Subramanya Shasti 2024 : అత్తిలి, మోపిదేవిలో వైభవంగా సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు-తీర్థాల్లో జనం కిటకిట
Subramanya Shasti 2024: తెలుగు రాష్ట్రాల్లో సుబ్రహ్మణ్య లేదా సుబ్బారాయ షష్ఠిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఏపీలోని అత్తిలి, మోపిదేవి ఆలయాల్లో సుబ్రహ్మణ్య షష్ఠి ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను సందర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
(1 / 6)
తెలుగు రాష్ట్రాల్లో సుబ్రహ్మణ్య లేదా సుబ్బారాయ షష్ఠిని ఘనంగా జరుపుకుంటున్నారు. శనివారం ఉదయం నుంచి ప్రజలు సుబ్రహ్మణ్యుడి ఆలయాలకు తరలివెళ్తున్నారు. షష్ఠి నాడు కుమారస్వామి ఆరాధిస్తే నాగదోషాలు పోతాయని భక్తులు నమ్మకం. కుమారస్వామికి దేవసేనతో కల్యాణం జరిగిన తిథి సుబ్బరాయ షష్ఠి. ఈ పండుగనాడు సుబ్రహ్మణ్యుని పూజిస్తే చక్కని సంతానం కలుగుతుందని నమ్మకం. ఏపీలోని అత్తిలి, మోపిదేవి ఆలయాల్లో సుబ్రహ్మణ్య షష్ఠి ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
(2 / 6)
పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో జరిగే సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ప్రతి ఏడాది ఎంతో అట్టహాసంగా షష్ఠి తీర్థం నిర్వహిస్తుంటారు. సంతానం లేనివారు, పెళ్లి కానివారు, నాగదోషం ఉన్న వారు అత్తిలి స్వామిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహిస్తారు. ఇలా చేస్తే తమ సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్ముతారు.
(3 / 6)
ఎన్నో ప్రత్యేకతలు ఉన్న అత్తిలి షష్ఠి ఉత్సవాలకు శతాబ్దానికి పైగా చరిత్ర ఉంది. ఏటా జరిగి షష్ఠి ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. షష్ఠి కల్యాణం రాత్రి సంతానం లేని మహిళలు సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుని, నాగుల చీర కట్టుకుని ముడుపులు కడతారు. ఈ ఆలయం వెనుక కొంతసేపు నిద్రిస్తారు. సంతానం కలిగాక, పిల్లలకు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు.
(4 / 6)
డిసెంబర్ 7 నుంచి అత్తిలిలో షష్ఠి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. అత్తిలి షష్ఠి ఉత్సవాలకు శతాబ్దానికి పైగానే చరిత్ర ఉంది. అత్తిలి పంచాయతీ కార్యాలయం సమీపంలోని కోనేటి వద్ద ఒక పెద్ద పుట్ట దగ్గర భక్తులు పూజలు చేస్తుండేవారు. అక్కడ ఒక ఏకశిలపై శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాన్ని 1910లో ఏర్పాటు చేశారు. ఇక అప్పటి నుంచి ఏటా మార్గశిర మాసంలో పంచమి రోజున స్వామి వారి కల్యాణం, షష్ఠి తీర్థం నిర్వహిస్తారు. 1929లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని అప్పట్లో భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి బాబూరాజేంద్రప్రసాద్ దర్శించుకున్నారు.
(5 / 6)
కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సుబ్రహ్మణ్యుడు పరమశివుని అవతారంగా లింగాకారంలో పూజలందుకుంటున్న ఏకైక క్షేత్రం మోపిదేవి. నాగదోషాలను, సంతానలేమిని, కుజదోష నివారణతో పాటు జ్ఞానవృద్ధిని కలిగించే దైవంగా మోపిదేవి సుబ్రహ్మణ్యుడికి గొప్ప పేరు ఉంది. విజయవాడకు సుమారు 70 కి.మీ దూరంలో, మచిలీపట్టణానికి 35 కి.మీ దూరంలో, రేపల్లెకు 8 కి.మీ దూరంలో మోపిదేవి క్షేత్రం ఉంది.
ఇతర గ్యాలరీలు