(1 / 7)
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నిర్వహణలో ఉన్న పెద్ద వాగు ప్రాజెక్టు కట్ట తెగపడింది. 1989లో ఇలానే పెద్దవాగు ప్రాజెక్టు కట్ట తెగిపోయింది. సరిగ్గా 35 ఏళ్ల తరువాత మళ్లీ ప్రాజెక్టు కట్ట తెగిపడింది. ఈ ప్రాజెక్టు పరిధిలో దిగువ 20 వేలు ఎకరాల ఆయకట్ట ఉంది.
(2 / 7)
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, తెలంగాణలోని అశ్వారావుపేటలో భారీ వర్షాల కారణంగా గొట్టెల మంగమ్మ వాగు, వినయక పురం వాగు నుంచి పెద్దవాగు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చింది. భారీ వర్షాల కారణంగా రెండు టీఎంసీల నీరు పెద్దవాగు ప్రాజెక్టుకు చేరుకుంది. ప్రాజెక్టులోకి వచ్చిన వరద నీరును కిందకు పంపాల్సి ఉంది. అయితే కిందకు పంపేందుకు ప్రాజెక్టు గేట్లు తెరవాల్సి ఉంది. కాని ప్రాజెక్టుకు ఉన్న గేట్లు సరిగా పని చేయకపోవడంతో నీట ప్రవాహం ఎక్కువ అవ్వడంతో అప్పటికే బలహీనంగా ఉన్న కట్ట తెగిపడిపోయింది.
(3 / 7)
ఇంత భారీస్థాయిలో వరద నీరు వస్తుందని రెండు రాష్ట్రాల అధికారులు అంచనా వేయలేదు. ప్రాజెక్టుకు మొత్తం మూడు గేట్లు ఉన్నాయి. అందులో రెండు గేట్లు కొద్దిమేర పని చేశాయి. ఒక గేటు అసలు పని చేయలేదు. దీంతో వరద నీరు ప్రభావం కట్టపై పడింది. కట్ట బలహీనంగా ఉండటంతో రాత్రి ఏడు గంటల సమయంలో ప్రాజెక్టు కట్ట తెగిపోయింది. ఈ కట్ట తెగడానికి ప్రాజెక్టు నిర్వహణ లోపమే ప్రధానంగా కనబడుతుంది.
(4 / 7)
ఒక్క రోజు వ్యవధిలోనే భారీ స్థాయిలో ఇన్ ఫ్లో కావడంతో 250 మీరట్ల మేర కట్ట తెగింది. దీంతో వరద నీరు దిగువ ప్రాంతాలకు పోటెత్తుంది. దిగువన ఉన్న గ్రామాల్లోకి వరద నీరు చేరి, గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్‌లోని వేలేరుపాడు మండలం, తెలంగాణలోని అశ్వారావుపేట మండలాలు ఉన్నాయి. ఈ రెండు మండలాల్లో అనేక గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి.
(5 / 7)
ఆంధ్రప్రదేశ్‌లోని వేలేరుపాడు మండలంలో కుమ్మరి గూడెం, అల్లూరు నగర్, రామారం, ఉదయ నగర్ గ్రామం, మాదారం, ఒంటిబండ, కొత్త చీపురాల, పాత పూచరాల, సంతవాడ, కోయ మాగారం, కొడగట్ల పాడు తదితర గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. తెలంగాణలోని అశ్వారావుపేట మండలంలో కోయ రంగాపురం, గుమ్మడవల్లి, కొత్తూరు, రమణక్కపేట తదితర గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి.
(6 / 7)
పేదవాగు ముంపుతో ఈ గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. వరద నీరు పోటెత్తడంతో అక్కడి ప్రజలు అల్లాడి పోతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హెలికాఫ్టర్ల సాయంతో వరదల్లో చిక్కున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెండు రాష్ట్రాల అధికారులు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు.
(7 / 7)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం వరద బీభత్సానికి గురైన వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాలను ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు సందర్శించారు. గతంతో కూడా ఇలానే ప్రాజెక్టు నిర్వహణలో లోపం వల్ల రాజంపేటలోని అన్నమయ్య ప్రాజెక్టు కూడా తెగిపడింది. అప్పుడు ప్రాణ నష్టం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. (రిపోర్టర్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
ఇతర గ్యాలరీలు