(1 / 6)
జూలై 1వ తేదీ నుంచి శ్రీశైల ఆలయంలో ‘ఉచిత స్పర్శ దర్శనాన్ని’ పునఃప్రారంభించారు. దీంతో చాలా మంది భక్తులు శ్రీశైలం వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటోంది.
(2 / 6)
అయితే భక్తుల రద్దీతో పాటు ఇతర కారణాల రీత్యా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉచిత స్పర్శ దర్శనానికి ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారా టోకెన్లు జారీ చేస్తున్నట్లు ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటించారు. దీంతో స్పర్శ దర్శనం కోసం ఆన్ లైన్ ద్వారా టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది.
(3 / 6)
భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండటంతో పాటు పారదర్శకంగా సేవలు అందించే దిశగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే టోకెన్లు జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ దర్శనం కోసం వచ్చే భక్తులు…. www.srisailadevasthanam.org లేదా www.aptemples.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పేరు, చిరునామా, ఆధార్ నంబరు నమోదు చేసి టోకెన్లు పొందాల్సి ఉంటుంది. ఒకరోజు ముందుగానే (సోమవారం నుంచి) వీటిని తీసుకోవచ్చు.
(4 / 6)
వారంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఈ అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకు ఉచితంగా స్పర్శ దర్శనాన్ని అమలు చేస్తారు.స్పర్శ దర్శనంలో భాగంగా… ఆలయంలోని అభిషేక సమయంలో భక్తులు లింగాన్ని తాకే అవకాశం ఉంటుంది. దీన్నే స్పర్శదర్శనంగా పేర్కొంటారు. ఈ అవకాశం కోసం చాలా మంది శివభక్తులు ఎదురుచూస్తుంటారు.
(5 / 6)
ఆన్ లైన్ ద్వారా పొందే టోకెన్లను ఉచిత దర్శనం ప్రవేశద్వారం వద్ద గల స్కానింగ్ ద్వారా తనిఖీ చేసి భక్తులను ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతిస్తారు. వీరిని ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా మాత్రమే అనుమతిస్తారు.
(6 / 6)
ఎంపిక చేసిన కొన్ని పండుగలు , మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం ఈ స్పర్శ దర్శన సేవ ఉండదు అని దేవస్థానం వర్గాలు ప్రకటించాయి. ఇందులో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది, దసరా ఉత్సవాలు, శ్రావణ, కార్తిక మాసాలతోపాటు ప్రభుత్వ సెలవు దినాలు ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు