Akshaya tritiya 2024: ఈ ఏడాది అక్షయ తృతీయ ఈ రాశుల ఇంట కనక వర్షాన్ని కురిపించబోతుంది-akshaya tritiya this year is going to bring rain to this zodiac house ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Akshaya Tritiya 2024: ఈ ఏడాది అక్షయ తృతీయ ఈ రాశుల ఇంట కనక వర్షాన్ని కురిపించబోతుంది

Akshaya tritiya 2024: ఈ ఏడాది అక్షయ తృతీయ ఈ రాశుల ఇంట కనక వర్షాన్ని కురిపించబోతుంది

Gunti Soundarya HT Telugu
Apr 19, 2024 10:19 AM IST

Akshaya tritiya 2024: మరికొద్ది రోజుల్లో అక్షయ తృతీయ రాబోతుంది. ఈ సమయం కొన్ని రాశుల వారికి అదృష్ట కాలంగా మారనుంది. ఆదాయం, ఆనందం రెట్టింపు కాబోతున్నాయి.

అక్షయ తృతీయ 2024
అక్షయ తృతీయ 2024 (freepik)

హిందూ శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ చాలా శుభకరమైనదిగా భావిస్తారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేందుకు, ఇల్లు కొనుగోలు చేసేందుకు మంచి రోజుగా పరిగణిస్తారు.

అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తే అంతులేని శ్రేయస్సు, అదృష్టం తీసుకొస్తుందని నమ్ముతారు. అందుకే ఈ రోజున కొద్దిగా అయినా బంగారాన్ని కొనుగోలు చేసి అదృష్టాన్ని తమ ఇంటికి ఆహ్వానిస్తారు.

ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10వ తేదీన వచ్చింది. తిథి మే 10 ఉదయం 4.17 గంటలకు ప్రారంభమై మే 11 మధ్యాహ్నం 2:50 గంటల వరకు కొనసాగుతుంది.

అద్భుతమైన యోగాలు

అక్షయ తృతీయ రోజు అనేక అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. గజకేసరి యోగం ఉంటుంది. అలాగే మేష రాశిలో సూర్యుడు, శుక్రుడు కలయిక వల్ల శుక్రాదిత్య యోగం ఉంటుంది. అలాగే శని దాని మూలత్రికోణ రాశిలో ఉండటం వల్ల శశ రాజయోగం ఏర్పడుతుంది. మీన రాశిలో కుజుడు, బుధుడు కలిసి ఉండటం వల్ల ధనశక్తి యోగం ఏర్పడుతోంది. దీంతో పాటు ఈరోజు రవి యోగం కూడా ఉంటుంది. ఈ అక్షయ తృతీయ ఇన్ని యోగాల ప్రభావంతో ఐదు రాశుల జీవితాల్లో శ్రేయస్సుని, పురోగతిని తీసుకొస్తుంది. మహా విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరికి పట్టిందల్లా బంగారం కాబోతుంది.

వృషభ రాశి

అక్షయ తృతీయ రోజు ఏర్పడే అనేక రాజయోగాల వల్ల వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారంలో అనేక కొత్త అవకాశాలు పొందుతారు. ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక కొరత కారణంగా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. డబ్బులు పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించొచ్చు. పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుకుంటారు. వ్యాపారాలను అభివృద్ధి పథంలో నడిపిస్తూ లాభాలు పొందుతారు.

మిథున రాశి

అక్షయ తృతీయ మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. భౌతిక సౌకర్యాలు, విలాసాలతో ఆశీర్వాదం పొందుతారు. కుటుంబ సభ్యుల కోరికలు చాలా సులభంగా తీర్చగలుగుతారు. చట్టపరమైన విషయాలు మధ్యలో నిలిచిపోయినట్లయితే వాటికి సంబంధించిన ఫలితాలు ఈ సమయంలో మీకు అనుకూలంగా వస్తాయి. కష్టపడి పనిచేస్తే విజయం సాధించగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి అక్షయ తృతీయ ఏర్పడే ఆశాజనక యోగాలు అనేక ఆశీర్వాదాలు తీసుకొస్తున్నాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. వృత్తి, వ్యాపారంలో ఆకస్మిక ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఈ ముహూర్తం అద్భుతంగా ఉంటుంది.

తులా రాశి

తులా రాశి వారికి అక్షయ తృతీయ శ్రేయస్సు, అదృష్టాన్ని ఇస్తుంది. ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుంచి ఆదాయం పొందుతారు. సామాజిక ప్రతిష్ట మెరుగుపడుతుంది. ఉద్యోగం చేసే వ్యక్తులు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ అందుకుంటారు. ఇటీవల వివాహం చేసుకున్న వారికి సంతానం కలుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళతారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారి జీవితాల్లో అక్షయ తృతీయ మంచి ఆశీర్వాదాలు అందించబోతుంది. డబ్బుతో మీ జేబులు నిండిపోతాయి. వ్యాపారం నిర్వహిస్తున్న వాళ్ళు చాలా సంపాదించగలుగుతారు. డబ్బులు ఆదా చేసుకోగలుగుతారు. ఆరోగ్యం ఉత్తమంగా ఉంటుంది. ఆనందం రెట్టింపు అవుతుంది. కార్యాలయంలో అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణాన్ని పొందుతారు. మీ కెరీర్‌లో ఎక్కడి నుండైనా శుభవార్తలను అందుకుంటారు. గొప్ప ఆఫర్‌లను కూడా అందుకోవచ్చు.

 

WhatsApp channel