చిలకమర్తి పంచాంగరీత్యా, దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా 14 మే 2025 రాత్రి 8.58 నిముషాలకు దేవగురువైనటువంటి బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించాడని, ఇలా బృహస్పతి మిధున రాశిలోకి ప్రవేశించడం చేత 15.5.2025 నుండి 26.5.2025 వరకూ 12 రోజులు సరస్వతీ నదికి పుష్కరాలు ఏర్పడ్డాయని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. భారతదేశంలో ఉన్న అనేక పుణ్య నదుల్లో సరస్వతీ నది చాలా ముఖ్యమైనది అని చిలకమర్తి అన్నారు.
గంగా, యమున, గోదావరి తరువాత నాల్గవ స్థానం సరస్వతీ నదికి ఇవ్వడం జరిగింది. అందుకే నది వద్ద సంకల్పం చెప్పేటప్పుడు గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని చెప్పుకుంటామని చిలకమర్తి తెలిపారు.
అటువంటి ఈ సరస్వతీ నది హిమాలయాల్లో బదరీనాథ్ వద్ద మానా అనే గ్రామం వద్దపుట్టి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి సముద్రంలో కలిసినట్టుగా పురాణాలు మరియు శాస్త్రీయ ఆధారంగా చెప్పబడిరది. మానాగావ్‌లో సరస్వతీనది యొక్క ధారను ఇప్పటికీ చూడవచ్చు.
పురాణాల ప్రకారం ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ క్షేత్రంలో సరస్వతీ నది త్రివేణీ సంగమంలో అంతర్వాహినిగా ఉన్నదని చిలకమర్తి తెలిపారు. కురుక్షేత్రంలో కూడా సరస్వతీ నది అంతర్వాహినిగా ఉందని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ సరస్వతీ నది గుజరాత్‌లో ‘సిద్ధపూర్’ అనే ప్రాంతంలో కూడా ఉన్నదని అని పురాణాలు తెలియజేస్తున్నాయని చిలకమర్తి తెలిపారు.
మన పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని కమండలం నుంచి సరస్వతీ నది పుట్టిందని, భూమి మీద హిమాలయాల నుంచి ప్రవహించిందని పౌరాణిక కథలు తెలియజేశాయని చిలకమర్తి తెలిపారు. సరస్వతీ నది ఆత్మ జ్ఞానానికి ప్రతీక. అందుకే జ్యోతిషశాస్త్ర ప్రకారం మిధున రాశికి అధిపతి అయినటువంటి బుధుడి యొక్క స్థానంలో అనగా బుద్ధి అనే స్థానంలోకి జ్ఞానమనే గురుడు ప్రవేశించడం చేత సరస్వతీ నది పుష్కరాలు ఏర్పడుతున్నాయి.
ఈ పుష్కర స్నానం ఆచరించడానికి ఉత్తమ క్షేత్రం ‘ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ క్షేత్రం` త్రివేణీ సంగమం’ అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ పాఠకులకు సూచిస్తున్నారు. బదరీనాథ్ వద్ద మానా ప్రాంతంలో హర్యానాలోని కురుక్షేత్రలో, రాజస్థాన్‌లోని పుష్కర్‌లో, మరియు గుజరాత్‌లోని సిద్ధపూర్‌లో కూడా పుష్కర స్నానాలు ఆచరించవచ్చని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు- 9494981000