(1 / 9)
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. ఆ దిశగా సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 14వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
(2 / 9)
కొత్త రేషన్ కార్డుల మంజూరులో భాగంగా…. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 4.76 లక్షల దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా మొత్తం 11.30 లక్షల మందికి ప్రయోజనం కలగనుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. వీరందరి పేర్లు కూడా పౌరసరఫరాల శాఖ వెబ్ సైట్ లో అందుబాటులోకి వచ్చాయి.
(3 / 9)
కొత్త రేషన్ కార్డులతో పాటు పాత కార్డులో జోడింపు అయిన కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకునేందుకు వీలుగా కూడా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే పేర్లు వచ్చిన వాళ్లు… రేషన్ కూడా తీసుకుంటున్నారు. అయితే వీరికి ఫిజికల్ గా కార్డులను పంపిణీ చేయాల్సి ఉంది.
(4 / 9)
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా పంపిణీ చేసిన తర్వాత…. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా నిర్వహించే దిశగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా కొత్త కార్డులను నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. పంపిణీ చేసే తేదీలతో పాటు ప్రాంతాలను స్థానిక అధికారులు ప్రకటిస్తారు. ఆ తేదీలకు అనుగుణంగా…. లబ్ధిదారులు వారి రేషన్ కార్డులను తీసుకోవచ్చు.
(5 / 9)
ఇప్పటి వరకు మంజూరైన కొత్త కార్డులతో పాటు కుటుంబ సభ్యుల జోడింపు వివరాలను పౌరసరఫరాల శాఖ వెబ్ సైట్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. రేషన్ కార్డు నెంబర్ లేదా మీసేవలో దరఖాస్తు చేసుకున్న సమయంలో జనరేట్ అయ్యే రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా అధికారిక వెబ్‌సైట్‌లో కార్డును నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డులో కుటుంబసభ్యుల పూర్తి వివరాలు చూపిస్తాయి. అధికారిక వెబ్‌సైట్ లో రిఫరెన్స్ నెంబర్ లేదా కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత జిల్లా పేరును సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. వెబ్ సైట్ లో రేషన్ కార్డు స్థితి తెలియకపోతే స్థానిక మండల ఆఫీసుల్లో తమ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.
(6 / 9)
దరఖాస్తుదారుడు https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోంపేజీలో 'FSC Search' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేజీలో 'Ration Card Search' డ్రాప్ డౌన్ లో 'FSC Search' ఆప్షన్ పై నొక్కాలి. అనంతరం ఎఫ్ఎస్సీ రిఫరెన్స్ నెంబర్ లేదా పాత రేషన్ కార్డు లేదా ప్రస్తుత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ జిల్లాను ఎంపిక చేసి సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీంతో మీ రేషన్ కార్డు పూర్తి వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి. ఈ లిస్ట్ లో పేర్లు ఉంటే… కొత్త కార్డును పంపిణీ చేస్తారు. వివరాలు అందుబాటులో లేకపోతే… వేచి చూడాల్సి ఉంటుంది.
(7 / 9)
రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనతో పాటు మీసేవా ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పౌరసరఫరాల శాఖ…. అర్హులను ఎంపిక చేస్తోంది. కేవలం కొత్త కార్డులే కాకుండా… మార్పులు, చేర్పుల కోసం వచ్చిన వాటిని కూడా పరిష్కరిస్తోంది. .
(8 / 9)
ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కార్డులు అందజేస్తామని అధికారులు కూడా చెబుతున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు. ఇప్పటికే మంజూరైన కార్డులతో సంబంధం లేకుండా… మీసేవ కేంద్రాల ద్వారా ఇంకా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
(9 / 9)
మరోవైపు రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తున్నారు. 2025 ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. కుటుంబంలో ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందజేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రేషన్ బియ్యం తీసుకునేందుకు ఎక్కువ మంది లబ్ధిదారులు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా కొత్త కార్డుల మంజూరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర గ్యాలరీలు