Yogi Adityanath : 'రూ. 300' స్కాలర్షిప్ చెక్ ఇచ్చిన సీఎం- ఇంత డబ్బిస్తే పిల్లలు పాడైపోతారంటూ కామెంట్స్!
Yogi Adityanath latest news : పిల్లలకు రూ. 300 స్కాలర్‌షిప్‌ని పంపిణీ చేస్తూ కనిపించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఈ వీడియోని చూసిన వారందరు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. విద్యార్థులకు రూ.300 నుంచి రూ.900 వరకు చెక్కులను సీఎం అందజేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు!
ఇదీ జరిగింది..
ఆదివారం జరిగిన కార్యక్రమంలో వారణాసిలో సంస్కృత స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను అందజేశారు.
ఒక యూజర్ ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేస్తూ, “అందులో ఉన్న అమౌంట్ కంటే, చెక్ కటౌట్‌కి అయిన ఖర్చే ఎక్కువ అయ్యుండొచ్చు. రూ. 300 కోసం ఇలాంటి పరేడ్ ఎందుకు నిర్వహిస్తున్నారు?” అని ప్రశ్నించాడు.
పబ్లిసిటీ కోసం ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని నెటిజన్లు ఈ వీడియోపై స్పందించారు.
“యోగి ఆదిత్యనాథ్ విద్యార్థులకు రూ.300 భారీ చెక్కు ఇస్తున్నారు. చెక్కుల ముద్రణకు అయ్యే ఖర్చు ఇంతకంటే ఎక్కువగా ఉంటుంది. పబ్లిసిటీ కోసం ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. ఇది బీజేపీ పార్టీ పతనం,” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
“కాంపిటీషన్లో వచ్చిన ప్రైజ్ కన్నా ఈ చెక్కు తయారు చేసిన ఖర్చు ఎక్కువగా ఉన్నట్టుంది! కనీసం సీఎం పదవినైనా గౌరవించండి యోగి జీ,” అని మరొకరు వ్యాఖ్యానించారు.
‘యోగి జీ.. ఇంత డబ్బు పిల్లలకు ఇచ్చి వారిని చెడగొట్టకండి,’ అని ఓ నెటిజన్ సైటర్ కామెంట్ చేశారు.
“ఫన్నీ విషయం ఏంటంట.. ఫొటో కోసం నలుగురు మంత్రులు రూ.300 చెక్కుపై చేతులు వేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గుచేటు," అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు.
వైరల్ వీడియోపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ షామా మహమ్మద్ కూడా స్పందించారు.
“ఇది బీజేపీ మాత్రమే చేయగలదు! విద్యార్థులకు ఉపకార వేతనం కింద రూ.300 చెక్కులను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పంపిణీ చేశారు. చెక్కుల వాస్తవ విలువ కంటే వాటి ముద్రణకే ఎక్కువ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది,” అని అన్నారు.
సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంస్కృత విద్యార్థులందరికీ ఈ స్కాలర్షిప్స్ పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా రెసిడెన్షియల్ గురుకుల తరహా సంస్కృత పాఠశాలలను పునరుద్ధరించే ప్రణాళికలను సీఎం ప్రకటించారు.
స్కాలర్షిప్ పథకం ప్రాముఖ్యతను వివరిస్తూ గతంలో కేవలం 300 మంది సంస్కృత విద్యార్థులు మాత్రమే స్కాలర్‌షిప్‌లకు అర్హులని, అప్పుడు కూడా వయో పరిమితులు ఉండేవన్నారు. అర్హులైన విద్యార్థులందరికీ ప్రయోజనాలను అందించడమే ఈ కొత్త కార్యక్రమం లక్ష్యం అని, స్కాలర్షిప్ నిధులను ప్రత్యక్షంగా, సురక్షితంగా బదిలీ చేసేందుకు విద్యార్థులందరూ బ్యాంకు ఖాతాలు తెరవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 69,195 మంది విద్యార్థులకు రూ.586 లక్షల ఉపకార వేతనాల పంపిణీని ప్రారంభించారు.
సంబంధిత కథనం