Zelensky about India: ‘‘మీకు చాలా పలుకుబడి ఉంది.. పుతిన్ ను ఆపగలరు’’: మోదీతో జెలెన్స్కీ
ప్రపంచ దేశాలలో భారత్ కు మంచి పలుకుబడి ఉందని, ఉక్రెయిన్ పై దురాక్రమణకు ప్రయత్నిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ను భారత్ నియంత్రించగలదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky) వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పడంలో క్రియాశీల పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉంటుదని ప్రధాని మోదీ అన్నారు.
భారత ప్రధాని మోదీ ప్రస్తుతం రష్యాతో యుద్ధంలో తలమునకలై ఉన్న ఉక్రెయిన్ లో పర్యటిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తో పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రష్యాపై దురాక్రమణకు ప్రయత్నిస్తున్న జెలెన్స్కీని ప్రపంచంలో చాలా పలుకుబడి ఉన్న భారత్ నియంత్రించగలదని, ఆ దిశగా ప్రయత్నించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు అభ్యర్థించారు.
భారత్ ప్రయత్నించాలి..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి భారత్ క్రియాశీల పాత్రను పోషించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కోరారు. రష్యా ఉక్రెయిన్ ల మధ్యజరుగుతోంది కేవలం సంఘర్షణ కాదని, ఇది పుతిన్ అనే ఒక వ్యక్తి.. ఉక్రెయిన్ అనే ఒక దేశంపై చేస్తున్న యుద్ధమని జెలెన్స్కీ అభివర్ణించారు. ‘‘ఈ విషయాన్ని భారతదేశం గుర్తించిందని నేను అనుకుంటున్నాను. మీరొక పెద్ద దేశం. మీరు పుతిన్ ను ఆపి, ఆయన ఆర్థిక వ్యవస్థను ఆపి, ఆయన ఎక్కడ ఉండాలో అక్కడ నిలబెట్టగలరు’’ అని జెలెన్స్కీ ఏఎన్ఐ వార్తాసంస్థతో అన్నారు.
మేం తటస్థులం కాదు.. శాంతి వైపు ఉంటాం..
కీవ్ లో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అనంతరం జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పడంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తో ప్రధాని మోదీ చెప్పారు. ‘‘మేం (భారత్) తటస్థంగా లేం. ఏ సంఘర్షణలోనైనా మేం ఒకే వైపు ఉంటాం. అది శాంతి వైపు. మేం ఎల్లప్పుడు శాంతి వైపే ఉంటాం. మేం యుద్ధానికి తావులేని బుద్ధుడి దేశం నుంచి వచ్చాం’’ అని జెలెన్స్కీని పక్కన కూర్చోబెట్టుకుని ప్రధాని మోదీ విలేకరులతో అన్నారు.
భారత్ తో నాలుగు ఒప్పందాలు
మోదీతో సమావేశం అనంతరం జెలెన్స్కీ ఎక్స్ పోస్టులో వైద్య రంగం, వ్యవసాయ సహకారం, మానవతా సంబంధాలు, సంస్కృతికి సంబంధించి భారత్, ఉక్రెయిన్ మధ్య కుదిరిన నాలుగు ఒప్పందాలను వివరించారు. ‘‘ఉక్రెయిన్ జాతీయ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భారత్ మద్దతు ఇస్తుంది. ఇది చాలా కీలకం ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఐక్యరాజ్యసమితి చార్టర్ ను సమానంగా గౌరవించాలి" అని జెలెన్స్కీ (zelensky) అన్నారు. మూడు దశాబ్దాల క్రితం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత ఒక భారత ప్రధాని ఉక్రెయిన్ లో పర్యటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ తో యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో మోదీ (Narendra Modi) రష్యాలో పర్యటించిన నెల రోజుల తర్వాత ఈ పర్యటన జరగడం గమనార్హం.
ఇది యుద్ధ యుగం కాదని పుతిన్ కు చెప్పాను
కొంత కాలం క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం సందర్భంగా, ఇది యుద్ధాలతో సమస్యలను పరిష్కరించుకునే యుగం కాదని చెప్పానని ప్రధాని మోదీ జెలెన్స్కీ (zelensky) తో చెప్పారు. ‘‘'కొంతకాలం క్రితం సమర్ ఖండ్ లో అధ్యక్షుడు పుతిన్ (putin) ను కలిసినప్పుడు ఇది యుద్ధ యుగం కాదని చెప్పాను. గత నెలలో నేను రష్యా వెళ్లినప్పుడు యుద్ధభూమిలో ఏ సమస్యకైనా పరిష్కారం దొరకదని స్పష్టమైన మాటల్లో చెప్పాను’’ అని మోదీ జెలెన్స్కీతో అన్నారు.