Shiva shakthi puja: శివశక్తి పూజ చేసిన అనంత్ అంబానీ, రాధిక.. పెళ్ళికి ముందు ఈ పూజ ఎందుకు చేస్తారు?
Shiva shakthi puja: పెళ్ళికి ముందు జరిగే కార్యక్రమాలలో భాగంగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ కుటుంబ సభ్యులు శివశక్తి పూజ చేశారు. పెళ్ళికి ముందు ఈ పూజ ఎందుకు చేస్తారు? ఈ పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?

Shiva shakthi puja: దేశమంతా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకల గురించే మాట్లాడుకుంటోంది. గత కొన్ని రోజులుగా వీరి వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జులై 12న అనంత అంబానీ, రాధికా మర్చంట్ మూడు ముళ్ళ బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు.
అయితే వీరి పెళ్లి వేడుకల్లో భాగంగా శివశక్తి పూజ, గ్రహశాంతి పూజను రెండు కుటుంబాలు జరిపించారు. పెళ్ళికి ముందు ఈ శివశక్తి పూజ ఎందుకు చేస్తారు? ఈ పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
శివశక్తి పూజ అంటే ఏంటి?
శివశక్తి పూజ అనేది శివుడు, శక్తి దేవతలకు అంకితం చేసిన పురాతన హిందూ ఆచారం. ఇది పురుష స్త్రీ శక్తులను సూచిస్తుంది. వేద సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయిన ఈ పూజ సమతుల్యత, సామరస్యం, ఆధ్యాత్మికత, జ్ఞానోదయ సారాంశాన్ని కలిగి ఉంటుంది. ఈ పూజ మూలాలు వేద యుగం నుంచి ఉన్నాయి.
రామాయణంలో సీతాదేవి మంచి భర్త కావాలని శివశక్తి పూజ చేసింది. అలాగే మహాభారతంలో అర్జునుడి ప్రేమను పొందేందుకు సుభద్ర కూడా శివశక్తి పూజ చేసిందని పురాణాలు చెబుతున్నాయి. అంతటి గొప్ప మహిమ కలిగిన శివశక్తి పూజ పెళ్లి ముందు చేయడం చాలా శుభ పరిణామంగా చెబుతారు.
సృష్టి లయకారుడు అయిన శివుడిని, శక్తిని సూచించే దేవతను ఈ పూజలో ఆరాధిస్తారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో శివశక్తి పూజ విధానాలు మారుతూ ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో పెళ్లికి ముందు మాత్రమే ఈ పూజ నిర్వహిస్తారు. కానీ ఇతర ప్రదేశాలలో అమ్మాయిలు వివాహ వయసు వచ్చినప్పుడు కోరుకున్న వరుడు కావాలని ఈ పూజ చేస్తారు. అలాగే కొత్తగా పెళ్లయిన జంటలు తమ వివాహానంతరం కూడా శివశక్తి పూజ చేస్తారు.
శివశక్తి పూజ ప్రాముఖ్యత
శివశక్తి పూజకు హిందూ మతంలో అపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇది పురుషులు, స్త్రీల మధ్య సమతుల్యత, సామరస్యత కలయికకు ప్రతీకగా భావిస్తారు. ఈ పూజ చేయడం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఇద్దరు దేవుళ్ళను ఆరాధించడం వల్ల భక్తులు తమ సొంత శక్తులను సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతర్గత శాంతి, ఐక్యతను సాధిస్తారు. మనసును, ఆత్మను శుద్ధి చేసుకునేందుకు ఆధ్యాత్మిక మెరుగుదలకు ఇది ఎంతగానో దోహదపడుతుందని నమ్ముతారు.
శివశక్తి పూజ చేయడం వల్ల శ్రేయస్సు, ఆరోగ్యం, ఆశీర్వాదాలు లభిస్తాయని భావిస్తారు. శివుడు శక్తి కలిసి అడ్డంకులు తొలగిస్తారని, ప్రతికూలతలను దూరం చేస్తారని, జీవితంలో సానుకూల మార్పులను తీసుకొస్తారని భక్తులు విశ్వసిస్తారు. వ్యక్తిగత, వృత్తిపరమైన సవాళ్లను అధిగమించేందుకు దైవం సహాయం కోరుతూ ఈ పూజ నిర్వహిస్తారు.
శివశక్తి పూజ ముఖ్యంగా జంటలు నిర్వహిస్తారు. సంతోషపూర్వకమైన, ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని ఇవ్వమని భగవంతుడి ఆశీర్వాదం కోసం ఈ పూజ చేస్తారు. ఈ పూజ దంపతుల మధ్య గౌరవం, పరస్పర అవగాహన, ప్రేమ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
శివశక్తి పూజ సజావుగా జరిగేలా అడ్డంకులు తొలగించే గణేశుడికి మొదటి ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం మంత్రాలూ శ్లోకాలు పఠిస్తూ శివుడు, శక్తిని ఆవాహనం చేసుకుంటూ పూజ చేస్తారు. పంచామృతాలతో శివలింగాన్ని అభిషేకిస్తారు. ఇది శుద్ధి పవిత్రతకు ప్రతీక. శివయ్య అనుగ్రహం కోసం మంత్రాలు, శక్తి కోసం దేవీ సూక్తం వంటి వేద మంత్రాలు జపించడం పూజలో కీలకమైన అంశం. భక్తులు ఏకాగ్రతతో ఈ పూజలో పాల్గొంటారు. చీకటిని పారద్రోలి జ్ఞానాన్ని ఇవ్వమని కోరుకుంటూ పూజలో భక్తులు వేడుకుంటారు.
గ్రహశాంతి పూజ అంటే ఏంటి?
గ్రహస్థానాల దుష్ప్రభావాలను తగ్గించేందుకు ఈ పూజ చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. హిందూ సంస్కృతిలో వివాహాలు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముందు ఈ పూజ నిర్వహిస్తారు. శాంతి శ్రేయస్సును ఇవ్వమని కోరుకుంటూ పూజ నిర్వహిస్తారు.
గ్రహశాంతి పూజలో 9 గ్రహాల ఆశీర్వాదాలు కోరుకుంటూ పూజ నిర్వహిస్తారు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతు గ్రహాలను నవగ్రహాలుగా పిలుస్తారు. ఈ నవగ్రహాలు జీవితంలోని వివిధ అంశాలపై ప్రభావం చూపిస్తాయి.
గ్రహశాంతి పూజలో భాగంగా నవగ్రహాలకు సంబంధించిన కొన్ని వస్తువులను అందించి శక్తులను శాంతింప చేసేందుకు పూజ నిర్వహిస్తారు. ఈ పూజ చేయడం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. జీవితంలో అడ్డంకులు సవాళ్లను తగ్గిస్తుంది. గ్రహ శక్తులను సమన్వయం చేయగలుగుతుంది.
సానుకూల ప్రభావాలను మెరుగుపరిచేందుకు ప్రతికూల ప్రభావాలను తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఆరోగ్యం, సంపద, సమృద్ధి, వృత్తిపై సానుకూల ప్రభావాలను పెంచుతుంది. జీవితంలో శాంతి, సామరస్యం, ప్రశాంతమైన వాతావరణాన్ని పెంపొందిస్తుంది. ఒత్తిడిని తొలగిస్తుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఈ పూజ చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం ఏర్పడుతుంది. శాంతయుతమైన జీవన వాతావరణం ఉంటుంది.