(1 / 7)
తమిళనాడులోని ఆరు మురుగన్ ఆలయాలతో పాటు, కర్ణాటక రెండు, ఏపీలోని రెండు సుబ్రహ్మణ్య క్షేత్రాలు, విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయం, పిఠాపురం శ్రీ పురూహూతిక ఆలయాల్లో మంగళవారం పూజలు నిర్వహించారు. దుర్గ గుడిలో జరిగిన పూజల్లో మంత్ర నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
(2 / 7)
కర్ణాటకలోని కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో పూజాదికాల కోసం అనంతపురం నుంచి జనసేన నాయకులు, శ్రేణులు తరలివెళ్ళాయి. ఈ బృందానికి అనంతపురం – హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ టి.సి.వరుణ్ నేతృత్వం వహిస్తున్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నేతృత్వంలోని బృందం ఘాటీ శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో పూజలు చేయిస్తుంది.
(3 / 7)
దేశ సైన్యంతో పాటు దేశ నాయకత్వానికి దైవ బలం అండగా ఉండాలని జనసేన ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ సైన్యానికీ, దేశ నాయకత్వానికి దైవ బలం, ఆశీస్సులు మెండుగా ఉండాలని షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు చేయించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో జనసేన నేతలు పూజలు నిర్వహించారు.
(4 / 7)
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, శాసనమండలి విప్ పిడుగు హరిప్రసాద్ లు భారత సేనలకు, దేశ నాయకత్వానికీ దైవ బలం తోడుగా ఉండాలని పూజలు చేయించారు.
(5 / 7)
పవన్ కళ్యాణ్ సూచనల మేరకు తమిళనాడులోని తిరుపరకుండ్రంలోని ఆలయంలో పూజల కోసం ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్, పళని క్షేత్రంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, స్వామిమలై క్షేత్రంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తిరుచెందూర్ ఆలయంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, తిరుత్తణిలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పాలముదిరిచోళై మురుగన్ ఆలయంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, శ్రేణులు పూజల కోసం తరలి వెళ్ళాయి.
(6 / 7)
అమ్మవారి ఆశీస్సులు మన దేశ సైనికులకు తోడుగా ఉండాలని దుర్గమ్మకు పూజలు చేసినట్టు నాదెండ్ల మనోహర్ వివరించారు. దేశ ప్రజల మనోబలంతో భారత సైనికులు ప్రతి అడుగు ముందుకు వేస్తూ ముష్కరులను తుద ముట్టించేలా చూడాలని ప్రార్థించినట్టు చెప్పారు. వర్తమాన రాజకీయాల్లో దేశం కోసం అందరిలో స్ఫూర్తి నింపుతూ, జాతీయతా భావాన్ని యువతలో తీసుకొచ్చేలా జనసేన పని చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పూజలు చేస్తున్నారని, సైనికుల సంకల్ప బలానికి దైవ బలం తోడుగా ఉండాలని అన్ని చోట్లా పార్టీ శ్రేణులు పూజల్లో పాల్గొంటున్నారని చెప్పారు.
(7 / 7)
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారికి మంత్రి నాదెండ్ల, జనసేన నేతలు పూజలు నిర్వహించారు.
ఇతర గ్యాలరీలు