(1 / 7)
ఏపీలో మళ్లీ రేషన్ దుకాణాల వ్యవస్థ మళ్లీ ప్రారంభమైంది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారానే సరుకులను పంపిణీ చేస్తున్నారు. డోర్ డెలివరీ విధానం రద్దు కావటంతో… రేషన్ కార్డుదారులు షాపుల వద్దకు వెళ్లి సరుకులను తీసుకుంటున్నారు.
(2 / 7)
ప్రతి నెలా 1 నుంచి 15 తేదీలోపు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయి. ఆదివారాల్లోనూ సరుకులు పంపిణీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. వీలున్న సమయంలో రేషన్ దుకాణాల దగ్గరకు వెళ్లి సరకులు తెచ్చుకోవచ్చని సూచించింది.
(3 / 7)
ఇక దివ్యాంగులకు, 65 ఏళ్లు నిండిన వృద్ధులకి ప్రతి నెలా 5వ తేదీలోపు సరుకులు ఇళ్ల వద్దే అందిస్తున్నారు. ఇలాంటి వారి వివరాలను సేకరించిన ప్రభుత్వం… నేరుగా డీలర్లు వారి ఇంటికే రేషన్ సరుకులను సరఫరా చేస్తున్నారు.
(4 / 7)
రేషన్ పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా… మరో ఆలోచన చేస్తోంది. రేషన్ బియ్యం వద్దన్న వారికి ఇతర నిత్యావసరాలు ఇచ్చే ఆలోచనను ఏపీ సర్కార్ చేస్తోంది. ఈ విధానం అమలుపై రాష్ట్ర పౌర సరఫరాలశాఖ ద్వారా అధ్యయనం చేయించే పనిలో పడింది. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
(5 / 7)
రేషన్ బియ్యంపై కిలోకు రూ.46 చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. అయితే ఈ బియ్యాన్ని తీసుకునే చాలా మంది లబ్ధిదారులు… అమ్మేసుకుంటున్నారు. అది కూడా కిలోపై అతి తక్కువ ధరకే విక్రయిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న ప్రైవేటు వ్యక్తులు… పాలిష్ చేసి విక్రయిస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే…. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవాలని చూస్తోంది.
(6 / 7)
బియ్యానికి బదులుగా ఆ మొత్తానికి సరిపడా ఇతర నిత్యావసరాలు అందించే విధానం అమలుపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎంత వరకు అమలు సాధ్యమవుతోంది..? ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే దానిపై అధ్యయం చేయిస్తోంది.
(image source twiiter)(7 / 7)
పౌరసఫరాల శాఖ అధ్యయనం తర్వాత.. ప్రభుత్వానికి నివేదిక అందుతుంది. ఆపై సర్కార్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇతర గ్యాలరీలు