శ్రీ వేంకటేశ్వరుని బాల్యక్రీడలను శ్రీ వకుళమాత చూసి తరించిన స్థలమే ‘అప్పనపల్లి క్షేత్రం’. పుణ్యభూమిగా పేరొందిన మన దేశంలో గల దివ్యక్షేత్రాలలో అప్పనపల్లి క్షేత్రం పురాతనమైనదిగా ప్రసిద్ధి చెందింది. శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ బాల బాలాజీ స్వామివారిని సేవించటం పుణ్యప్రదం, ఫలప్రదం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శ్రీ కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. కద్రువ పిల్లలు నాగులు. వినత కుమారుడు వైనతేయుడు. కొన్ని కారణాల వల్ల వైనతేయుడు నాగులను రోజుకోటి తినేవాడు. శంఖచూడుడనే నాగును కాపాడటానికి జీమూతవాహనుడనే విద్యాధర చక్రవర్తి బలయ్యాడు. జీమూతవాహనుడు దేహార్పణ చేసిన ప్రాంతం కనుక, ఆ ప్రాంతానికి “అర్పణఫలి” అని పేరు వచ్చింది. అదే క్రమంగా ‘అప్పనపల్లి’ అయ్యిందని విజ్ఞుల అభిప్రాయం.
జీమూతవాహనుని కోరికతో, కశ్యప ప్రజాపతి సలహాతో వైనతేయుడు చనిపోయిన సర్పాలకు ఉత్తమగతులు కల్పించడానికి వశిష్ఠు నుండి ఒక నదీపాయను “అర్పణఫలి” (అప్పనపల్లి) మీదుగా ప్రవహింపజేశాడు. అదే వైనతేయనది. ఇది “ఉత్తరవాహిని” అనబడటం వలన అప్పనపల్లి సహజసిద్ధమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి బాల్యరూపాన్ని, బాల్యక్రీడలను చూసి తరించాలని వకుళమాత వరం కోరింది. వైనతేయనదిని పవిత్రం చేయమని గరుత్మంతుడు కోరాడు. వారిద్దరికీ వరాలిచ్చిన స్వామి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. అంతలో శ్రీ వేంకటేశ్వరస్వామి సంకల్పబలంతో అప్పనపల్లిలో మొల్లేటి మునియ్య, మంగమ్మల పుత్రుడై శ్రీ రామస్వామిగారు జన్మించారు.
చిన్నతనం నుండే నిరంతర భక్తితత్పరుడైన రామస్వామి కొబ్బరికాయల వ్యాపారంలో వచ్చిన లాభంలో కొంత వాటాను తిరుపతి తీసుకొని వెళ్ళి శ్రీ వేంకటేశ్వరస్వామికి ఏటా సమర్పించేవారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఒకసారి స్వామిపాదాల వద్ద ఆ ధనం పెడతానంటే అర్చకులు అంగీకరించలేదు. వారితో వాదించి అలసి నిద్రించిన రామస్వామికి కలలో బాలుడి రూపంలో శ్రీనివాసుడు కనిపించి తానే అప్పనపల్లి వస్తానన్నాడు.
నిద్రలేచిన రామస్వామికి చిరునవ్వులు చిందిస్తున్న బాలుని విగ్రహం కనిపించింది. ఆ ముద్దుల బాలుని చూచి మైమరిచిన రామస్వామి “బాల బాలాజీ”గా నామకరణం చేసి, అప్పనపల్లిలో తన కొబ్బరికాయల కొట్టులో ప్రతిష్ఠించించి నిత్య పూజలు చేయసాగారు. నాటి నుండి అశేష భక్తవాహిని స్వామివారిని సేవించి శుభఫలితాలను పొందుతున్నారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ -9494981000