(1 / 9)
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి విడతలో ప్రోసిడింగ్స్ అందుకున్న వారిలో పలువురు నిర్మాణాలు చేపట్టారు. వీరికి దశల వారీగా ప్రభుత్వం నిధులు జమ చేస్తూ వస్తోంది.
(2 / 9)
మరోవైపు రెండో విడత జాబితా విడుదలకు కూడా కసరత్తు జరుగుతోంది. ఈ విడతలో భారీ సంఖ్యలోనే లబ్ధిదారులను గుర్తించనున్నారు. వీరందరికీ జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆమోదంతో ప్రోసిడింగ్ కాపీలను అందజేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ తుది దశకు చేరింది.
(3 / 9)
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రకటించింది. 400 చదరపు అడుగులకు తగ్గకుండా…. 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మించుకోవాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే చాలా మందిలో ఇంటి నిర్మాణంపై అనుమానాలు నెలకొన్నాయి. ప్రభుత్వం సూచించిన విధంగానే ఇంటి డిజైన్ ఉండాలా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
(4 / 9)
ఇంటి నిర్మాణంపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ ఉంటుందే తప్ప…. నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం చేపట్టడం లేదని స్పష్టం చేశారు. లబ్దిదారులు తమ స్ధలానికి అనుగుణంగా తమకు ఇష్టమైన రీతిలో 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మించుకునే సౌలభ్యాన్ని కల్పించడం జరిగిందన్నారు.
(5 / 9)
ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం… 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా ఇంటిని నిర్మించుకోవాలి. అయితే డిజైన్ విషయంలో మాత్రం లబ్ధిదారుడి ఇష్టమే ఉంటుంది. ఈ విషయంలో అధికారుల జోక్యం ఉండదు.
(6 / 9)
ఇందిరమ్మ ఇండ్ల పధకానికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద 47,335 ఇండ్లు మంజూరు చేయగా… ఇప్పటి వరకు 7,824 ఇండ్లు బేస్‌మెంట్, 895 ఇండ్లు గోడల నిర్మాణం వరకు మరో 64 ఇండ్లు శ్లాబ్ ల వరకు పూర్తయ్యాయి.
(7 / 9)
రాష్ట్రంలో ఇంతవరకు బేస్మెంట్ పూర్తి అయిన 5,682 ఇండ్లకు లక్ష చొప్పున రూ. 56.82 కోట్లు, గోడలు పూర్తి అయిన 497 ఇండ్లకు 2లక్షల చొప్పున రూ. 9.94 కోట్లు, స్లాబు పూర్తయిన 33 ఇండ్లకు 4లక్షల చొప్పున రూ. 1.32 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. మొత్తంగా ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ. 68.08 కోట్లు అందజేసినట్లు వెల్లడించారు.
(8 / 9)
రాష్ట్రంలో దాదాపు 250 మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతోంది, లబ్దిదారులకు ఇంజనీర్లు నిర్మాణ పనుల్లో తగు సహకారాన్ని అందించాలని మంత్రి పొంగులేటి సూచించారు. వర్షాకాలంలో ఇబ్బంది పడకుండా లబ్దిదారులను ప్రోత్సహించాలని తెలిపారు.
(9 / 9)
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ స్థాయిని బట్టి లబ్దిదారునికి నిధులు జమ చేస్తున్నారు. బేస్‌మెంట్ తర్వాత లక్ష.. గోడలు పూర్తయ్యాక లక్షా 25వేలు.. శ్లాబ్ తర్వాత లక్షా 75 వేలు.. ఇళ్లు మొత్తం పూర్తయ్యాక లక్ష రూపాయలు అందించనున్నారు. ప్రతి దశలోనూ ఫొటోలు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకు పరిశీలన చేసిన తర్వాతే… లబ్ధిదారుడి ఖాతాలో నేరుగా డబ్బులు జమవుతాయి.
ఇతర గ్యాలరీలు