Death Penalty : ఈ దేశంలో మరణశిక్ష రద్దు.. ఇప్పటికే ఉన్నవారికి ఇకపై జైలు శిక్ష
Death Penalty Scrapped : జింబాబ్వే మరణశిక్ష నిబంధనను రద్దు చేసింది. దేశంలో చివరిసారిగా 20 ఏళ్ల క్రితం ఒకరిని ఉరితీశారు.
ఒకవైపు మరణశిక్ష విధించడంలో అనేక అరబ్ దేశాలు ముందు ఉన్నాయి. మరోవైపు ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు దాని నుంచి తప్పుకుంటున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో దేశం పేరు చేరింది. ఆఫ్రికా ఖండం దక్షిణ భాగంలో ఉన్న జింబాబ్వే మరణశిక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ దేశంలో చివరిసారిగా రెండు దశాబ్దాల క్రితం ఒకరికి ఉరిశిక్ష పడింది. జింబాబ్వేలో ప్రస్తుతం 60 మంది ఖైదీలకు మరణశిక్ష ఉండగా.. వారందరినీ కొత్త చట్టం ప్రకారం విడిచిపెట్టనున్నారు.
పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించిన తర్వాత అధ్యక్షుడు ఎమ్మర్సన్ మంగాగ్వా ఈ చట్టానికి ఆమోదముద్ర వేశారు. 1960వ దశకంలో స్వాతంత్ర్య పోరాటంలో ప్రస్తుత అధ్యక్షుడు ఎమ్మెర్సన్ కు మరణశిక్ష విధించడం గమనార్హం. మైనారిటీ పాలనతో జరిగిన పోరాటంలో రైలును పేల్చినందుకు అతనికి మరణశిక్ష విధించారు. ఆ తర్వాత దాన్ని పదేళ్ల జైలు శిక్షగా మార్చారు. 2017 నుంచి మంగాగ్వా మరణశిక్షను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు.
ఇతర ఆఫ్రికా దేశాలైన కెన్యా, లైబీరియా, ఘనా ఇటీవల మరణశిక్షను రద్దు చేసే దిశగా సానుకూల చర్యలు తీసుకున్నాయని మానవ హక్కుల సంఘాలు తెలిపాయి. అయితే ఇది ఇంకా చట్టంగా మారలేదు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం, ప్రపంచంలోని దాదాపు మూడొంతుల దేశాలలో మరణశిక్ష అమలు అవుతుంది. ఆమ్నెస్టీ ప్రకారం 2023లో ఉరిశిక్షల్లో దాదాపు 90 శాతం ఇరాన్, సౌదీ అరేబియాలోనే జరిగాయి.
2005 నుండి జింబాబ్వేలో ఉరిశిక్షలపై తాత్కాలిక నిషేధం ఉంది. అయినప్పటికీ హత్య, రాజద్రోహం, ఉగ్రవాదంతో సహా పలు నేరాలకు కోర్టులు మరణశిక్షను విధిస్తూనే ఉన్నాయి. మరణశిక్ష రద్దు చట్టం, మంగళవారం ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించారు. కోర్టులు ఇకపై ఏ నేరానికి అయినా ఉరిశిక్ష విధించలేవు. ఇప్పటికే ఉన్న మరణశిక్షలను జైలు శిక్షగా మార్చవలసి ఉంటుంది.
అయితే, అత్యవసర పరిస్థితుల్లో మరణశిక్షపై సస్పెన్షన్‌ను ఎత్తివేయవచ్చని ఒక నిబంధన చెబుతోంది.