(1 / 8)
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రధాన పట్టణాలు కాకుండా చిన్న చిన్న పట్టణాలతో పాటు అన్ని గ్రామాల్లోనూ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రోసిడింగ్స్ అందుకున్న వారు ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టారు.
(2 / 8)
గ్రామాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇదే విషయంపై రాష్ట్ర గృహ నిర్మాణశాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పట్టణ ప్రాంతాలలో కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించామని తెలిపారు.
(3 / 8)
పట్టణాల్లోని మురికి వాడల్లో జీవనం కొనసాగిస్తున్న పేదలు అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారని మంత్రి పొంగులేటి చెప్పారు,. ముఖ్యంగా హైదరాబాద్ కు దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఇండ్లు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు.
(4 / 8)
హైదరాబాద్ కు దూరంగా గతంలో 42 వేల ఇండ్లను నిర్మించగా…. సుమారు 19 వేల మంది మాత్రమే అక్కడికి వెళ్లారని పొంగులేటి చెప్పారు. ఇటీవల క్షేత్రస్ధాయిలో మరోసారి పరిశీలన జరుపగా కేవలం 13 వేల మంది మాత్రమే ఆ నివాసాలలో ఉంటున్నట్లు తేలిందన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పట్టణ ప్రాంతాలలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని మురికి వాడల్లో పేదలు ఉన్నచోటే జీ+3 పద్దతిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
(5 / 8)
ఇందులో భాగంగా తొలివిడతలో హైదరాబాద్‌లో 16 మురికివాడలను గుర్తించామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. అలాగే వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ కరీంనగర్ తదితర పట్టణాలలో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
(6 / 8)
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచన మేరకు…. భద్రాచలం, ఉట్నూరు, ఏటూరునాగారం, మున్ననూరు నాలుగు ఐటిడిఎ పరిధిలోగల చెంచు, కొలం, తోటి, కొండరెడ్లకు 13,266 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు. అలాగే రాష్ట్రంలోని 16 ఎస్టీ నియోజకవర్గాలకు ఇప్పటికే 8,750 ఇండ్లు మంజూరు చేశామని దీనితో కలిపి గిరిజనులకు ఇంతవరకు 22,016 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు పొంగులేటి వెల్లడించారు.. ఈ ఇండ్లకు తక్షణమే లబ్దిదారులను గుర్తించి ఇండ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
(7 / 8)
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నిర్మాణంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇండ్ల నిర్మాణం జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
(8 / 8)
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదవాళ్ల ఇంటికోసం ఐదు లక్షల రూపాయిలు ఖర్చు చేయడం లేదని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని , దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగం పనిచేయాలని అన్నారు.
ఇతర గ్యాలరీలు