Kolkata doctor rape case : 25 దేశాలు- 130 నగరాలు.. ప్రపంచవ్యాప్తంగా కోల్‌కతా ఘటనపై నిరసనలు
Kolkata doctor rape case protests : కోల్‌కతా వైద్యురాలి హత్య కేసులో న్యాయం జరగాలంటూ 25 దేశాల్లోని 130 నగరాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఇటు కోల్‌కతాలోనూ ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టారు.
కోల్‌కతా వైద్యురాలి రేప్, హత్య కేసుపై దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగానూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్‌లో ఆగస్ట్ 9న దారుణ హత్యకు గురైన వైద్యురాలికి న్యాయం జరగాలంటూ.. 25 దేశాల్లోని 130 నగరాల్లో వేలాది మంది ప్రవాస భారతీయులు ఆదివారం ఆందోళనలు చేపట్టారు.
జపాన్, ఆస్ట్రేలియా, తైవాన్, సింగపూర్ అంతటా పెద్ద, చిన్న సమూహాల్లో ప్రారంభమైన నిరసనలు అనేక ఐరోపా దేశాలలోని నగరాలకు వ్యాపించాయి. అమెరికాలో 60కిపైగా నిరసనలు చేపట్టాలని ప్లాన్స్ జరుగుతున్నాయి. ఆగస్టు 9న కోల్‌కతా వైద్యురాలి రేప్, హత్య తర్వాత భారత్ అంతటా కొనసాగుతున్న నిరసనలకు ఇవి మరింత బలం చేకూర్చాయి.
కోల్‌కతా వైద్యురాలి హత్య కేసులో భాగంగా నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి, దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్‌లో అవకతవకలపై మాజీ ప్రిన్సిపాల్‌ని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.
స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో జరిగిన ఒక నిరసనలో, ప్రధానంగా నల్ల దుస్తులు ధరించిన మహిళలు సెర్గెల్స్ టోర్గ్ స్క్వేర్‌లో గుమిగూడి బెంగాలీలో పాటలు పాడారు. భారతీయ మహిళలకు నేరానికి జవాబుదారీతనం, భద్రతను డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
“యువ ట్రైనీ డాక్టర్‌పై కృరమైన నేరం జరిగిందన్న వార్త అందరిని షాక్‌కి గురిచసింది,” అని అంతర్జాతీయ నిరసనల్లో పాల్గొన్న ఆర్గనైజర్ దీప్తి జైన్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం బ్రిటిష్ సిటిజెన్, కోల్‌కతా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పూర్వ విద్యార్థి అయిన జైన్ గత నెలలో యూకేలో మహిళా వైద్యుల నిరసనను నిర్వహించారు.
2012లో దిల్లీలో కదులుతున్న బస్సులో 23 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య తర్వాత కఠినమైన చట్టాలు ప్రవేశపెట్టినప్పటికీ, మహిళలు లైంగిక హింసను ఎలా అనుభవిస్తున్నారో కోల్‌కతా ఉదంతం తెలియజేస్తుందని ఉద్యమకారులు అంటున్నారు.
కోల్‌కతాలో కూడా..
మరోవైపు వైద్యురాలి రేప్, హత్యపై అదివారం కోల్‌కతాలో తీవ్రస్థాయిలో నిరసనలు జరిగాయి. బాధితురాలికి న్యాయం చేయాలంటూ కోల్‌కతాతో పాటు పశ్చిమబెంగాల్లోని పలు నగరాలు, పట్టణాల్లో ఆదివారం అర్ధరాత్రి నినాదాలు ప్రతిధ్వనించాయి.
ఆగస్టు 9 జరిగిన సంఘటనపై కోల్‌కతాలోని ప్రతి మూలలో నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనల్లో పాల్గొన్నవారు తమ మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్లను ఆన్ చేశారు. చాలా మంది నల్ల దుస్తులు ధరించి నిరసనలు తెలిపారు.
ఉత్తర కోల్‌కతాలోని శ్యాంబజార్ నుంచి శివారులోని సోదేపూర్ వరకు సుమారు 14 కిలోమీటర్ల మేర మానవహారం ఏర్పాటు చేశారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఐటీ ప్రొఫెషనల్స్ వంటి వైట్ కాలర్ జాబ్ హోల్డర్ల నుంచి రిక్షా పుల్లర్ల వరకు అన్ని వర్గాల ప్రజలు.. కోల్‌కతా వైద్యురాలికి న్యాయం కోసం గళమెత్తారు.
బాధితురాలికి న్యాయం చేయాలంటూ దక్షిణ కోల్‌కతాలోని రాష్ బిహారీ అవెన్యూ మీదుగా 40 పాఠశాలలకు చెందిన సుమారు 4,000 మంది పూర్వ విద్యార్థులు రెండు కిలోమీటర్లు నడిచారు.
దేశ, విదేశాల్లో నిరసనల మధ్య కోల్‌కతా వైద్యురాలి రేప్, హత్య కేసును సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.
సంబంధిత కథనం