ప్రపంచంలోనే అతిపెద్ద ‘ట్రాఫిక్​ జామ్’​- కుంభమేళా రోడ్లపై 300 కి.మీల మేర నిలిచిపోయిన వాహనాలు!-worlds biggest traffic jam 300 km long snarls choke roads to maha kumbh mela ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ప్రపంచంలోనే అతిపెద్ద ‘ట్రాఫిక్​ జామ్’​- కుంభమేళా రోడ్లపై 300 కి.మీల మేర నిలిచిపోయిన వాహనాలు!

ప్రపంచంలోనే అతిపెద్ద ‘ట్రాఫిక్​ జామ్’​- కుంభమేళా రోడ్లపై 300 కి.మీల మేర నిలిచిపోయిన వాహనాలు!

Sharath Chitturi HT Telugu
Published Feb 10, 2025 09:47 AM IST

Maha Kumbh Mela traffic jam : మహా కుంభమేళాకు వెళ్లే భక్తులను 'ట్రాఫిక్​ జామ్​' భయపెడుతోంది! ఆదివారం రద్దీ కారణంగా మహా కుంభమేళాకు వెళ్లే రోడ్లలో దాదాపు 300 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయినట్టు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్​ జామ్​ అని నెటిజన్లు చెబుతున్నారు.

మహా కుంభమేళాలో ట్రాఫిక్​ జామ్​ కష్టాలు..
మహా కుంభమేళాలో ట్రాఫిక్​ జామ్​ కష్టాలు.. (PTI)

ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​ రాజ్​లో జరుగుతున్న మహా కుంభమేళా 2025 రోజుకో రికార్డు బ్రేక్​ చేస్తోంది! కోట్లాది మంది భక్తులు కుంభమేళాను సందర్శించి పవిత్ర స్నానాలు చేస్తున్నారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్​ జామ్​ రికార్డు కూడా ఇప్పుడు కుంభమేళా పేరిట ఉండేడట్టు కనిపిస్తోంది! మహా కుంభమేళాకు దారితీసే రహదారుల్లో 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని సమాచారం!

మహా కుంభమేళాలో ట్రాఫిక్​ జామ్​ కష్టాలు..

కుంభమేళాకు వెళ్లే రహదారుల్లో వాహనాలు కిటకిటలాడుతున్నాయి. ఎటుచూసినా వాహనాలు, వాటిల్లో భక్తుల పడిగాపులే కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మత సమ్మేళనానికి హాజరు కావడానికి ఆసక్తి చూపుతున్న లక్షలాది మంది యాత్రికులు ఆదివారం కుంభమేళా ప్రాంగణానికి వందల కిలోమీటర్ల దూరంలో తమ కార్లలో చిక్కుకుపోయారు.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ అని నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. మధ్యప్రదేశ్ మీదుగా మహా కుంభమేళాకు వెళ్లే యాత్రికుల వాహనాలతో 200-300 కిలోమీటర్ల వరకు ఈ ట్రాఫిక్​ జామ్​ విస్తరించిందని, దీంతో అక్కడి పోలీసులు ఆదివారం వివిధ జిల్లాల్లో ట్రాఫిక్​ను నియంత్రించలేకపోవడంతో ప్రజలు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోయారని తెలుస్తోంది.

అయితే రద్దీ కారణంగా మధ్యప్రదేశ్​లోని చాలా రూట్స్​లో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వాహనాల్లో చిక్కుకుపోయిన వారిని, సొంతంగా షెల్టర్లు చూసుకోవాలని చెప్పడం గమనార్హం.

కట్నీ జిల్లాలో పోలీసు వాహనాలు సోమవారం వరకు ట్రాఫిక్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించగా.. మైహర్ పోలీసులు కట్ని, జబల్​పూర్ వైపు వాహనాలను తిరిగి వచ్చి అక్కడే ఉండాలని కోరారు.

200-300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఉన్నందున ప్రయాగ్​రాజ్ వైపు వెళ్లడం అసాధ్యమని పోలీసులు తెలిపారు.

మధ్యప్రదేశ్​లోని కట్నీ, జబల్​పూర్, మైహార్, రేవా జిల్లాల్లో రోడ్లపై వేలాది కార్లు, ట్రక్కులు భారీ క్యూలైన్లలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పలు వీడియోలు చూపిస్తున్నాయి.

రేవా జిల్లాలోని చక్​ఘాట్ వద్ద కట్నీ నుంచి ఎంపీ-యూపీ సరిహద్దుల వరకు 250 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

రద్దీపై ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. “జబల్​పూర్​కి ముందు 15 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్.. ప్రయాగ్​రాజ్​కు ఇంకా 400 కి.మీ. మహా కుంభమేళా కు వచ్చే ముందు ట్రాఫిక్ పరిస్థితిని తెలుసుకోండి,” అని ఒకరు పోస్ట్​ చేశారు.

సోమవారం తెల్లవారుజామున 4:30 గంటలకు ఎక్స్​లో ఒక యూజర్​ పోస్ట్ చేశాడు. “కుంభమేళా వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ (15-20 కిలోమీటర్లు) లో చిక్కుకున్నాను.. ప్రయాగ్​రాజ్ పూర్తిగా స్తంభించిపోయింది,” అని పేర్కొన్నారు.

"5 గంటల్లో - 5 కిలోమీటర్లు కదిలాము, ఈ సమయానికి నేను లక్నోలో ఉండాల్సింది. ఘోరమైన ట్రాఫిక్ మేనేజ్​మెంట్, నా విమాన టికెట్​ని రద్దు చేసి, రెట్టింపు ధరకు మరొకటి బుక్ చేయాల్సి వచ్చింది," అని పోస్ట్​లో పేర్కొన్నారు.

ఆదివారం రద్దీ.. ట్రాఫిక్ జామ్​కు దారితీసిందని ఇన్​ఛార్జి ఇన్​స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (రేవా జోన్) సాకేత్ ప్రకాశ్ పాండే తెలిపారు. రెండు రోజుల్లో పరిస్థితి సద్దుమణిగే అవకాశం ఉందన్నారు.

ప్రయాగ్​రాజ్ యంత్రాంగంతో సమన్వయం చేసుకున్న తర్వాత మధ్యప్రదేశ్ పోలీసులు వాహనాలను అనుమతిస్తున్నారని పాండే తెలిపారు.

48 గంటల పాటు వాహనాలు ట్రాఫిక్ జామ్​లో చిక్కుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 50 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి దాదాపు 10-12 గంటల సమయం పడుతోందని ఓ వ్యక్తి తెలిపారు.

మధ్యప్రదేశ్-యూపీ సరిహద్దుల్లో రద్దీని నివారించడానికి వివిధ ప్రాంతాల్లో వాహనాలను నిలిపివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

భక్తులకు సహకరించండి..

తమ ప్రాంతాల నుంచి మహా కుంభమేళాకు వెళ్లే యాత్రికులకు సహకరించాలని మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అవసరమైతే వారికి భోజనం, వసతి ఏర్పాట్లు చేయాలని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగియనున్న మహా కుంభమేళా నేపథ్యంలో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసేందుకు దేశ విదేశాల నుంచి 40 కోట్ల మంది సందర్శకులు తరలివచ్చారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.