తోటి సైనికుడిని కాపాడుతూ ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారి- 23ఏళ్లకే మృతి..-young army officer shashank tiwari from ayodhya dies saving fellow soldier in sikkim ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  తోటి సైనికుడిని కాపాడుతూ ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారి- 23ఏళ్లకే మృతి..

తోటి సైనికుడిని కాపాడుతూ ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారి- 23ఏళ్లకే మృతి..

Sharath Chitturi HT Telugu

సిక్కింలో నీటి ప్రవాహంలో పడిపోయిన ఓ సైనికుడిని సాహసోపేతంగా రక్షించారు లెఫ్టినెంట్​ శశాంక్​ తివారీ. కానీ, ఆయన సురక్షితంగా బయటపడలేకపోయారు. 23ఏళ్లకే ప్రాణాలు కోల్పోయారు!

లెఫ్టినెంట్​ శశాంక్​ తివారీ..

అత్యంత ధైర్యసాహాసాలను ప్రదర్శిస్తూ.. తోటి సైనికుడిని కాపాడే క్రమంలో ఓ ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. సిక్కింలో గురువారం జరిగింది ఈ ఘటన. నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న ఓ సైనికుడిని సాహసోపేతంగా రక్షించిన లెఫ్టినెంట్​ శశాంక్​ తివారీ.. తన ప్రాణాలను మాత్రం కాపాడుకోలేకపోయారు! లెఫ్టినెంట్​ శశాంక్​ తివారీ వయస్సు 23ఏళ్లు.

అసలేం జరిగింది..?

గతేడాది డిసెంబర్​లో సిక్కిం స్కౌట్స్​లో చేరారు 23ఏళ్ల లెఫ్టినెంట్​ శశాంక్​ తివారీ. సిక్కింలోని ఓ ఆపరేటింగ్​ బేస్​కి తన టీమ్​తో గురువారం బయలుదేరారు. అక్కడ ఒక్క పోస్టు రెడీ అవుతోంది. ప్రతికూల పరిస్థితుల మధ్య అగ్నివీర్​ స్టీఫెన్​ సుబ్బా అనే సైనికుడు కాలు జారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అది గమనించిన లెఫ్టినెంట్​ తివారీ.. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే నీటి ప్రవాహంలోకి దూకేశారు. మరో జవాను నాయక్​ పుకార్​ పటేల్​ సైతం మద్దతుగా నిలిచాడు. ఇద్దరు కలిసి అగ్నివీర్​ని రక్షించగలిగారు.

అయితే ప్రమాదం నుంచి సుబ్బా బయటపడినప్పటికీ, లెఫ్టినెంట్​ శశాంక్​ తివారీ మాత్రం బలమైన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆయన్ని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 30 నిమిషాల తర్వాత, 800 మీటర్ల దూరంలో ఆయన మృతదేహాన్ని ఆర్మీ గుర్తించింది.

అయోధ్యకు మృతదేహం..

గురువారం ఈ ఘటన జరగ్గా.. లెఫ్టినెంట్ తివారీ పార్థివదేహాన్ని శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో సిలిగురిలోని బాగ్డోగ్రా విమానాశ్రయం నుంచి నేరుగా అయోధ్యకు తరలించారు. అయోధ్య విమానాశ్రయం నుంచి మిలటరీ అధికారులు మృతదేహాన్ని ఫైజాబాద్ మిలిటరీ ఆసుపత్రికి తరలించారని, అక్కడ రాత్రంతా మృతదేహాన్ని ఉంచుతారని అయోధ్య నగర ఎస్పీ మధుబన్ సింగ్ తెలిపారు.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లెఫ్టినెంట్ శశాంక్ తివారీ త్యాగానికి నివాళులర్పించి, ఆయన జ్ఞాపకార్థం అయోధ్యలో స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు.

శశాంక్​ అంత్యక్రియలు శనివారం జమ్తారా ఘాట్​లో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి.

చిన్నవయసులో, స్వల్పకాలం సేవలందించినప్పటికీ, రాబోయే తరాల సైనికులకు స్ఫూర్తినిచ్చే ధైర్యసాహసాలు, స్నేహ వారసత్వాన్ని మిగిల్చిన ధైర్యవంతుడు, నాయకుడిని కోల్పోయినందుకు ఆర్మీ సంతాపం వ్యక్తం చేస్తోందని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

అయోధ్య సిటీ మేజిస్ట్రేట్ రాజేష్ మిశ్రా మాట్లాడుతూ దివంగత లెఫ్టినెంట్ తివారీ తండ్రి జంగ్ బహదూర్ తివారీ మర్చంట్ నేవీలో పనిచేస్తూ, ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని తెలిపారు. అమెరికా నుంచి భారత్​కు బయలుదేరిన ఆయన శనివారం ఉదయానికి చేరుకోనున్నారు.

లెఫ్టినెంట్ తివారీ చదువులో ఎప్పుడూ ఫస్ట్​ ఉండేవాడని అయని మేనమామ రాజేష్ దూబే పేర్కొన్నారు. ఫైజాబాద్ నగరంలోని ఓ సీబీఎస్​ఈలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. 2019లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఎన్డీఏకు ఎంపికయ్యారు. చిన్నప్పటి నుంచి దేశానికి సేవ చేయాలనే తపన ఆయనలో ఉండేది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.