Etikoppaka Bommalu :ఏటికొప్పాక బొమ్మలు అద్భుత కళాఖండాలు- వీటి ప్రత్యేకతలు ఏంటంటే?
Etikoppaka Bommalu : 76వ రిపబ్లిక్ పరేడ్ లో 'ఏటికొప్పాక' బొమ్మలతో ఉన్న ఆంధ్రప్రదేశ్ శకటం అందర్నీ ఆకర్షించింది. ఏటికొప్పాక హస్త కళల గురించి జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేసింది. ఏటికొప్పాక లక్క బొమ్మలు అన్ని వయసుల వారినీ మంత్రముగ్ధులను చేస్తాయి.
(1 / 6)
76వ రిపబ్లిక్ పరేడ్ లో 'ఏటికొప్పాక' బొమ్మలతో ఉన్న ఆంధ్రప్రదేశ్ శకటం అందర్నీ ఆకర్షించింది. ఏటికొప్పాక హస్త కళల గురించి జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేసింది. ఏటికొప్పాక లక్క బొమ్మలు అన్ని వయసుల వారినీ మంత్రముగ్ధులను చేస్తాయి. పిల్లల ఆట బొమ్మలు, గృహ అలంకరణ బొమ్మలు ఇలా అన్ని రూపాల్లోనూ ప్రాచుర్యం పొందాయి. వీటిలో మన సంప్రదాయాలు, ఆచారాలు ప్రతిబింబిస్తాయి.
(2 / 6)
విశాఖపట్నం జిల్లా ఏటికొప్పాక గ్రామంలో తయారయ్యే ఈ లక్క బొమ్మలకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. వరాహానది పక్కన ఉండే ఓ చిన్న గ్రామం ఏటికొప్పాక. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక కళాకారుడు ఉంటారు. అంకుడు కర్రతో సహజ రంగులను ఉపయోగించి మనసుకు హత్తుకునే కళాఖండాలను తయారుచేస్తారు. చింతలపాటి వెంకటపతిరాజు అనే కళాకారుడు 1990లో రసాయన రంగుల స్థానంలో సహజ రంగులను వాడడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ బొమ్మలకు సహజరంగులే వాడుతున్నారు.
(3 / 6)
ఏటికొప్పాక సంప్రదాయ చెక్క బొమ్మలు, కళాఖండాలకు ప్రసిద్ధి చెందింది. ఈ బొమ్మల ప్రత్యేక ఏంటంటే? ఎక్కడా పదునైన అంచులు ఉండవు. బొమ్మలన్నీ గుండ్రని ఆకారం చేస్తారు. సహాజ రంగులతో పర్యావరణ అనుకూలంగా అన్ని వైపులా గుండ్రంగా చేస్తారు. పూలు, చెట్ల బెరడుల నుంచి చేసిన రంగులనే వాడతారు. ఏటికొప్పాక బొమ్మ చేయటమంటే ఓ జీవికి ప్రాణం పోసినంతపని అంటారు కళాకారులు.
(4 / 6)
ఏటికొప్పాక చుట్టుపక్కల అడవులలో దొరికే అంకుడు చెట్ల కొమ్మలను తెచ్చి ఎండబెట్టి ఈ బొమ్మలను తయారు చేస్తారు. చెవిదుద్దులు, గాజులు, షార్క్ చేప నుంచి తిమింగలాలు వరకు, ఇంట్లో పెట్టుకునే అందమైన బొమ్మలు, దేవుళ్ల బొమ్మలు, గోడగడియారాలు, అలంకరణ వస్తులు ఇంకా ఎన్నో వందల రకాల వస్తువులను ఏటికొప్పాక కళాకారులు తయారు చేస్తారు. ఈ బొమ్మలు వివాహాలు, గృహప్రవేశాలు, బొమ్మల కొలువుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
(5 / 6)
ఈ బొమ్మలకు అవసరమైన లక్కను రాంచీ నుంచి దిగుమతి చేసుకుంటారు. లక్కను పసుపు, నేరేడు, ఉసిరి, వేప వంటి సహజ సంపద నుంచి వచ్చే రంగులతో కలిపి బొమ్మలకు అద్దుతారు. ఏటికొప్పాక బొమ్మల తయారీలో ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాలకు ఈ బొమ్మలు ఎగుమతి చేస్తుంటారు. ఏటికొప్పాక బొమ్మల తయారీలో ప్రతి ఇంట్లో ఒక కళాకారుడు ఉంటారు.
(6 / 6)
ఏటికొప్పాక గ్రామాన్ని సందర్శించాలనుకునే వారు విశాఖపట్నం నుంచి బస్సు లేదా రైలు ద్వారా చేరుకోవచ్చు. ఏటికొప్పాక బొమ్మలకు దేశ విదేశాల్లో ఎంతో పేరుంది. ఈ బొమ్మల తయారీ ద్వారా ఏటికొప్పాక, కోటవురట్ల ప్రాంతాల్లో వందల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళలో మహిళలకు శిక్షణ ఇచ్చి నైపుణ్యం పెంచుకుని ఉపాధి పొందేలా ప్రోత్సాహం అందిస్తోంది.
ఇతర గ్యాలరీలు