NATS | నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీం (నాట్స్) ద్వారా శిక్షణ, స్టైపెండ్
NATS -National apprenticeship training scheme: నేషనల్ అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ స్కీం సాంకేతికంగా అర్హత కలిగిన యువత తమ ఉపాధి, ఉద్యోగానికి అవసరమైన ప్రాక్టికల్ నాలెడ్జ్, నైపుణ్యాలను అందించే శిక్షణ కార్యక్రమం. అప్రెంటిస్‌లకు వారి పని స్థలంలో సంస్థల ద్వారా శిక్షణ అందుతుంది.

NATS -National apprenticeship training scheme: అద్భుతమైన శిక్షణా సౌకర్యాలు ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రయివేటు సంస్థలలో శిక్షణ కోసం నేషనల్ అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ స్కీం ద్వారా అప్రెంటిస్ అవకాశం దక్కుతుంది.
అధునాతన ట్రైనింగ్ మాడ్యూల్స్‌తో శిక్షణ పొందిన మేనేజర్లు.. అప్రెంటిస్‌లు పనిని వేగంగా, సమర్థవంతంగా నేర్చుకునేలా చూస్తారు. అప్రెంటిస్‌షిప్ కాలంలో అప్రెంటిస్‌లకు స్టైపెండ్ చెల్లిస్తారు. దీనిలో 50% కేంద్ర ప్రభుత్వం యజమానికి తిరిగి చెల్లిస్తుంది.
NATS శిక్షణా కాలం చివరలో అప్రెంటిస్‌లకు భారత ప్రభుత్వం ప్రొఫిషియెన్సీ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. దీనిని చెల్లుబాటు అయ్యే ఉపాధి అనుభవంగా దేశవ్యాప్తంగా అన్ని ఉపాధి ఎక్స్ఛేంజీల్లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా నాలుగు రీజియన్లలో అప్రెంటిస్ బోర్డులు పనిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సదరన్ రీజియన్ బోర్డు పనిచేస్తోంది.
నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీం ద్వారా అప్రెంటిస్‌షిప్ పొందడానికి ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ క్వాలిఫికేషన్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. నాట్స్ వెబ్ పోర్టల్ లో నమోదు చేసుకుని అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రాడ్యుయేట్, డిప్లొమా విద్యార్థులకు 126 సబ్జెక్ట్ ఫీల్డ్‌లు ఉన్నాయి. వీటిలో శిక్షణ అందిస్తారు. శిక్షణ కాలం ఒక సంవత్సరం. శిక్షణకు ఎంపిక కావడానికి సమయానుసారంగా జరిగే అప్రెంటిస్‌షిప్ ఫెయిర్‌లకు విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుంది. 2021-22 నుంచి హ్యుమానిటీస్, కామర్స్, సైన్స్ విద్యార్థులకూ అప్రెంటిస్‌షిప్ అందించాలని కేంద్రం నిర్ణయించింది.
అప్రెంటిస్‌షిప్ పూర్తి చేస్తే?
అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన అభ్యర్థులకు తాను ఎంచుకున్న ఫీల్డ్‌లో నైపుణ్యాలు మెరుగుపడడంతో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. పరిశ్రమలు సదరు నైపుణ్యం గల అభ్యర్థుల కోసం వెతుకుతున్నప్పుడు వీరికి తగిన ప్రాధాన్యత దక్కుతుంది. ఒక్కోసారి అప్రెంటిస్‌షిప్ పూర్తిచేసిన చోటే ఉద్యోగం దక్కుతుంది.
మరో రూ. 3 వేల కోట్ల కేటాయింపు..
నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీం (నాట్స్) కోసం కేంద్ర మంత్రి మండలి నవంబరు 24న రూ. 3,054 కోట్లు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. మరో ఐదేళ్ల పాటు ఈ స్కీమ్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 7 లక్షల మంది అభ్యర్థులకు నాట్స్ ద్వారా అప్రెంటిస్‌షిప్ అందించాలని నిర్ణయించింది.
ఇప్పటివరకు ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేవారు. ఇకపై హ్యుమానిటీస్, సైన్స్, కామర్స్ విద్యార్థులందరికీ వర్తింపజేసేలా కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది. సుమారు రూ. 9 వేల మేర స్టైపెండ్ అందేలా చూడాలని కేంద్రం నిర్ణయించింది.
సంబంధిత కథనం