్మలకు చిన్న ఊయలలు కట్టి మొక్కుతారు.

గర్భాలయంలో శివలింగం పెద్దదిగా ఉంటుంది. దీన్నే తేజోలింగం అనీ అంటారు. సన్యాసి జీవితం ద్వారా కర్తవ్యం ధర్మం త్యాగం విముక్తికి ప్రతీకే ఈ అగ్నిలింగం అని చెబుతారు.

శివుడికి ఒకవైపున అపీడకుచాంబ అనే పేరుతో పార్వతీదేవి ఉంటుంది. ఆలయం లోపల హల్లోని నేల మాళిగలో పాతాళ లింగం ఉంటుంది. అక్కడే రమణ మహర్షి ధ్యాన ముద్రలో ఉండగా శరీరాన్ని చీమలు చిద్రం చేస్తున్న దశలో ఆయనకు ఆత్మ సాక్షాత్కారం అయ్యిందన్న నమ్మకంతో ఈ ప్రదేశాన్ని ముక్తిస్థలం అనీ పిలుస్తారు.

కార్తీక దీపోత్సవం

అరుణాచలంలో స్వామికి ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పదిగంటల వరకూ రోజుకు ఆరుసార్లు ఆచారరీతుల్నీ అన్ని పండుగల్నీ నిర్వహిస్తారు. తమిళ నెల ప్రకారం నవంబరు లేదా డిసెంబరులో వచ్చే కార్తిగై బ్రహ్మోత్సవాన్ని పది రోజుల పాటు నిర్వహిస్తారు. పౌర్ణమికి తొమ్మిది రోజుల ముందు ధ్వజారోహణంతో ప్రారంభించి ఉదయం, రాత్రి వేళలో స్వామిని వెండి వాహనంపై ఊరేగిస్తారు.

చివరిరోజైన కార్తీక పౌర్ణమి నాడు దీపోత్సవాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తుతారు. ఆ రోజు రాత్రి వెండి వృషభ వాహనంపై అరుణాచలేశ్వరుడిని పర్వతం చుట్టూ ఊరేగిస్తారు. పౌర్ణమిరోజు సాయంత్రం ఆరుగంటలకు ఏడు అడుగుల ఎత్తైన రాగి పాత్రలో మూడు వేల కిలోల నెయ్యి పోసి, వెయ్యి మీటర్ల దూదితో పొడవాటి దీపాన్ని చేసి వెలిగిస్తారు. దీన్నే మహాదీపం అంటారు. ఈ జ్యోతిని చూసేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు. ఈ దీపం కనీసం ఓ వారంపాటు వెలుగుతూ చుట్టుపక్కల 30 కి.మీ. వరకూ కనిపిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

గిరివాలం

అరుణాచలంతో ఎందరో యోగులకీ సిద్ధులకీ అనుబంధం ఉంది. వారిలో ఒకరైన రమణ మహర్షి అరుణాచలాన్ని అత్మస్వరూపంగా భావించేవారు. కైలాసం, కాశీ, చిదంబరం... ఈ క్షేత్రాలన్నిటా శివుడు కొలువుదీరతాడు. కానీ శివరూపమే అరుణాచలం. ఈ కొండ చుట్టూ చెప్పులు లేకుండా శివనామ స్మరణతో నెమ్మదిగా తిరగడమే ఓ యోగా అన్నారు మహర్షి. అందుకే అక్కడి ఆలయం కన్నా కొండకే ప్రాధాన్యం ఇస్తారు భక్తులు.

దీనిచుట్టూ చేసే ప్రదక్షిణనే గిరివాలం అంటారు. అరుణ అంటే ఎరుపు. అచలం అంటే కొండ. అరుణాచలం అంటే పాపాలను తొలగించేది అని పండితులు చెబుతారు. కోరికల కోసం కాకుండా జ్ఞాన సముపార్దన కోసమే పౌర్ణమి రోజుల్లో భక్తులు అరుణాచలానికి చేరుకుని గిరివాలం చేస్తారు. కార్తీక పౌర్ణమి నాడు ఆ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

కొండచుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాలి. గిరివాలం దారిలోనే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అనే పేరున్న అష్టలింగాలు ఉన్నాయి. ఈ ఎనిమిది లింగాలను, తీర్థాలనూ రాజరాజేశ్వరీ ఆలయాన్నీ దక్షిణామూర్తి ఆలయాన్నీ దర్శించుకుంటూ ప్రదక్షిణ పూర్తిచేస్తారు.

పౌర్ణమినాటి చంద్రకాంతి సమక్షంలో కొండమీద ఉన్న ఔషధమొక్కల చల్లని గాలుల్ని ఆస్వాదిస్తూ శివస్మరణ చేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం ప్రాప్తిస్తుందని యోగులూ, సిద్ధులూ చెబుతారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner