Floods threat to Delhi: ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న యమున నది; ఢిల్లీకి వరద ముప్పు
Yamuna water level: దేశ రాజధాని ఢిల్లీ నగరానికి వరద ప్రమాదం పొంచి ఉంది. యమున నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. యమున నది వరదలు నగరాన్ని ముంచెత్తే ప్రమాదంపై నగర ప్రజలు ఆందోళనలో ఉన్నారు. తాజా పరిస్థితి పై ఆందోళన వ్యక్తం చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కేంద్రం ఆదుకోవాలని కోరారు.
Flood threat to Delhi: ఢిల్లీలో యమున (Yamuna) నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే, ఢిల్లీని మరోసారి వరద ముంచెత్తే ముప్పు ఉంది. బుధవారం యమున నదిలో నీటి మట్టం 207.55 మీటర్లకు చేరింది. బుధవారం రాత్రి వరకు యమున నదిలో నీటిమట్టం 207.72 మీటర్లకు చేరుతుందని సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) హెచ్చరించింది.
Flood threat to Delhi: ఢిల్లీకి వరద ముప్పు
యమున నదిలో నీటి మట్టం దాదాపు గత అర్థ శతాబ్ధంలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరింది.1978లో అప్పుడు కురిసిన భారీ వర్షాల కారణంగా యమున నదిలో గరిష్ట నీటి మట్టం 207.49 మీటర్లకు చేరింది. ఇప్పుడు 2023 లో ఆ రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది. భారీ వర్షాలకు తోడు ఎగువన నీటిని వదలడంతో యమున నది మహోగ్రంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలోని పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. చాలా ప్రాంతాల్లో నీరు నివాస ప్రాంతాల్లోకి రాకుండా అడ్డుకట్టలను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను, నది ఒడ్డున ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రారంభించారు. ఒకవేళ, యమున నదిలో వరద నీరు పెరిగి, నగరంలోకి చేరితే, తీసుకోవాల్సిన సహాయ చర్యలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ విధించారు.
Kejriwal urges Centre to intervene: కేంద్రం జోక్యం చేసుకోవాలి..
ఢిల్లీలో యమున నది లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రికి యమున నదిలో నీటిమట్టం 207.72 మీటర్లకు చేరుతుందన్న సెంట్రల్ వాటర్ కమిషన్ హెచ్చరికలను ప్రస్తావిస్తూ, ఢిల్లీకి ఇది మంచి విషయం కాదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. హాత్నికుండ్ బ్యారేజీ నుంచి హరియాణా పెద్ద ఎత్తున నీటిని కిందకు వదలడం వల్లనే ఢిల్లీలో యమున నది నీటిమట్టం ఈ ప్రమాద కర స్థాయికి పెరిగిందని, అందువల్ల, కేంద్రం జోక్యం చేసుకుని, నీటిని కిందకు వదలకుండా హరియాణాకు సూచించాలని కోరారు. హరియాణాలోని హత్నికుండ్ డ్యామ్ నుంచి నీరు భారీగా దిగువకు రావడం వల్లనే, గత రెండు రోజులుగా ఢిల్లీలో వర్షం లేకపోయినా.. యమున నదిలో నీటిమట్టం ఇలా ప్రమాదకర స్థాయికి పెరిగిందని కేజ్రీవాల్ వివరించారు.
Floods in Delhi: గతంలో ఢిల్లీకి వరదలు..
రికార్డుల ప్రకారం 1924 నుంచి ఢిల్లీకి ఆరు సార్లు వరదలు వచ్చాయి. మొదట 1924 లో, ఆ తరువాత వరుసగా 1977, 1978, 1995, 2010, 2013 ల్లో ఢిల్లీకి వరదలు వచ్చాయి. యమున నదిలో భారీగా ఇసుక మేట వేయడం వల్ల నీటి మట్టం భారీగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.