AP Tourism : పడకేసిన పర్యాటకం.. టూరిస్టులకు తప్పని తిప్పలు.. కాకినాడ తీరం ఏం పాపం చేసింది?
- AP Tourism : కాకినాడ బీచ్ ఒకప్పుడు డచ్ వారి వర్తక స్థావరం. ఇక్కడ పురాతనమైన లైట్ హౌస్, చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. ఇక్కడి బీచ్ విశాలమైన ఇసుక తిన్నెలు, స్వచ్ఛమైన నీరు, ఆహ్లాదకరమైన సూర్యాస్తమయాలకు ప్రసిద్ధి చెందింది. కానీ.. కనీస సౌకర్యాల లేమితో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.
- AP Tourism : కాకినాడ బీచ్ ఒకప్పుడు డచ్ వారి వర్తక స్థావరం. ఇక్కడ పురాతనమైన లైట్ హౌస్, చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. ఇక్కడి బీచ్ విశాలమైన ఇసుక తిన్నెలు, స్వచ్ఛమైన నీరు, ఆహ్లాదకరమైన సూర్యాస్తమయాలకు ప్రసిద్ధి చెందింది. కానీ.. కనీస సౌకర్యాల లేమితో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.
(1 / 6)
కాకినాడ తీరం అందాలను ఆస్వాదించడానికి చాలామంది పర్యాటకులు వస్తుంటారు. కేవలం ఏపీ నుంచే కాదు.. తెలంగాణ నుంచి కూడా ఎక్కువ మంది వస్తారు. ముఖ్యంగా అక్టోబర్ నుంచి మార్చి వరకు టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే.. రద్దీకి తగ్గట్టు సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.
(2 / 6)
కాకినాడ తీరంలోని ఎన్టీఆర్ బీచ్ వద్ద పర్యాటకం పడకేసింది. ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. గతంలో ఏర్పాటైన బీచ్ పార్క్‌లో మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. సందర్శకులకు ఆహ్లాదం, వినోదం పంచేందుకు ఏర్పాటు చేసిన పార్కులో లేజర్ షోలు అటకెక్కాయి. ఏళ్ల తరబడి సరైన నిర్వహణ లేకపోవడంతో.. ఈ దుస్థితి దాపురించింది.
(3 / 6)
బీచ్‌కు వచ్చేవారు బస చేయడం కోసం సమీపంలోనే హరిత రిసార్ట్స్ నిర్మించారు. కానీ వాటి పనులు పూర్తి కాకపోవడంతో.. పర్యాటకులు బస చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు యుద్ధ విమానాల ప్రదర్శనశాల పనులు పూర్తైనా.. ప్రారంభించలేదు. సముద్ర స్నానాలు ఆచరించేవారికి కనీస వసతులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.
(4 / 6)
బీచ్‌కు వచ్చే పర్యాటకులు సముద్రంలో స్నానం చేస్తారు. ఆ తర్వాత వారు కనీసం బట్టలు మార్చుకునే సౌకర్యం కూడా లేదు. దీంతో తడిబట్టలతో ఇళ్లకు వెళ్తున్నారు. లోకల్ వారైతే ఎలాగోలా వెళ్తారు. కానీ.. దూర ప్రాంతాల నుంచి వచ్చినవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ హోటల్స్‌కు తడి బట్టలతోనే వెళ్తున్నారు.
(5 / 6)
ఎన్టీఆర్ బీచ్ ఒపెన్ అయినప్పుడు బాగుందని, కానీ సరైన నిర్వహణ లేక ఇప్పుడు బాలేదని స్థానికులు చెబుతున్నారు. వివిధ రకాల కట్టడాల కోసం కేటాయించిన భూముల్లో ముళ్ల చెట్లు మొలుస్తున్నాయి. గతంలో ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయం ఇక్కడ అమలు కాలేదని లోకల్ వారు చెబుతున్నారు. దాదాపు ఏడేళ్లుగా ఎలాంటి పనులు జరగడం లేదని అంటున్నారు.
(6 / 6)
ఎన్టీఆర్ బీచ్‌కు వెళ్లేందుకు టూరిస్టులు ప్రైవేట్ వాహనాలే ఆశ్రయిస్తున్నారు. ఇక్కడికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. దీని ద్వారా ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు.. పర్యాటకులకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. గత ప్రభుత్వం బీచ్‌ల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని.. ఈ సర్కారైనా పట్టించుకోవాలని కాకినాడ ప్రజలు కోరుతున్నారు.
ఇతర గ్యాలరీలు