ఫ్లాట్ కొనే ముందు ఈ తప్పులు చేయకండి..-avoid mistakes while buying the flat ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Avoid Mistakes While Buying The Flat

ఫ్లాట్ కొనే ముందు ఈ తప్పులు చేయకండి..

Praveen Kumar Lenkala HT Telugu
May 04, 2022 04:35 PM IST

ఫ్లాట్ లేదా ఇల్లు కోసం కలలు కనని వారుండరు. ఫ్లాట్ కోసం చాాలా రీసెర్చ్ చేశాక కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం. అయితే ఇవన్నీ మనం కావాలని చేసే తప్పులు కాదు. చెక్ లిస్ట్‌లో వీటిని కూడా చేర్చుకుంటే మీ ఫ్లాట్ కొనుగోలు పర్వం ప్రశాంతంగా ముగుస్తుంది. చిన్న తప్పులకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్లు
గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్లు (unsplash)

లొకాలిటీ ఎంచుకోవడంలో పొరపాటు..

పెరిగిన రియల్ ఎస్టేట్ ధరలను చూసి కాస్త దూరమైనా సరే ఏదో ఒక చోటు అని సర్ది చెప్పుకుని తక్కువ రేటు ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుంటాం. అయితే అక్కడ నివాసానికి వెళ్లే సరికి అసలు విషయం మనకు బోధపడుతుంది. ముఖ్యంగా లొకాలిటీ ఎంచుకునే సందర్భంలో అక్కడ తాగునీటి లభ్యత, నిరంతర విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. 

ట్రెండింగ్ వార్తలు

మౌలిక సదుపాయాలు అంటే అందుబాటులో పాఠశాలలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ఆసుపత్రులు, నిత్యావసర వస్తువుల లభ్యత, తదితర ముఖ్యమైన మౌలిక సదుపాయాలను పరిశీలించి లొకాలిటీ ఎంచుకోవాలి. బాగా రద్దీగా ఉన్న, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కూడా వదిలేయాలి. 

లోన్ అప్రూవ్ కాకముందే అడ్వాన్స్ ఇవ్వడం..

వేతన జీవులు ఫ్లాటు లేదా ఇల్లు కొనుగోలు చేసేందుకు హోం లోన్‌పై ఆధారపడడం సహజం. అయితే కొందరు అతి విశ్వాసంతో, లేదా తొందరపాటులో హోం లోన్‌కు అనుమతి రాకముందే అడ్వాన్స్ అమౌంట్ చెల్లిస్తారు. ఒక్కోసారి హోం లోన్ దక్కని పరిస్థితులు ఎదురవ్వొచ్చు. ఇలాంటి సందర్భంలో బిల్డర్ మనం ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి ఇవ్వకపోతే ఆర్థికంగా నష్టపోతాం. అంతేకాకుండా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి రావొచ్చు.

పర్చేజ్ అగ్రిమెంట్ సరిగ్గా చదవకపోవడం

ఇల్లు బుక్ చేసుకున్న తరువాత పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పుడు సంబంధిత డాక్యుమెంట్ పూర్తిగా చదవాలి. వీలైతే అవగాహన కోసం నిపుణులను సంప్రదించాలి. ఇందులో నిర్మాణ వ్యవధి, ప్రైస్ ఎస్కలేషన్, ప్లాన్ మార్పులు, చెల్లింపుల్లో జాప్యం, ఇలా అనేక అంశాలు ఉంటాయి. వీటన్నింటిపై స్పష్టమైన అవగాహన లేకుండా కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అన్ని ఖర్చులను తెలుసుకోకపోవడం..

ఫ్లాటు కొనుగోలు చేసేటప్పుడు పైకి కనిపించే చదరపు అడుగు ధర మాత్రమే కాకుండా, పైకి కనిపించని ఇతర అన్ని ఛార్జీలు తెలుసుకోవాలి. ఎమినిటీస్, పార్కింగ్, మెయింటేనెన్స్ డిపాజిట్ వంటి ఛార్జీల గురించి తెలుసుకోవాలి. అలాగే కొందరు బిల్డర్లు తాగునీటి సరఫరాతో వారికి సంబంధమే లేదన్నట్టుగా మున్సిపల్ కనెక్షన్ తీసుకోవడం వినియోగదారుడి బాధ్యతగా చూస్తారు. 

ఇందుకోసం మళ్లీ ఫ్లాటు యజమానులందరూ కలిసి మున్సిపల్ నీటి కనెక్షన్ కోసం డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఆ లొకాలిటీకి ఇప్పటివరకు నల్లా రాకపోతే చాలా ఖర్చవుతుంది. జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వంటి చట్టబద్ధమైన ఛార్జీలకు తోడు, చివరగా ఇంటీరియర్ ఖర్చులు కూడా ఉంటాయి. అందువల్ల మీరు బడ్జెట్ ఎక్స్‌టెండ్ చేసుకుందాంలే అనుకుంటే కుదరదు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సిందే.

కార్పెట్ ఏరియానా? బిల్టప్ ఏరియానా?

కార్పెట్ ఏరియా అంటే మీ ఫ్లాటు లోపలి భాగం. బిల్టప్ ఏరియా అంటే కామన్ ఏరియాతో కలిపి లెక్కిస్తారు. ఇతర దేశాల్లో కార్పెట్ ఏరియానే లెక్కిస్తారు. దీని వల్ల కొనుగోలుదారుకు ప్రయోజనం ఉంటుంది. ఇక్కడ కూడా కొందరు బిల్డర్లు కార్పెట్ ఏరియా లెక్కించి మాత్రమే దానిపై వసూలు చేస్తారు. మీరు కూడా దీని కోసం అడిగి తెలుసుకోవడం మంచిది.

నిపుణుల సలహా తీసుకోకపోవడం..

ఒక్కోసారి కొంత రుసుము చెల్లించి నిపుణుల సలహా తీసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు టైటిల్ క్లియరెన్స్, అనుమతుల పత్రాలను తనిఖీ చేసుకోవడం మనకు రానప్పుడు న్యాయవాదిని సంప్రదించడంలో తప్పేమీ లేదు. జీవితకాలంలో ఒకసారి కొనుగోలు చేసే ఇల్లు విషయంలో ఆ మాత్రం సలహా తీసుకోవడం మన మంచికే అవుతుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్