Maha kumbhamela 2025: మహా కుంభమేళాకు ప్లాన్ చేసుకుంటున్నారా? ఈ ఏడు పవిత్రమైన ఘాట్ లను సందర్శించండి
Maha kumbhamela 2025: కొత్త ఏడాది మకర సంక్రాంతి పండుగకు రెండు రోజుల ముందు నుంచి మహా కుంభ మేళా ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో మీరు కుంభ మేళాలో స్నానం ఆచరించేందుకు వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఏడు పవిత్రమైన ఘాట్ ల గురించి తెలుసుకోండి.
2025 లో ప్రయాగ్ రాజ్ లో జరిగే మహా కుంభ మేళా కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాదు. ఇదొక ఆధ్యాత్మిక ప్రయాణం. గంగా, యమునా, సరస్వతి వంటి పవిత్రమైన నదులలో స్నానం ఆచరించి పాపాలను శుద్ధి చేసుకుంటారు. మోక్షం పొందేందుకు ఇదొక మార్గంగా పరిగణిస్తారు.
జనవరి 13, 2025 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా జరగనుంది. పుష్య పౌర్ణమి నాడు ప్రారంభమై మహా శివరాత్రితో ముగుస్తుంది. 12 ఏళ్ల తర్వాత ప్రయాగ్ రాజ్ లో కుంభ మేళా జరుగుతుంది. మీరు వచ్చే ఏడాది జరగబోయే మహా కుంభ మేళాలో పవిత్ర స్నానం ఆచరించాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఏడు పవిత్రమైన ఘాట్ ల గురించి తెలుసుకోండి.
దశాశ్వమేధ ఘాట్
పురాతన ఇతిహాసాలతో సంబంధం కలిగిన ఘాట్ ఇది. ప్రయాగ్ రాజ్ లోని అత్యంత ముఖ్యమైన ఘాట్ లలో ఇదీ ఒకటి. పూర్వం ఒకప్పుడు ఇక్కడ రాజు పది అశ్వమేధ యజ్ఞాలు చేసినట్టు చెప్తారు. ఆధ్యాత్మిక శక్తికి ప్రసిద్ధి చెందిన ఈ ఘాట్ ను మహా కుంభ మేళా సమయంలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగి దైవానుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
కిలా ఘాట్
చారిత్రాత్మక అక్బర్ కోటకు సమీపంలో ఈ కిలా ఘాట్ ఉంది. ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఈ ప్రదేశం ఉంటుంది. ఇతర ఘాట్ లతో పోలిస్తే ఇక్కడ రద్దీ తక్కువగా ఉంటుంది. ధ్యానం చేసుకోవాలని అనుకునే వారికి ఇది అనువైన ప్రదేశం. ప్రశాంతమైన పరిసరాలు మనసుకు చాలా ఓదార్పును అందిస్తాయి. దీన్ని సందర్శిస్తే మీరు తిరిగి మంచి ఆధ్యాత్మిక అనుభూతిని వెంట తీసుకెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది.
రసూలాబాద్ ఘాట్
ప్రశాంతమైన వాతావరణానికి పేరు గాంచింది ఈ ఘాట్. ఇక్కడ వచ్చే యాత్రికులు తమ పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. స్నానంతో పాటు అనేక ఇతర ఆచార్య వ్యవహారాలు చేయాలని అనుకునే వారు ఈ ఘాట్ ను సందర్శించవచ్చు.
నౌకాయన్ ఘాట్
పేరులోనే ఉంది నౌక. అంటే ఇది బోటింగ్ ఘాట్. త్రివేణి సంగమం అద్భుతమైన దృశ్యాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. పవిత్ర నదులపై పడవ ప్రయాణం చేసి ఆధ్యాత్మికంగా మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఆశ పడే వారికి ఈ ఘాట్ మంచి స్థలంగా మారుతుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టుపక్కల అందాలు మరపురాని అనుభూతులను కలిగిస్తాయి.
మహేవా ఘాట్
పవిత్రమైన మరొక ఘాట్ మహేవా ఘాట్. ఇక్కడ ఇతర ఘాట్ లతో పోలిస్తే సౌకర్యాలు కాస్త తక్కువగా ఉంటాయి. కానీ ఎటువంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా నదీ స్నానం ఆచరించాలని అనుకునే వారికి ఇది చక్కని ఎంపిక. ఇక్కడికి యాత్రికులు ఉదయాన్నే చేరుకుంటారు. స్నానాలు ఆచరించి ధ్యానం, ప్రార్థనలు చేసుకుంటారు.
సరస్వతి ఘాట్
ప్రయాగ్ రాజ్ లో ఉన్న అత్యంత ముఖ్యమైన ఘాట్ సరస్వతి ఘాట్. కుంభ మేళా సమయంలో ఎక్కువ మంది భక్తులు ఇక్కడ స్నానం ఆచరించేందుకు వస్తారు. అందంగా నిర్మించిన మెట్లు, వాతావరణం కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. అందుకే భక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తారు.
జ్ఞాన గంగా ఘాట్
దీన్ని జ్ఞాన గంగ అంటారు. జ్ఞానోదయ ప్రదేశంగా భావిస్తారు. ఇక్కడికి ఎక్కువగా రుషులు, పండితులు వచ్చి ధ్యానం చేసేవారని అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించుకునేందుకు సరైన ప్రదేశం ఇది. భక్తి పూర్వకమైన వాతావరణం ఉంటుంది.