20 ఏళ్ల తరువాత చేతులు కలిపిన ఠాక్రే బ్రదర్స్; ‘‘ఎస్.. మేం గూండాలమే’’ అంటూ ఉద్ధవ్ ఠాక్రే సంచలన కామెంట్-yes we are goons slap but dont make video uddhav raj at thackeray reunion ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  20 ఏళ్ల తరువాత చేతులు కలిపిన ఠాక్రే బ్రదర్స్; ‘‘ఎస్.. మేం గూండాలమే’’ అంటూ ఉద్ధవ్ ఠాక్రే సంచలన కామెంట్

20 ఏళ్ల తరువాత చేతులు కలిపిన ఠాక్రే బ్రదర్స్; ‘‘ఎస్.. మేం గూండాలమే’’ అంటూ ఉద్ధవ్ ఠాక్రే సంచలన కామెంట్

Sudarshan V HT Telugu

శివసేన వారసత్వంపై విబేధాలతో విడిపోయిన రెండు దశాబ్దాల తరువాత, ఠాక్రే సోదరులు మళ్లీ చేతులు కలిపారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు కలిసి పాల్గొన్నారు. మహారాష్ట్రలో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం పాఠశాలల్లో హిందీని ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా వీరిద్దరూ చేతులు కలిపారు.

20 ఏళ్ల తరువాత చేతులు కలిపిన ఠాక్రే బ్రదర్స్ (Screengrab from ANI)

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. రాష్ట్రంలో ప్రజాదరణ, మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు శివసేన వారసత్వం ఉన్న నాయకులు శనివారం చేతులు కలిపారు. శివసేన ఉద్ధవ్ వర్గం నేత ఉద్ధవ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేలు కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. శివసేన వారసత్వంపై విబేధాలతో ఈ ఇద్దరు నాయకులు రెండు దశాబ్దాల క్రితం విడిపోయారు.

అవును గూండాలమే..

శనివారం ముంబైలో సోదరుడు రాజ్ ఠాక్రేతో కలిసి జరిగిన రీయూనియన్ ర్యాలీలో ఇద్దరు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ ‘‘అవును, మేం గూండాలమే. న్యాయం కోసం గూండాలుగా మారాల్సి వస్తే గూండాలుగా మారుతాం.. గూండాగిరి చేస్తాం’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరాఠీలో మాట్లాడనందుకు ఠాక్రేల మనుషులు వీధి వ్యాపారులతో సహా ప్రజలను చెంపదెబ్బ కొట్టడం, భయపెట్టడంపై వచ్చిన విమర్శలపై ఉద్ధవ్ పై విధంగా స్పందించారు.

చెంపదెబ్బ కొట్టండి, కానీ వీడియో తీయకండి

‘‘వారిని చెంపదెబ్బ కొట్టండి, కానీ వీడియో తీయకండి’’ అని సూచించారు. "గుజరాతీ అయినా, మరెవరైనా సరే ఇక్కడ బ్రతకాలంటే మరాఠీ తెలుసుకోవాలి. కానీ వారు మరాఠీ మాట్లాడకపోతే దాని కోసం వారిని కొట్టాల్సిన అవసరం లేదు. అయినా, ఎవరైనా ఏదైనా డ్రామా చేస్తే, మాత్రం మీరు వారిని వారి చెవి క్రింద కొట్టండి. మీరు ఎవరినైనా కొడితే ఆ ఘటనను మీరు వీడియో తీయొద్దు. ఎవరినైతే మీరు కొట్టారో ఆ వ్యక్తే తనను మీరు కొట్టారని అందరికి చెప్పనివ్వండి. ఆ విషయం మనం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు’’ అని ఉద్ధవ్ ఠాక్రే తమ అనుచరులకు సూచించారు. రాజ్ ఠాక్రే కూడా ఉద్ధవ్ ప్రసంగానికి ముందు మరాఠీలో ప్రసంగించారు.

రెండు దశాబ్దాల క్రితం విడిపోయి..

ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఇద్దరూ అన్నదమ్ముల పిల్లలు. ఉద్ధవ్ ఠాక్రే తండ్రి బాలా సాహెబ్ బాల్ ఠాక్రే కాగా, రాజ్ ఠాక్రే తండ్రి శ్రీకాంత్ ఠాక్రే బాల్ ఠాక్రే కు చిన్న తమ్ముడు. శివసేన వారసత్వంపై విబేధాలతో రెండు దశాబ్దాల క్రితం వీరిద్దరూ విడిపోయారు. ఇప్పుడు మళ్లీ అధికార బీజేపీ, శివసేన ఏక్ నాథ్ షిండ్ వర్గానికిి వ్యతిరేకంగా చేతులు కలిపారు. ముంబై నగరపాలక సంస్థతో పాటు, మహారాష్ట్రలో అధికారాన్ని కలిసి చేజిక్కించుకుంటామని ఈ సందర్భంగా ఉద్ధవ్ అన్నారు.

ఫడణవీస్ చేశారు

ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే తన ప్రసంగంలో, వేలాది మంది చేయలేని పనిని మహారాష్ట్ర బిజెపి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేశారని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉద్ధవ్, నేను 20 ఏళ్ల తర్వాత చేతులు కలిపాం. మమ్మల్ని కలిపేందుకు బాలాసాహెబ్ ఠాక్రే కూడా ప్రయత్నించారు. కానీ చేయలేకపోయారు. ఆ పనిని దేవేంద్ర ఫడ్నవీస్ విజయవంతంగా చేయగలిగారు’’ అని రాజ్ థాకరే వర్లీలో జరిగిన భారీ కార్యక్రమంలో అన్నారు.

ఉద్ధవ్ ఠాక్రేకు ప్రాముఖ్యత

బాల్ థాకరే జీవించి ఉండగానే శివసేన పగ్గాలు అప్పగించడానికి రాజ్ ఠాక్రే కంటే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రేకే ప్రాధాన్యం ఇచ్చారు. రాజ్ థాకరే 2006 జనవరిలో నాటి శివసేన నుంచి వైదొలిగి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) స్థాపించారు. ఇది 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 13 సీట్లు గెలుచుకుంది. కానీ ఆ తరువాత దాని పనితీరు నిరాశాజనకంగా ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క సీటులో కూడా గెలవలేదు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.